బస్తీమే సదర్

25 Oct, 2014 00:22 IST|Sakshi
బస్తీమే సదర్

దీపావళి నాడు టపాసుల మోతతో మార్మోగిన జంట నగరాలు.. మరుసటి రోజున ఆలమందల కేళితో దుమ్మురేపాయి. సదర్ సందడితో పట్నంలోని బస్తీలన్నీ జబర్దస్తీగా మారాయి. ద్వాపర యుగం నాటి ఈ సంబురం నేటికీ సిటీలో కనువిందు చేస్తోంది. యాదవులకు మాత్రమే పరిమితమైన ఈ పండుగ హైదరాబాద్ సంప్రదాయంలో ఓ భాగం.          
 
 అందంగా అలంకరించిన దున్నపోతులు.. బాజాభజంత్రీలతో ఊరేగింపుగా సాగే ఉత్సవం సదర్. దున్నపోతులతో పాటు వాటి యజమానులు పలురకాల విన్యాసాలతో ప్రజలను అలరిస్తారు. ఇక ఈ రోజు రాత్రి బర్కత్‌పురలోని రెడ్డి కాలేజ్ రోడ్డు, నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాల్లో నిర్వహించే సదర్ వేడుకల కోసం సిటీ ముస్తాబైంది.
 
ఇదే లక్ష్మీపూజ
 మామూలుగా వ్యాపారులకు ఉండే లక్ష్మీపూజ యాదవులకు సదర్ రూపంలో ఉంటుంది. సిటీలోని యాదవులందరిదీ దాదాపు పాల వ్యాపారమే. ఆ గోవులు, గేదెలే వారికి లక్ష్మీమాతలు. అందుకే సదర్ ఉత్సవంలో అవే ప్రత్యేకం. ‘మా బర్రెలు, దున్నపోతుల జుట్టు కత్తిరించి.. శుభ్రంగా స్నానం చేయిస్తాం. తర్వాత కొమ్ములకు రంగులేసి, మెడలో పూలదండలతో అలంకరించి వాటికి పూజ చేస్తాం. మాకు అన్నం పెట్టే తల్లులు అవే కాబట్టి అవే మాకు లక్ష్మీ సమానం. చిట్టీలు వేసుకొని మరీ ఈ పండుగ కోసం డబ్బులు దాచుకుంటారు. అప్పు చేసైనా సరే ఘనంగా సదర్ చేసేవారూ ఉంటారు’ అని చెప్తాడు నాంపల్లికి చెందిన పాల వ్యాపారి బొద్దం భాస్కర్‌యాదవ్.
 
ఎవరిళ్లల్లో వాళ్లు..
 సదర్.. దీపావళి తెల్లవారి నుంచి రెండో రోజు వరకు సాగుతుంది. పండుగ తెల్లారి డివిజన్ల వారీగా జరిగే ఈ ఉత్సవం.. ఆ మరుసటి రోజున వైభవంగా కొనసాగుతుంది. నారాయణగూడలో సాగే సదర్ ఉత్సవానికి జంటనగరాల్లోని యాదవులంతా హాజరవుతారు. ఊరేగింపుగా వచ్చిన దున్నపోతుల మెడలో పూలదండలు, మెడల్స్ వేసి తమకు ఉపాధినిస్తున్న ఆ మూగజీవాల పట్ల గౌరవం చాటుకుంటారు. అలాగే ఆ గేదెలున్న ఆసాములనూ శాలువాతో సత్కరిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సదర్ వేడుకలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. బ్యాండ్ బాజా స్థానంలో డీజే చేరి ఈ పండుగకు మోడర్న్ టచ్ ఇస్తోంది.
 
 ‘సదర్..
యాదవుల పండుగే కాదు.. వాళ్ల ఐక్యతకు చిహ్నం కూడా. ఈ పండుగను దాదాపు రూ. పది లక్షల దాకా ఖర్చుపెట్టి చేస్తాం’.
 - హరిబాబు యాదవ్,
 టీఆర్‌ఎస్ స్టేట్ సెక్రటరీ

మరిన్ని వార్తలు