ఆట కోసం పెళ్లి వద్దంది!

26 Feb, 2014 21:11 IST|Sakshi
ఆట కోసం పెళ్లి వద్దంది!

సాధారణంగా పెళ్లి కోసం కెరీర్ను త్యాగం చేస్తుంటారు యువతులు. అయితే భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ మాత్రం క్రికెట్ కోసం కళ్యాణాన్ని కాదనుకుంది. ఆలుమగల బంధం కంటే ఆటకే ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. క్రికెట్ కోసం తనను కావాలనుకున్న వాడిని కూడా వదులుకుంది. ప్రేమనూ త్యాగం చేశారు. క్రికెట్ కావాలా, ప్రేమ కావాలా అంటే ఆమె ఆటకే ఓటు వేసింది. ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా తనకెంతో ఇష్టమైన క్రీడలోనే కొనసాగుతోంది 30 ఏళ్ల ఈ హైదరాబాదీ క్రికెటర్.

25 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని మిథాలి తెలిపింది. నిజంగా పెళ్లాంటు చేసుకుంటే అతడినే చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించింది. పెళ్లైన తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పాలని అతడు కోరాడని, అందుకు తాను అంగీకరించకపోవడంతో తమ ప్రేమ పెళ్లిపీటలు ఎక్కకుండానే ఆగిపోయిందని వివరించింది. క్రికెట్ను వదిలిపెట్టేందుకు తన మనసు అంగీకరించలేదని స్పష్టం చేసింది. జరిగినపోయిన దాని గురించి చితించడం లేదని అంటోంది ఈ సీనియర్ క్రికెటర్. మరికొన్నేళ్ల పాటు ఆటను ఆస్వాదించాలన్నదే తన ముందున్న లక్ష్యమని చెప్పింది.

వయసు మీద పడుతుందన్న భయం తనకు లేదని దీమా చెబుతోంది మిథాలి. అయితే తనకు పెళ్లెప్పుడవుతుందని తల్లిదండ్రులు, బంధువులు ఎదురు చూస్తున్నారని చెందుతున్నారని చెప్పింది. తనకు సంబంధాలు కూడా చూస్తున్నారని వెల్లడించింది. తనకు పెద్దలు చూసిన సంబంధాలు తనకు నచ్చవని కుండబద్దలు కొట్టింది. అయితే పెళ్లికి తొందర పడడం లేదని తెలిపింది. మళ్లీ ప్రేమలో పడేందుకు తన టైమ్ లేదని అంది. తన భావాలకు విలువిచ్చే వ్యక్తినే పెళ్లాడతానని పేర్కొంది. ప్రస్తుతం తన మనసులో ఎవరూ లేరని, ఆటపైనే దృష్టి పెట్టానని తెలిపింది. టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు మిథాలీరాజ్ సారథిగా ఎంపికైన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు