నిన్నటి మిత్రులే.. నేటి శత్రువులు

3 Sep, 2013 14:11 IST|Sakshi
నిన్నటి మిత్రులే.. నేటి శత్రువులు

సీమాంధ్రులకు పదోన్నతులు ఎలా ఇస్తారంటున్న టీ-ఉద్యోగులు
ఉద్యోగులకు భద్రత కల్పిస్తామన్న మాటలన్నీ నీటి మూటలే
అవమానించి పంపేసినా.. కిమ్మనని నేతలు, ఉద్యోగ నాయకులు

 
''రాష్ట్ర విభజన జరిగినా ఇక్కడి ఉద్యోగులకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. ఆప్షన్లు ఉంటాయి. ఉద్యోగులు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉండవచ్చు. ఉత్తరాఖండ్ విభజన సందర్భంగా అదే జరిగింది. సర్వీసు అంశాలు కాకుండా మరేదైనా ఉంటే చెప్పండి. కృత్రిమ సమస్యలు సృష్టించడం సరికాదు''... ఇవీ ఏపీఎన్జీవోల సమ్మె విషయంలో రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.

ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ శివరామిరెడ్డి సూపరింటెండెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించగా, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, మెడికల్ జేఏసీల ప్రతినిధులు ఆయన చాంబర్‌ను ముట్టడించారు. లోపలికి వెళ్లి శివరామిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ‘మీకన్నా ఎక్కువ సీనియారిటీ ఉన్న డాక్టర్ సువర్ణకు దక్కాల్సిన పోస్టులో ఎలా కొనసాగుతారు’ అంటూ ప్రశ్నించారు. వెంటనే ఉన్నతాధికారులను కలిసి ఉస్మానియా సూపరింటెండెంట్‌గా కొనసాగలేనని చెప్పాలని, లేకుంటే ఇప్పటికిప్పుడే వైద్య సేవలు నిలిపేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఆయనను సూపరింటెండెంట్ కుర్చీ నుంచి తప్పించి సువర్ణను కూర్చొబెట్టి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఉస్మానియా దంత వైద్య కళాశాలలోనూ ఇదే పరిస్థితి.

ఇప్పటికింకా రాష్ట్రం విడిపోలేదు. కనీసం దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. కేవలం కాంగ్రెస్ పార్టకి చెందిన నిర్ణాయక మండలి సీడబ్ల్యుసీ నుంచి తాము అంటే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖమేనని ఒక్క మాట వచ్చిందంతే. ఇంకా మాట్లాడితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్టు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోం శాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అది మరో 20 రోజుల్లో మంత్రివర్గం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామన్నారు.
 

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో జరిగిన ప్రధానమైన పరిణామాలు ఇవే. అందువల్ల ఉద్యోగులకు వచ్చిన ముప్పేమీ లేదని, వాళ్లు ఎంచక్కా పనులు చేసుకోవచ్చని, పదోన్నతులు కూడా యథాతథంగా పొందొచ్చని అన్నట్లుగా హైకోర్టు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. కానీ, అప్పుడే విభజన జరిగిపోయినట్లు, తమకు రావాల్సిన పదోన్నతులు, ఉద్యోగాలను సీమాంధ్ర వాళ్లు తన్నుకెళ్తున్నట్లు భావించిన కొంతమంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సోమవారం నాడు ఇతరులను అవమానపరిచేలా ప్రవర్తించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వచ్చిన సూపరింటెండెంట్ ఉద్యోగంలో చేరిన వ్యక్తి వద్దకు గుంపుగా ఓ పాతిక మంది వెళ్లి, ఆ ఉద్యోగం చేయలేనంటూ ఉన్నతాధికారులకు చెప్పాలని బెదిరించారు. లేని పక్షంలో సహకరించేది లేదని హెచ్చరించారు. దాంతో చేయగలిగింది ఏమీ లేక.. తీవ్ర అవమాన భారంతో శివరామిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నది సీమాంధ్రుడా.. తెలంగాణ వాళ్లా అన్నది ప్రశ్న కాదు. ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్న ఒక వ్యక్తి వద్దకు వెళ్లి, నువ్వా సీట్లో కూర్చోడానికి వీల్లేదు, వెళ్లిపో అంటూ పాతికమంది వచ్చి బెదిరించి, అక్కడినుంచి పంపేస్తే.. ఆ వ్యక్తి ఎంత భయాందోళనలకు గురవుతారు.. ఎంత అవమాన భారంతో కుంగిపోతారు? సీమాంధ్ర ఉద్యోగుల రక్షణ బాధ్యత మాదీ అని ఎవరూ అడగకపోయినా తెగ ప్రకటిస్తున్న రాజకీయ నాయకులు.. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇలాంటి సంఘటనలకు ఏమని సమాధానం చెబుతారు?

