ఓర్వలేనితనం వద్దు... ఓపిక పట్టు!

4 Jul, 2013 04:13 IST|Sakshi
ఓర్వలేనితనం వద్దు... ఓపిక పట్టు!
 ‘‘ఎంతో పుణ్యంచేసుకుంటే తప్ప లభించని మనిషి పుట్టుక పుట్టి  పరనిందకు పాల్పడటమంటే అవతలివారి మలినాలను నీ నాలుకతో శుభ్రపరుస్తున్నట్టే లెక్క. ఇకముందెప్పుడూ అలా చేయకు’’  అంటూ తీవ్రంగా మందలించారు. బాబా చెప్పిన నీతి గ్రహించిన ఆ భక్తుడు వెంటనే తన తప్పు దిద్దుకున్నాడు. 
 
 మనం ఆధ్యాత్మిక ఉన్నతి, ప్రాపంచిక ప్రగతి సాధించాలంటే సద్గురువు సహాయం ఉండి తీరాలి. గురువు ఉంటే మన లక్ష్యసాధన సులభమవుతుంది. శిష్యుల ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడేవాడే ఉత్తమ గురువు. అందుకే గురువును సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్త స్వరూపంతో పోలుస్తారు. బాబా అచ్చంగా అటువంటి సద్గురువు. ఆత్మసాక్షాత్కార సాధనకు మార్గం చూపించే చుక్కాని వంటివాడు. 
 
 శ్రీసాయి బోధనకు ప్రత్యేక స్థలం, సమయం, సందర్భం ఉండేవి కావు. సందర్భావసరాలను బట్టి బాబా ప్రబోధం ప్రవాహం మాదిరిగా జాలువారేది. ఒకనాడు ఒక భక్తుడు ఇంకో భక్తుని గురించి అతని పరోక్షంలో ఇతరుల ముందు నిందించసాగాడు. తోటి భక్తునిలోని ఒప్పులను విడిచి, అతను చేసిన తప్పులను కావాలనే ఎత్తి చూపుతూ హీనంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అతని తీరుతో పక్కనే ఉన్న ఇతర భక్తులు నొచ్చుకున్నారు. తన సర్వజ్ఞతతో సదరు భక్తుని బుద్ధిని  గ్రహించారు బాబా. పరనిందకు పాల్పడిన భక్తుడిని సరిదిద్దాలనుకున్నారు. 
 
 ఒకనాడు మిట్టమధ్యాహ్నం వేళ బాబా లెండీ తోటకు వెళ్లేటప్పుడు తోటి భక్తుడిని నిందించిన భక్తుడు బాబాకు ఎదురుపడ్డాడు. అప్పుడు బాబా వానికొక పందిని చూపి ‘‘చూడు! ఈ పంది అమేథ్యాన్ని ఎంత రుచిగా తింటోందో! నీ స్వభావం కూడా అటువంటిదే. ఎంత ఆనందంగా నీ తోటి సోదరుని తిడుతున్నావు? ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప లభించని మనిషి పుట్టుక పుట్టి పరనిందకు పాల్పడటమంటే అవతలివారి మలినాలను నీ నాలుకతో శుభ్రపరుస్తున్నట్టే లెక్క. ఇకముందె ప్పుడూ అలా చేయకు’’ అంటూ తీవ్రంగా మందలించారు. బాబా చెప్పిన నీతి గ్రహించిన ఆ భక్తుడు వెంటనే తన తప్పు దిద్దుకున్నాడు. 
 
 సాధారణంగా కోరికలు మోక్షం పొందడానికి అడ్డంకిగా నిలుస్తాయని, మొదటవాటిని వదిలించుకుంటే తప్ప దుఃఖానికి దూరం కాలేమని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాని, శ్రీసాయి మాత్రం తన భక్తులకు అలాంటి నిబంధన విధించలేదు. పైగా మీరు సప్త సముద్రాల ఆవల ఉన్నా, వెయ్యిక్రోసుల దూరాన ఉన్నా నన్ను ప్రేమతో పిలిచి కోరిక చెప్పుకుంటే తీరుస్తాను’’ అని వాగ్దానం చేశారు. ఇప్పటికీ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. శ్రీసాయి మనిషిని ఉన్నతంగా మలచడానికి సులభోపాయాలు బోధించారు. పూజలు, పురస్కారాలు అవసరం లేదన్నారు. యజ్ఞయాగాదులతో కూడా పనిలేదన్నారు. మోక్షం పొందడానికి సంసారాన్ని విడిచి పెట్టనక్కరలేదన్నారు. కోరికల్ని విడిచిపెట్టాలని కూడా ఎప్పుడూ చెప్పలేదు. భగవంతుడిని భక్తివిశ్వాసాలతో కొలవండి. భగవంతుని కరుణ కోసం కాస్తంత శ్రద్ధ, ఓపికలతో ఎదురు చూడండి. మీకేం కావాలో అది నెరవేరుతుంది’’ అని భక్తులకు అభయమిచ్చారు. అంతేకాదు, ఆయన తన అవతార కాలాన్నంతా మానవ జన్మ పరమార్థాన్ని, ప్రాముఖ్యాన్ని చాటడానికే వినియోగించారు. చెన్న బసప్ప- వీరభద్రప్ప (పాము- కప్ప) కథ ద్వారా అసూయా ద్వేషాలను విడిచి పెట్టాలని, పంది అశుద్ధాన్ని తింటున్న సన్నివేశాన్ని చూపడం ద్వారా తన భక్తుడికి పరనింద కూడదని బోధించారు. 
 
 - డా. కుమార్ అన్నవరపు
 
 బాబా బోధలు... 
 ఏకాగ్రతతో పని చేయండి.
 
 కార్యసాధనలో బద్దకం, అలసత్వం, సోమరితనం, వాయిదాలు వేసే తత్వాన్ని వీడండి. 
 
 మనసును నిత్యం నిర్మలంగా ఉంచుకోండి. 
 
 అనవసర చర్చలు, వాదులాటలు, కీచులాటలు మానండి. 
 
 మంచి పని చేసి అందులో ఉన్నతిని సాధించడానికి సదా ప్రయత్నించండి. 
 
 ఎప్పుడూ ప్రశాంతంగా ఉండండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులూ అన్నీ వాటంతట అవే కుదుటపడతాయి. 
 
 కలసి ఉంటే కలదు సుఖం. దీనిని నిరంతరం గుర్తుంచుకోండి. 
 
 నిదానమే ప్రధానం. ఏ పనిలోనూ తొందరపాటును ప్రదర్శించకండి. 
 
 వంశాచారంగా ఆగిపోయిన కార్యక్రమాలేమైనా ఉంటే వాటిని తిరిగి ప్రారంభించండి. శుభం పొందుతారు. 
 
 సమభావంతో నడవడం మరవొద్దు. 
 
 వాగ్వివాదాలతో కించిత్ ప్రయోజనం కూడా లేదు. సమయాన్ని వాదులాటతో వృథా చేయవద్దు. కాలక్షేపం కబుర్లతో పొద్దుపుచ్చకండి.
మరిన్ని వార్తలు