పదేపదే.. కాలు తాకాడు: ఎంపీ భార్య

19 Mar, 2018 13:24 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : కేరళ కాంగ్రెస్‌ చీఫ్‌ కేఎం మణి కోడలు, ఎంపీ జోస్‌ మణి భార్య నిషా జోస్‌ ఓ పుస్తకంలో రాసుకున్న జ్ఞాపకాలు కలకలం రేపుతున్నాయి. ‘రాజకీయ నేత భార్యగా తన జీవితానుభవాలు’ పేరిట ఆమె రాసిన పుస్తకం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో తాను రైలులో ప్రయాణిస్తుండగా చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటనను ఆమె ప్రస్తావించడంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది.

2012లో తనతో కలిసి ప్రయాణించిన ఓ రాజకీయ నేత లక్ష్మణరేఖ దాటారంటూ పేరు వెల్లడించకుండా జోస్‌ మణి పేర్కొనడం దుమారం రేపుతోంది. ఆ వ్యక్తి తన కాలును ఉద్దేశపూర్వకంగా పలుమార్లు తాకారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను ట్రైన్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ)కు ఫిర్యాదు చేసినా ఆయన తనకు సాయపడలేదన్నారు. నిందితుడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే తాను ఇబ్బందుల్లో పడతానని అతను భయపడినట్టు చెప్పారని ఆరోపించారు. నిందితుడు మిత్ర పక్షానికి చెందిన నేత కావడంతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోమని రైల్వే అధికారి తనకు ఉచిత సలహా ఇచ్చారని ఆమె రాసుకొచ్చారు.  

తాను రైల్వే స్టేషన్‌లో ఉండగా, సదరు వ్యక్తి తాను ఓ రాజకీయ నేత కుమారుడినని పరిచయం చేసుకున్నారని, రైలు ఎక్కిన తర్వాత కూడా అతను తనతో మాట్లాడేందుకు ప్రయత్నించాడని అప్పటి ఘటనను ఆమె ప్రస్తావించారు.మరోవైపు ఆమె చేసిన వ్యాఖ్యలపై కేరళ ఎంఎల్‌ఏ పీసీ జార్జ్‌ కుమారుడు షోన్‌ జార్జ్‌ స్పందించారు. తనను వేధించిన వ్యక్తి పేరును ఆమె వెల్లడించాలని కోరారు. పుస్తకాన్ని ప్రమోట్‌ చేసుకునేందుకే జోస్‌ మణి ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు నిషా, జార్జ్‌లు ఇద్దరూ కాంగ్రెస్‌ కేరళ రాష్ట్ర శాఖలో పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు