సేవకు సలామ్

28 May, 2015 01:10 IST|Sakshi
సేవకు సలామ్

మనిషికి ఎలాంటి శారీరక, మానసిక సమస్య ఎదురైనా తలచుకునేది దైవాన్ని.. కలుసుకునేది వైద్యుడిని. అలాంటి వైద్య వృత్తికే వన్నె తెచ్చారు సిటీకి చెందిన యువ డాక్టర్లు. నేపాల్ భూకంపంలో క్షతగాత్రులైనవారికి సేవలు అందించేందుకు ముందుకు రావాలని ‘క్యూరోఫి’ యాప్‌లో పోస్ట్ వచ్చింది. ఇది చూసిన సిటీకి చెందిన ‘ఆకృతి, విశిష్ట, యశ్వంత్’ స్పందించారు. కామినేని ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆకృతి, నిమ్స్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా సేవలందిస్తున్న విశిష్ట, శ్రీకాకుళం జీఎంఎస్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న యశ్వంత్ ఇక్కడి నుంచి పయనమయ్యారు. వీరికి భోపాల్ నుంచి ముగ్గురు డాక్టర్లు, ముంబై, ఢిల్లీ నుంచి ఒక్కో వైద్యుడు చేయందించారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపాల్ ప్రజలకు వైద్య సేవలు అందించారు. అక్కడ తాము ఎదుర్కొన్న అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు ఆకృతి, విశిష్ట, యశ్వంత్. ఆ వివరాలు వారి మాటల్లోనే..
 - సాక్షి, సిటీబ్యూరో
 
- నేపాల్ భూకంప ప్రాంతంలో వైద్యశిబిరాలు
- ప్రాణాలను పణంగా పెట్టి సిటీ వైద్యుల సేవలు

 
ఇలా మొదలైంది..

‘మే 6న కాట్మాండ్‌కు బయలుదేరాం. ఏడున అక్కడ మెడికల్ క్యాంప్ పూర్తయింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి సింధుపాల్ చౌక్ ప్రాంతానికి చేరుకున్నాం. నేపాల్‌లో ఎక్కడ భూకంపం వచ్చినా ఆది సింధుపాల్ చౌక్ నుంచి మొదలువుతుందని విన్నాం. అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. సమీప ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. రక్తపు మడుగుల్లో ఉన్నవారిని చూస్తే బాధేసింది. పోలీసులు, నేపాల్ ఆర్మీతో కలిసి క్షతగాత్రులకు వైద్యం అందించాం. అప్పటికే కొండచరియలు విరిగిపడటంతో మెడిసిన్ బ్యాగులను మోసుకుంటూ కొండలపైకి వెళ్లాం. 10,11 తేదీల్లో గ్రామాల్లో మెడికల్ క్యాంప్ చేశాం. ఆ తర్వాత లమసాంగ్ నుంచి 11.5 కిలోమీటర్ల దూరంలో ఉండే నేపాల్, చైనా బార్డర్‌కు బయలుదేరాం. ఈ సమయంలోనే మా కళ్ల ముందే మరోసారి భూకంపం వచ్చి కొండచరియలు విరిగిపడ్డాయి’
 
సమయం: మే 13 ఉదయం..

మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య మరోసారి భూకంపం వస్తుందని ప్రకటించారు. ఆర్మీ అధికారులు వెంటనే కాట్మాండ్ బయలుదేరమన్నారు. లమ్‌సాంగ్ నుంచి కాట్మాండ్‌కు 2.30 గంటలు పడుతుంది. మధ్యలో అన్నీ కొండలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎలాగైతేనేం సాయంత్రానికి కాట్మాండ్ చేరుకున్నాం. మరుసటి రోజు అక్కడి పోలీసు అకాడమీలో వైద్య శిబిరం నిర్వహించాం. ఆ రోజు రాత్రికే మమ్మల్ని ఢిల్లీకి పంపించారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. సేవ ముందు మా ప్రాణ భయం మోకరిల్లింది’ అంటూ ముగించారు.
 
క్షణక్షణం భయం భయం..
‘జంబూ విలేజ్‌కు చేరుకోగానే కొండచరియ విరిగిపడటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం భూకంపం వచ్చింది. కొండలు పడిపోయాయి. చాలా మంది చనిపోయారు. జంబూ కొండ దిగువనున్న గంగా నది వద్ద రెండు గంటలు పాటు ఉన్నాం. అప్పటికే సాయంత్రమైంది. మేం వైద్యులమని తెలియగానే జంబూ గ్రామస్తులు సమూహంగా మా వద్దకు వచ్చారు. వారందరికి వైద్యం చేశాం. అప్పటికి ఆర్మీ రోడ్డును క్లియర్ చేసింది. జంబూలోని విరిగిపడిన పెద్ద కొండను పెకలించాలంటే బాంబు పెట్టాలి. అప్పటికే సమయం దాటిపోయింది. దీంతో రోడ్డుపై పడిన కొండ ఎక్కి, దూకాం. రోడ్డు ఇరువైపులా ఉన్న కొండలు ఏ సమయంలోనైనా పడిపోవచ్చనే సమాచారంతో సుమారు ఎనిమిది కిలోమీటర్లు పరుగుపెట్టాం. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అటువైపుగా వచ్చిన ఆర్మీ జీపు ఎక్కి లమసాంగ్‌కు వెళ్లాం. అప్పటికే మాకు కేటాయించిన గెస్ట్‌హౌస్ కకావికలమైంది. ఆ రోజు రాత్రంతా కొండ ఊగింది.. ఎవరికీ నిద్ర లేదు. ఇంత భయంలోనూ మా వైద్య సేవలు ఆపలేదు. మేం ఎక్కడ ఉంటే అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాం.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా