షోవియట్

2 Feb, 2015 23:23 IST|Sakshi
షోవియట్

2014.. ఫోర్త్ జులై.. సంగీత దర్శకుడు కీరవాణి జన్మదినం సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలి’ ఆయన ఇంటర్వ్యూని ప్రచురించింది. అందులో ‘మీకు దొరకవు అనుకుంటున్నవేంటి?’ అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన అయిదు అంశాల్లో ‘తీమోర్.. అతని దళం’ అన్న రష్యన్ పుస్తకం పేరు కూడా ఉంది. ఆ రోజు సాయంకాలానికల్లా కీరవాణి మెయిల్‌కి ఆ పుస్తకం పీడీఎఫ్ రూపంలో వచ్చింది. అది చదివిన కీరవాణి ఆ మెయిల్ పంపిన వ్యక్తి ఫోన్ నంబర్ కనుక్కున్నారు. రాత్రి పదింబావుకు ఆ వ్యక్తికి ఫోన్ చేసి ‘థ్యాంక్స్ అండీ.. నా బర్త్‌డేకి మంచి గిఫ్ట్ పంపినందుకు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇలా సోవియట్ సాహిత్యాన్ని ఇష్టపడేవారికి, చదవాలని ఆశపడేవారికి ఆన్‌లైన్‌లో చేరవేస్తున్న వ్యక్తి అనిల్ బత్తుల. ఆన్‌లైనే కాదు ఆఫ్‌లైన్ తెలుగు సాహితీ ప్రియులకూ సుపరిచితుడాయన! ఒకప్పటి సోవియట్ లిటరేచర్‌ను ఈ తరానికి అందిస్తున్న ఆ సాహితీ గని పరిచయం...
..:: సరస్వతి రమ
 
 http://sovietbooksintelugu.blogspot.in/2014/07/blogpost_34.html
 
అనిల్‌కి వాళ్లమ్మ వల్ల పుస్తకాలు పరిచయం అయ్యాయి. చిన్నప్పుడు ఓ పత్రికలో డైలీ స్ట్రిప్‌గా వచ్చే నండూరి రామ్మోహనరావు ‘కాలయంత్రం’ సీరియల్‌ను చదివాడు. దాన్ని ఓ పుస్తకంలా కుట్టుకొని మరీ దాచుకున్నాడు. కాలక్రమంలో అది ఎక్కడో పోయింది. పెద్దయ్యాక దాని గురించి ఎంత వెతికినా దొరకలేదు. అదే పుస్తకాల సేకరణకు నాంది పలికింది. ఒకసారి ఆయన ప్రముఖ కవి శివారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌ను కలిశాడు. ఆ కలయికే సోవియట్ సాహిత్యాన్ని ఆయనకు పరిచయం చేసింది.
 
మనసుదోచిన జమీల్యా

తనని కలవడానికి వచ్చిన అనిల్‌కు ‘జమీల్యా’, పతంజలి ‘చూపున్న పాట’ పుస్తకాలనిచ్చాడు శ్రీకాంత్. జమీల్యా తన మనసును దోచింది. అంతకు ముందొకసారి కోఠిలో పుస్తకాలు కొంటుంటే రష్యన్ చరిత్ర కథలు, గాథలు కనిపించింది. 400 పేజీల పుస్తకం 35 రుపాయలే. దాని గురించి ఏమీ తెలియకపోయినా అన్ని పేజీల బుక్ 35 రూపాయలకే వస్తుందని కొన్నాడు. చదివాడు. బాగా నచ్చింది.

ఎమ్‌సీఏలో చేరాక భవిష్యత్ దృష్ట్యా ఇంగ్లిష్ మీద పట్టు సాధించాలనుకున్నాడు. దానికీ సాహిత్యాన్నే సాధనంగా మలచుకున్నాడు. ఇంగ్లిష్ లిటరేచర్ చదవడం స్టార్ట్ చేశాడు. ఆంగ్లం మీద పట్టూ వచ్చింది. హిటాచీలో ఉద్యోగమూ దొరికింది. అప్పుడు బ్లాగ్స్ పరిచయమయ్యాయి. ‘మనుసులో మాట’ అనే బ్లాగ్ చూశాడు. అందులో ‘ఉక్రేనియన్ జానపద గాథలను పట్టేశాను’ అన్న పోస్ట్ చదివాడు. అది ఆయన్ని పట్టేసింది. తన చిన్నప్పటి పుస్తకం ‘కాలయంత్రం’, దానికోసం తన వెదుకులాట గుర్తుకొచ్చాయి.