సీమాంధ్ర ఉద్యోగులతో తమకు ఎలాంటి వివాదాలు లేవని, వాళ్లు.. తాము అన్నదమ్ముల్లాంటి వాళ్లమేనని, తమ పోరాటం కేవలం ఆ ప్రాంత రాజకీయ నాయకులమీద మాత్రమేనని ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకుడు దేవీప్రసాదరావు లాంటి వాళ్లు ఈ సంఘటనలకు ఏం జవాబిస్తారు? ఉద్యోగ భద్రత అనేది ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఆయా యాజమాన్యాలు కల్పించే హక్కు. ఉన్నతాధికారులు ఏ స్థానంలో పనిచేయాలని ఆదేశిస్తే ఆ బాధ్యతలను నెరవేర్చాలి. అలాంటిది, ప్రభుత్వం అప్పజెప్పిన పని చేయడానికి వీల్లేదంటూ కొంతమంది వెళ్లి బెదిరించి, కుర్చీలోంచి లాగి పారేస్తే అవతలి వాళ్లు ఎలా భావిస్తారు? ఏపీ ఎన్జీవోలు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని చాలామంది చెబుతున్నారు. కానీ, గతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగినప్పుడు సాక్షాత్తు కోర్టులో ఎలాంటి సంఘటనలు జరిగాయో అందరికీ తెలుసు. న్యాయమూర్తుల మీద పుస్తకాలు విసిరేసిన సంఘటన కారణంగా ఓ సీనియర్ న్యాయమూర్తి తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేయడానికి సైతం సిద్ధపడిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. కానీ ఇప్పుడు ఏపీ ఎన్జీవోల సమ్మె విషయంలో అలాంటివి ఏమీ జరగట్లేదు. అయినా దాన్ని మాత్రం అక్రమం అంటున్నారు. అంటే.. ఏది అక్రమమో, ఏది సక్రమమో ఎలా తేలుస్తారు?

ఏపీ ఎంప్లాయీస్ కాండక్ట్ రూల్స్‌లోని రూల్ (4) ప్రకారం ఉద్యోగులు సమ్మెచేయడం నిషేధం, రూల్ (5) ప్రకారం ఎలాంటి ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదు. అయినప్పటికీ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నార'ని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల తరఫున వాదించిన సత్యంరెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉందని కూడా ఆయన ధ్రువీకరించేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఉన్న ఆర్టికల్ 371(డి) ప్రకారం, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధి లాంటి విషయాల్లో అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంది. అయినా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సి వస్తే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? విభజనకు అనుకూలంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, దాన్ని అమలుచేయడానికి పాత రాష్ట్రాల అనుభవాలను బట్టి చూస్తే ఎంత లేదన్నా మూడు నాలుగేళ్లు పడుతుంది. పైగా రాజధానిగా ఉన్నప్రాంతం ప్రత్యేకంగా విడిపోవడం అంటూ ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడా లేదు. దీంతో అనేక సమస్యలు వస్తాయి. వీటన్నింటికీ పరిష్కారం చూపకముందే రాష్ట్ర ఏర్పాటు గురించిన ప్రకటనలను కేంద్ర మంత్రులు ఎడా పెడా ఇష్టారాజ్యంగా చేసి పారేస్తుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లకు ఆందోళన కలగకుండా ఏమవుతుంది? ఈ భేతాళ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలంటే విక్రమార్కుడు కత్తి పట్టుకుని మళ్లీ శ్మశానానికి బయల్దేరాల్సిందేనేమో!!

మరిన్ని వార్తలు