షెహన్ షా ఏ ఘజల్..

18 Dec, 2014 00:18 IST|Sakshi
షెహన్ షా ఏ ఘజల్..

 షెహన్ షా ఏ ఘజల్.. ఔను! ఘజల్ ప్రపంచానికి ఆయన మకుటం లేని మహారాజు. బాలీవుడ్ పుణ్యాన ‘ఘజల్ కింగ్స్’గా వెలుగొందిన గాయక దిగ్గజాలకు సైతం ఆయన గురుతుల్యుడు. బాంబేలో స్థిరపడితే అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయని ఎంతమంది ఎంతలా ఊరించినా, పుట్టిన నేల విడిచి సాము చేసేందుకు ఇష్టపడని అసలు సిసలు హైదరాబాదీ విఠల్‌రావు. చివరి నిజాం సంస్థానంలో చివరి ఆస్థాన గాయకుడు ఆయన. నిజాం రాజ్యం అంతరించింది కానీ, విఠల్‌రావు ఘజల్ సామ్రాజ్యం మాత్రం విస్తరించింది. ఆడుతూ పాడుతూ సాగే బాల్య దశలోనే పాట ఆయనను పెనవేసుకుంది. ఆ పాటే ఆయనను పట్టుమని పదమూడేళ్ల బాలుడిగా ఉన్నప్పుడే నిజాం ఆస్థానం వరకు తీసుకుపోయింది.
 
గోషామహల్ స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలో తోటి విద్యార్థులకు ‘షాహే దక్కన్ జిందాబాద్’ అనే పాట నేర్పించాడు. ఆ పాట ప్రభావంతో ఆ నోటా ఆ నోటా విఠల్‌రావు పేరు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు వ్యాపించింది. విఠల్ నోట పాట వినాలని ముచ్చటపడ్డ నిజాం ప్రభువు కబురు పంపాడు. బెరుకు బెరుకుగానే నిజాం ఆస్థానంలో హాజరైన విఠల్, నెమ్మదిగా ధైర్యం కూడదీసుకుని గొంతెత్తి పాడాడు. ఆ పాటకు నిజాం ప్రభువు పరవశించాడు. పేరేమిటని అడిగాడు. ‘విఠల్‌రావు’ అని బదులివ్వడంతో ‘యే ఘజబ్ హై’ అంటూ ఆశ్చర్యపోయాడు. వరుసగా పదిరోజులు ఇదే తంతు సాగింది. విఠల్‌ను పిలిపించకుని, ఆయన పాట వినడం ‘యే ఘజబ్ హై’ అంటూ ఆశ్చర్యపోవడం. హిందువుల కుర్రాడికి అంత చక్కని ఉర్దూ ఉచ్చారణ ఎలా అబ్బిందనేదే నిజాం ప్రభువు ఆశ్చర్యానికి కారణం. నిజాం ప్రభువు అంతటితో సరిపెట్టుకోలేదు. విఠల్‌రావు ఇంటికి వెయ్యిరూపాయల నజరానా పంపాడు.
 
 నిజాం కుటుంబంతో అనుబంధం
 పదమూడేళ్ల బాల్యంలో నిజాం ప్రభువును మెప్పించిన విఠల్‌రావు, ఆయన ఆస్థానంలో చోటు సంపాదించుకోవడమే కాదు, అనతికాలంలోనే నిజాం కుటుంబానికి సన్నిహితుడయ్యాడు. నిజాం తనయులు టకీ జా బహదూర్, హస్మ్ జా బహదూర్‌లు నిర్వహించే మెహఫిల్ కార్యక్రమాల్లో విఠల్‌రావు గానం తప్పనిసరి అంశంగా ఉండేది. అప్పటి యువరాజు ప్రిన్స్ మొజాం జా బహదూర్ అయితే, విఠల్‌రావును తన కొడుకులతో సమానంగా ఆదరించాడు. నగర ప్రముఖులందరినీ ఆహ్వానించి ఏర్పాటు చేసిన ఒక పెద్ద పార్టీలో విఠల్‌రావును ప్రిన్స్ మొజాం జా ‘‘నా తనయుడు ‘విఠల్ జా’..’ అని పరిచయం చేశాడంటే, నిజాం కుటుంబంతో విఠల్‌రావు సాన్నిహిత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. పండిట్ లక్ష్మణ్‌రావు పంచ్‌పోటి, ఉస్తాద్ బడే గులాం అలీఖాన్, ఆయన సోదరుడు బర్కత్ అలీఖాన్ వంటి దిగ్గజాల వద్ద సంగీతం నేర్చుకున్న విఠల్‌రావును ఇప్పటికీ సీనియర్ ఘజల్ కళాకారులంతా గురుతుల్యుడిగా గౌరవిస్తారు.
 
 ఈ గాలి.. ఈ నేల..
 ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు.. సెలయేరు.. అన్నట్లుగా విఠల్‌రావుకు హైదరాబాద్ నగరంపై, ఇక్కడి పరిసరాలపై అంతులేని మమకారం. నిజాం ఆస్థాన గాయకుడిగా వెలుగొందుతున్న కాలంలోనే ఆయన ప్రాభవం బాలీవుడ్ వరకు వ్యాపించింది. నౌషాద్, మహమ్మద్ రఫీ ఆయనను బాంబే వచ్చేయాలంటూ చాలా నచ్చచెప్పారు. ‘సుఖ్‌దుఃఖ్’ అనే సినిమాకు విఠల్‌రావు సంగీతం సమకూర్చారు. అందులో పాటలన్నీ బాగానే ఆదరణ పొందినా, ఆ సినిమా బాగా ఆడలేదు. మరికొన్ని సినిమా యత్నాలూ ఫలప్రదం కాలేదు. ‘హైదరాబాద్ మట్టిలో మహత్తు ఏదో ఉంది. దీనిని ఒకసారి అనుభవిస్తే, ఎవరూ దీనిని వదులుకోలేరు’ అనే విఠల్‌రావు, గత వైభవ నిదర్శనంగా తాను పుట్టిపెరిగిన గోషామహల్ ప్రాంతంలోనే ఇప్పటికీ ఉంటున్నారు.
 -  పన్యాల జగన్నాథదాసు
 హైదరాబాదీ, పండిట్ విఠల్‌రావు

మరిన్ని వార్తలు