మాటల్లో కాదు... చేతల్లో చూపు

24 Jul, 2014 04:46 IST|Sakshi
మాటల్లో కాదు... చేతల్లో చూపు

* నాది.. మనదిగా మారాలంటే.. చాలా మారాలి...
* ముఖ్యంగా మనసు.. మెదడు. సమస్యపై స్పందించే  మనసు, పరిష్కారం
* ఆలోచించే మెదడు ఉంటే చాలు...

 
మాకున్నవి ఈ రెండే.. అందుకే ఈ మార్పు.. మీరూ చూడండి అంటున్నారు ‘హైదరాబాద్ రైజింగ్’ (ఫేస్‌బుక్ పేజ్) బృంద సభ్యులు. యూత్ అంటే ఫేస్‌బుక్‌లో సెల్ఫీల అప్‌డేట్‌లూ, సొల్లు కామెంట్ల పోస్ట్‌లు మాత్రమే కాదని నిరూపించారు. ‘ద అగ్లీ ఇండియన్’ అనే ఫేస్‌బుక్ పేజ్  నుంచి స్ఫూర్తి పొందిన నగర యువతీ యువకులు.. ‘హైదరాబాద్ రైజింగ్’ అనే కమ్యూనిటీని ప్రారంభించారు. తమ వంతుగా ఒక మంచి ‘మార్పు’కు దోహదపడదామని ఆలోచించి, దీనికి వేదికగా చందానగర్‌లో అత్యంత దుర్గంధభరితంగా, సిటీలో సగటు రోడ్డుకుండే అవలక్షణాలన్నీ సొంతం చేసుకున్న రోడ్లను ఎంచుకున్నారు. నవ్వుతూ తుళ్లుతూ రిపేర్ చేయడం మొదలెట్టారు.
 
ఒక్క రోజులోనే... ఆ రోడ్లు కళకళలాడుతున్నాయి. చెత్త, కంపు, మాయమై మా సొగసు చూడతరమా అంటున్నాయి. ‘మాటలు చాలు.. చేతల్లో చూపు’ (కామ్ చాల్... మూ బంద్) అని చెప్పకనే చెప్పిన ఈ యువత  సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పనిని చేశాం అనే ఆనందంతో వెలిగే వదనాలతో మురిసిపోయారు. నలుగురికీ ఉపయోగపడే పనిని చేశామంటూ సగర్వంగా ఫేస్‌బుక్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసుకున్నారు.
 - చైతన్య.జి

మరిన్ని వార్తలు