బస్సుల్లో ప్రమాదకర పదార్ధాల రవాణా

30 Oct, 2013 19:51 IST|Sakshi
బస్సుల్లో ప్రమాదకర పదార్ధాల రవాణా

 ప్రయాణికులను మాత్రమే తీసుకువెళ్లవలసిన బస్సులలో పేలుడు పదార్ధాలు, ప్రమాదకర రసాయన, ఇతర పదార్ధలు కూడా అక్రమంగా రవాణా చేస్తున్నారు. దాదాపు అన్ని ట్రావెల్స్ సంస్థలకు చెందిన బస్సులలో అనుమతిలేకుండా అక్రమంగా ఇటువంటి పదార్ధాలను రవాణా చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తారు. ఆ తరువాత ఆ విషయం మరచిపోతారు. ఇదంతా షరామామూలైపోయింది. మనుషుల ప్రాణాలంటే ఈ అధికారులకు ఎంత చులకన!

మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామం సమీపంలో ఎన్హెచ్ 44పై బుధవారం ఉదయం ఘోర ప్రమాదానికి గురైన ఓల్వో బస్సులో కూడా ప్రమాదకర పదార్ధాలు రవాణా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ బస్సు లగేజీ భాగంలో ఊలు పదార్థాలు ఉండటం వల్ల మంటలు వెంటనే దట్టంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ఊలు ప్రమాదానికి కారణం కాకపోయినప్పటికీ, తక్షణం మంటలు వ్యాపించడానికి మాత్రం కారణమయిందని చెప్పవచ్చు. ఈ ఓల్వో బస్సు బెంగళూరు కేంద్రంగా పని చేసే జబ్బర్ ట్రావెల్స్కు చెందినది. ఈ బస్సులో  ప్రమాదకర పదార్ధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఈ ట్రావెల్స్కు చెందిన గోడౌన్లో కెమికల్స్, ఇతర ప్రమాదకర పదార్ధాలు ఉన్నాయి.

బెంగళూరు నుంచి వస్తుండగా  ఉదయం 5:10 గంటలకు  హైదరాబాద్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు ప్రమాదానికి గురైంది.  బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 45 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
అతివేగంగా వస్తున్న బస్సు మరో వాహనాన్ని తప్పించబోయే సమయంలో కల్వర్టును ఢీకొంది. దాంతో డీజిల్‌ ట్యాంకు పగిలిపోయి  పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. బస్సు లగేజీ భాగంలో ఊలు పదార్థాలు ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయి. దానికి తోడు డ్రైవర్, క్లీనర్ బస్సులో నుంచి దూకి పారిపోయారు. లాక్ అయిన ఆటోమేటిక్‌ డోరును తీసేవారులేరు. నిమిషాల వ్యవధిలోనే గాఢ నిద్రలో ఉన్న 45 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. అద్దాలు పగులగొట్టి అయిదుగురు మాత్రంమే బస్సులో నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రయాణికులు మాత్రమే ప్రయాణించవలసిన బస్సుల్లో ప్రమాదకర పదార్దాలు రవాణా చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణనష్టం అధికం కావడానికి అవి కారణమవుతాయి. అలాగే ప్రమాదానికి గురైన బస్సుకు ఒక్కరే డ్రైవర్ ఉన్నాడు. వాస్తవానికి దూర ప్రయాణాలు చేసే బస్సులకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. రెండవ డ్రైవర్ను ఏర్పాటు చేయకపోవడం ట్రావెల్ ఏజన్సీ నిర్లక్ష్యం. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. అధికారులకూ తెలుసు. కానీ మళ్లీ అక్కడా నిర్లక్ష్యం, నిర్లక్ష్యం.... నిర్లక్ష్యం ఎన్ని ప్రాణాలనైనా బలి తీసుకుంటుంది! అందుకు కారణమైనవారికి మాత్రం బుద్దిరాదు!!

మరిన్ని వార్తలు