ఆర్నెల్ల కాలం, అంతా శూన్యం

3 Dec, 2014 00:48 IST|Sakshi
దేవులపల్లి అమర్

 డేట్‌లైన్ హైదరాబాద్

 ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు కొన్ని గంటల తేడాతో దాదాపు ఒకే విధంగా  చేసిన వ్యాఖ్యానాల గురించి ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి. తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పింఛన్లు ఐదు రెట్లు పెంచినా ప్రభుత్వానికి మంచిపేరు రాలేదు అని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రుణమాఫీ అంశం గురించి నియమించిన మంత్రివర్గ ఉపసంఘ సభ్యులను, అందుబాటులో ఉన్న ఇతర మంత్రులను ఆగమేఘాల మీద సమావేశపరచి రుణమాఫీ విషయంలో జరుగుతున్న జాప్యం గురించి చర్చించినట్టు వార్తలు వెలువడ్డాయి.
 
 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మొన్నటికి సరిగ్గా ఆరునెలలు పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రజాప్రభుత్వాలు ఏర్పడి కూడా అటు ఇటుగా ఆరునెలలే. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి ఐదేళ్ల కోసం ప్రజలు అధికారం కట్టబెట్టిన కాలంలో ఈ ఆరు నెలల కాలం పదో వంతు. ఇంకా తొమ్మిది వంతుల కాలం ఉంది, రెండు రాష్ట్రాలలోనూ అధికార పార్టీలు తమ పాలనా దక్షతను నిరూపించుకోడానికీ, ప్రజాసేవ చేయడానికీ. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి కూడా ఇంచుమించు ఇంతే కాలం గడచింది.

 ప్రశ్నించక తప్పని పరిస్థితి
 మామూలుగా అయితే ఆరునెలల కాలం ఎక్కువేమీ కాదు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అయిదేళ్ళ సమయం ఇవ్వాల్సిందే. అయితే ఎలాగయినా సరే అధికారంలోకి వచ్చేయా లన్న తొందరలో రెండు రాష్ట్రాల ఏలికలు ఎన్నికలకు ముందు ప్రకటించిన అలవికాని వాగ్దానాల కారణంగానే ఆరు నెలల్లో మీరేం చేశారు? అని ప్రజలు, వారి  తరఫున మీడియా ప్రశ్నించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే తక్షణ సమస్యలు, దీర్ఘ కాలిక సమస్యలు రెండూ ఉంటాయని  కాకలు తీరిన మన రాజకీయ నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రాష్ట్రాల అధినేతలూ ఎన్నికల సమయంలో ఒకటీ, రెండూ కాదు;  బోలెడు హామీలు ఇచ్చారు. ఈ హామీల జాబితాలో తక్షణ, దీర్ఘకాలిక సమస్యలు రెండూ ఉన్నాయి. అధికారంలోకి రాగానే ఈ తక్షణ సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించి, జనానికి ఊరట కలిగించి అప్పుడు దీర్ఘకాలిక సమస్యల ైవైపు చూపు మళ్లించి ఉంటే ఏ మేరకు ఫలితం సాధించినా ప్రజలు హర్షించి ఉండేవారు. కానీ అలా జరగలేదు. కాబట్టే ఆరు నెలలకే ప్రజలు నిలదీసి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాలని అడిగే పరిస్థితి రెండు రాష్ట్రాలలోనూ వచ్చింది.

 అపజయాలను అంగీకరించినట్టే!
 కాకతాళీయంగా జరిగిందో, ఉద్దేశపూర్వకంగానే జరిగిందో తెలియదు కానీ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు కొన్ని గంటల తేడాతో దాదాపు ఒకే విధంగా  చేసిన వ్యాఖ్యానాల గురించి ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి.  తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం జిల్లా కలెక్టర్‌లతో మాట్లాడుతూ పింఛన్ల మొత్తం ఐదు రెట్లు పెంచినా ప్రభుత్వానికి మంచిపేరు రాలేదు అని వాపోయారు. లబ్ధిదారుల ఎంపికలో జాప్యం వల్లనే ఆందోళన మొదలైందని, ఇందుకు అధికార యంత్రాంగానిదే పూర్తి బాధ్యత అని అన్నారాయన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రుణమాఫీ అంశం గురించి నియమించిన మంత్రివర్గ ఉపసంఘ సభ్యులను, అందుబాటులో ఉన్న ఇతర మంత్రులను ఆగమేఘాల మీద హాజరుపరచి రుణమాఫీ విషయంలో జరుగుతున్న జాప్యం గురించి చర్చించినట్టు వార్తలు వెలువడ్డాయి. మంత్రులతోపాటు కొందరు పార్టీ సీనియర్ నాయకులను కూడా పిలిచి మాట్లాడారు చంద్రబాబు. ఈ వారం రోజులలో ఏదో ఒకటి చేసెయ్యా లనే నిర్ణయానికి వచ్చినట్టు మీడియాకు లీకులు అందాయి. రేపు ఇదే విష యాన్ని  మరింత లోతుగా చర్చించనున్నారని సమాచారం.

