వ్యూహాలు మార్చిన సోనియా, బిజెపి

19 Feb, 2014 19:44 IST|Sakshi
వ్యూహాలు మార్చిన సోనియా, బిజెపి

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) నిన్న లోక్సభలో ఆమోదించడంతో సీమాంధ్రలో కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా పెల్లుబికిన నిరసనల నేపధ్యంలో అటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇటు బిజెపి ఆలోచనలో పడ్డాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదించే విషయంలో కాంగ్రెస్, బిజెపి రెండూ తమ తమ వ్యూహాలను మార్చుకున్నాయి.    ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోపాటు కాంగ్రెస్కు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు  రాజీనామా చేశారు. అనేక మంది కాంగ్రెస్ నేతలు వసలబాట పట్టారు.   సీమాంధ్రలో వేల సంఖ్యలో సోనియా గాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సీమాంధ్ర ప్రజలు సోనియా పేరెత్తితే మండిపడుతున్నారు. ఎటువంటి సవరణలు ఆమోదించకపోయినా బిల్లుకు బిజెపి మద్దతు తెలపడంతో ఆ పార్టీపై కూడా సీమాంధ్రులు మండిపడుతున్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలను కూడా తగులబెట్టారు. బిజెపి, కాంగ్రెస్తో కుమ్మక్కైందన్న తీవ్ర విమర్శల నేపధ్యంలో ఆ పార్టీ కూడా కొత్త ఆలోచనలు చేయడం మొదలు పెట్టింది. రెండు పార్టీలు ఇప్పుడు బిల్లులో సవరణలకు తుదిరూపం ఇస్తున్నారు.

నిన్న లోక్సభలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా బిల్లును ఆమోదించిన బిజెపి ఈ రోజు రాజ్యసభలో ఆమోదించడానికి అనేక అభ్యంతరాలు తెలిపింది. బిల్లు ఆమోదానికి రాజ్యాంగ సవరణతోపాటు, బిల్లుకు కూడా పలు సవరణలు ప్రతిపాదించింది. తమ డిమండ్లను ఆమోదించాలని పట్టుపడుతోంది. ఈ నేపధ్యంలో  ఈరోజు బిల్లుపై చర్చ జరగకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.  ఈ రోజు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్తో రాజ్యసభలో ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీతోపాటు ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే, సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు.  సీమాంధ్రకు 10వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు. అలాగే 32 సవరణలను కూడా ప్రతిపాదించారు. పలు అంశాల విషయంలో బిజెపి పట్టుపడుతోంది. బిజేపి డిమాండ్లు అన్నింటినీ అంగీకరించడానికి కేంద్రం సిద్దంగా లేదు. దాంతో ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రేపటి లోపల బిజెపి డిమాండ్లలో కొన్నింటినైనా కేంద్రం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

బిజెపి ఆ విధంగా సీమాంధ్రులకు దగ్గర కావాలని చూస్తుంటే, ఇక సోనియా గాంధీ కూడా  ప్రధాని ముందు ఒక ప్రధాన డిమాండ్ను పెట్టారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని ఆమె  ప్రధానిని కోరారు. సోనియా ఆదేశిస్తే ప్రధాని అమలు చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ సోనియా ప్రధానికి విజ్ఞప్తి చేయడం ఏమిటని అనుకుంటున్నారా? ఆమె అలా కోరిన తరువాత, ప్రధాని ఆమోదిస్తే  ఆమెపై  సీమాంధ్రుల ఆగ్రహం కొంతవరకు తగ్గిద్దని వారి భావన. ఆ విధంగా సీమాంధ్ర ప్రజలను, నేతలను శాంతింపచేజాలని చూస్తున్నారు. సోనియా కోరారంటే సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడానికి కేంద్రం అంగీకరించినట్లుగానే మనం భావించాలి. రేపు ఉదయం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో సోనియా ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం నుంచి సీమాంధ్రకు భారీ స్థాయిలో నిధులు అందే అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉంటే, బిల్లుపై రాజ్యసభలో చర్చ జరపాలనుకుంటున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి రాజీవ్‌శుక్లా చెప్పారు. బిల్లులో సవరణలన్నిటిపై చర్చ జరుపుతామన్నారు. ఆ తర్వాతే తెలంగాణ బిల్లును ఆమోదిస్తామని చెప్పారు. రేపు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ లోపల బిల్లు విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు