ఇక రైలు ప్రమాదాలకు చెక్‌

24 Dec, 2017 10:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలపై ప్రయాణీకులకు ఇక ఎలాంటి బెంగ అవసరం లేదు. దట్టమైన మంచు ఆవరించినా రైళ్లు భద్రతపై రాజీపడకుండా గంటకు వంద కిమీ వేగంతో పరిగెత్తేలా రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణీకుల రైళ్లలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను అమర్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇన్‌ఫ్రా రెడ్‌, లేజర్‌ టెక్నాలజీతో కూడిన ఈ పరికరాలు రెండు కిలోమీటర్ల వరకూ ట్రాక్‌ల్లో ఎలాంటి లోపాలున్నాయో ఇట్టే పసిగడతాయి.

త్రినేత్రగా పిలిచే ఈ పరికరం పనితీరును ఇప్పటికే పరీక్షించారు. ప్రయాణీకుల రైళ్లలో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ పరికరంలో ఉండే ఇన్‌ ఫ్రా రెడ్‌, లేజర్‌ కిరణాలు రెండు కిలోమీటర్ల దూరం వరకూ ట్రాక్‌ల పరిస్థితిని పరిశీలించి, ఎలాంటి లోపాలున్నా ట్రైన్‌లో అమర్చిన స్ర్కీన్‌పై డిస్‌ప్లే చేస్తాయి. దెబ్బతిన్న ట్రాక్‌లు, పగుళ్లను కూడా ఇవి పసిగట్టి అప్రమత్తం చేయనుండటంతో రైలు ప్రమాదాలనూ అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.

ప్రయోగాత్మకంగా పరీక్షించిన క్రమంలో ట్రాక్‌లపై ఉన్న చిన్న వస్తువులను సైతం కనీసం 500 మీటర్ల ముందుగా ఈ పరికరం గుర్తించిందని రైల్వే అధికారులు చెప్పారు.త్రినేత్ర పరికరం ద్వారా రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం, లెవెల్‌ క్రాసింగ్‌ ప్రమాదాలు వంటి పలు అనర్ధాలను ఎదుర్కోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు. త్వరలోనే ఈ పరికరం అన్ని రైళ్లలో  అందుబాటులోకి రానుంది.

మరిన్ని వార్తలు