 అక్కడా ఇక్కడా రైతుల ఆత్మహత్యలే!
 తెలంగాణ  ముఖ్యమంత్రికి అసంతృప్తి కలిగించిన పింఛన్ల వ్యవహారం కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంగళవారంనాడు హడావుడి చేసిన రైతు రుణ మాఫీ కానీ తక్షణ సమస్యల జాబితాలోకి వస్తాయి. రాష్ర్ట విభజనానంతరం  తెలంగాణ  రాష్ర్టంలో అన్ని రకాల పింఛన్లు ఆగిపోయాయి. వృద్ధులు, వికలాం గులు, వితంతువులు లెక్కలేనంత మంది ఈ కారణంగా నానా అవస్థలు పడుతున్నారు. పూట గడవడం కష్టంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ తీరు, నాయకుల ప్రకటనలు పింఛన్లు నిలిపివేస్తారేమోనన్న అనుమానం చాలా మందిలో కలిగించాయి. సమగ్ర సర్వే పేరిట ప్రభుత్వం చేసిన ఆర్భాటం అందుకు దోహదం చేసింది. సర్వే వల్ల సాధించింది ఏమిటో ఇప్పటికీ ప్రభు త్వానికే అర్థం అయినట్టు లేదు. ఆ సర్వే సక్రమ, ఆశించిన ఫలితం ఇచ్చినట్ట యితే, చంద్రశేఖర్‌రావు కలెక్టర్‌ల దగ్గర పింఛన్ల విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?  రైతు రుణమాఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్‌తో పోలిస్తే కొంతలో కొంత తెలంగాణ  ప్రభుత్వం మెరుగేననిపించినా, అది రైతుల ఆత్మహత్యలను నివారించలేకపోయింది. సరైన సమయంలో విద్యుత్ సమస్య గురించి ఆలోచిం చని కారణంగా రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.

 అప్పుడు అలక, ఇప్పుడు అవసరం
 బోలెడు సమస్యలున్నాయి. వాటి పరిష్కారం రాష్ర్ట ప్రభుత్వం తనకున్న వన రులతో మాత్రమే పరిష్కరించుకోజాలదని తెలుసు. కేంద్రాన్ని ఆశ్రయించా ల్సిందే. కానీ మొదట్లో బెట్టు చేసి మాకు ఎవ్వరి అవసరమూ లేదన్న చందంగా వ్యవహరించి, ఇప్పుడు ప్రధానమంత్రి అప్పాయింట్‌మెంట్  కోసం టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యుల బృందం మోదీ ఇంటి చుట్టూ చక్కర్లు  కొడుతున్నట్టు వార్తలొచ్చాయి. కనీసం ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగానైనా నరేంద్ర మోదీ సమయం ఇవ్వకపోతారా అని ఆశగా చూస్తున్నారు. ఇవన్నీ ప్రజల కోసం చెయ్యాల్సిన పనులలో ప్రాధాన్య తలను నిర్ణయించుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు. కేసీఆర్ సింగ పూర్ వెళ్లి వచ్చారు. చైనా నుండి ఆహ్వానం అందింది.  బహుశా అక్కడ కూడా పర్యటిస్తారు. ఇవి ప్రాధాన్యతలు అవుతాయా, ఈ పర్యటనల వల్ల ప్రజలకు ఏం లాభం అని ఆరు నెలల పాలన పూర్తయిన సందర్భంగా ఆలోచించాల్సిందే. ప్రశ్నించుకోవలసిందే.

 ఇరకాటంలో చంద్రబాబు సర్కారు
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రంతో సత్సంబంధాలే ఉన్నా ఈ ఆరునెలల్లో ఒక్క కాగితం అయినా కదిలితే ఒట్టు. కేంద్రంలో తమ వారిని ఇద్దరిని మంత్రులుగా నియమింప చేసుకోవడం తప్ప రాష్ట్రానికి రావలసింది ఒక్కటి కూడా సాధించుకోలేదు;  శంషాబాద్ విమానాశ్రయంలో లేని డొమెస్టిక్ టెర్మినల్‌కి మహా నాయకుడు ఎన్.టి.రామారావు పేరుపెట్టించుకోవడం తప్ప.  ఎన్‌టీఆర్  పేరున్న బోర్డ్‌ను ఎక్కడ తగిలించాలో అర్థంకాక విమానాశ్రయం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కేంద్రం నుండి ఆశించిన సాయంరాదు. కనీసం రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు సాయంగా నిలబడమని రిజర్వ్ బ్యాంకుకు కూడా కేంద్రం చెప్పడంలేదు. ఉన్న బలమైన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పొడ అంటేనే గిట్టదు. ఇక్కడా తెలంగాణలో వలెనే ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడంలో లోపం జరుగుతున్నది. రైతు జీవితం ముఖ్యమా? రాజ ధాని నిర్మాణం ముఖ్యమా? తేల్చుకోవాలి అక్కడి ప్రభుత్వం. ఎల్లుండి రాష్ర్ట వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం ఈ అంశం మీద ఆందోళనకు సిద్ధపడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను పిలిపించి సమీక్షలు మొదలుపె ట్టారు. పైగా ఈ నెలలోనే జరగనున్న శాసనసభ శీతాకాల సమావేశాలలో ఎదుర్కొనబోయే వేడి కూడా గుర్తొచ్చి ఉంటుంది. ఏం చేసినా అక్కడా రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు. విదేశీ పర్యటనలలో మాత్రం చంద్రబాబు నాయు డు, తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ఒక అడుగు ముందే ఉన్నారు. ఆయన సింగపూర్, జపాన్ పర్యటన అయిపోయింది. త్వరలో కొరియా వెళ్తారట. ఆరు నెలల పాలనను చంద్రబాబు కూడా సమీక్షించుకోవాల్సిందే.
 (వ్యాసకర్త సెల్: 98480 48536)

మరిన్ని వార్తలు