ఆ పోస్ట్ కిందున్న నలభై అయిదు కామెంట్లను చదివాడు. అందులో సోవియట్ పుస్తకాల పేర్లెన్నో ఉన్నాయి. ‘వర్షంలో నక్షత్రాలు’, ‘ఎర్రజుట్టు కోడిపుంజు’ వంటి వింతవింత పేర్లు. ఆ పోస్ట్‌ల సారాంశం ‘ఈ పుస్తకాలేవీ ఇప్పుడు దొరకట్లేదు.. ఎవరి దగ్గర ఏ పుస్తకాలున్నా స్కాన్‌చేసి నెట్‌లో పెడితే షేర్ చేసుకోవచ్చు’ అని. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడనుకున్నాడు అనిల్.. ఆ చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని పోగుచేయడానికి తనెందుకు కదలొద్దు అని!
 
మొదలైందిలా..

ఆఫీస్ విజిటింగ్ కార్డ్స్ వెనకాల సోవియట్ పుస్తకాల పేర్లన్నిటినీ రాసుకున్నాడు. ఎక్కడికి వెళ్లినా, పుస్తకప్రియులు ఎవరు కలిసినా ఆ పేర్లు చదివి వినిపించి ఏ పుస్తకాలున్నాయో కనుక్కునేవాడు. పెద్దగా స్పందనలేదు. అప్పుడే ఆర్టిస్ట్ మోహన్ పరిచయం అయ్యారు. విషయం తెలుసుకుని తన దగ్గరున్న రెండుమూడు పుస్తకాలిచ్చారు. రిటైర్డ్ లైబ్రేరియన్ గంగాధర్ కలిసి ‘ఏదీ నీదగ్గరున్న లిస్ట్ ఒకసారి చదువు’ అన్నారు. అనిల్ చదవడం స్టార్ట్ చేశాడు. నలభై పుస్తకాల జాబితాలో ముప్పై పుస్తకాలకు ‘ఉంది’ అని జవాబిచ్చారు గంగాధర్. వాళ్లింటికెళ్లి వాటిని తీసుకొచ్చాడు. వాటిని జిరాక్స్ తీయించి తిరిగిచ్చేశాడు. గంగాధర్ స్నేహితుడు సైదాచారి మరో ఏడు పుస్తకాలిచ్చాడు. ఇలా రెండేళ్లుగా సోవియట్ సాహిత్యాన్ని సేకరించే పనిలో పడ్డాడు అనిల్.
 
ఆశ్చర్యపరిచిన ప్రతిస్పందన...

ఎవరికి ఏ పుస్తకాలంటే ఇష్టమో తెల్సుకొని వాళ్లకు వాటినిస్తూ, తనకు కావల్సిన సోవియట్ బుక్స్‌ని తీసుకుంటూ 200 పుస్తకాలను పోగుచేశాడు. ఫిక్షనే కాకుండా కమ్యూనిజం, సోషలిజం, సైన్స్, రష్యన్ డిక్షనరీతోపాటు అన్నిరకాల పుస్తకాలున్నాయి. వాటన్నిటినీ స్కాన్‌చేసి, పీడీఎఫ్ కూడా చేయించాడు. సోవియట్ సాహిత్యమంటే ఆసక్తి ఉన్న అందరి మెయిల్ ఐడీలను సంపాదించి పుస్తకాలు వాళ్లకు మెయిల్ చేసేవాడు. వాళ్ల ప్రతిస్పందన చూసి ఆశ్చర్యపోయాడు అనిల్. ‘మీరు పంపిన ఈ పుస్తకం కోసం నలభై ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నామ’ని ఒకరు, ‘ఇది జీవితంలో మళ్లీ చదవలేననుకున్నాన’ని ఇంకొకరి స్పందన. తాను పోగుచేసిన పుస్తకాలతో ఇటీవల లామకాన్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. దీనికీ విశేష స్పందనే!
 
ఈ తరం పిల్లలకు అందాలి..

‘నా ఫ్రెండ్ అజయ్‌ప్రసాద్‌తో కలిసి మూడువేల పుస్తకాలతో హోమ్‌లైబ్రరీని మెయిన్‌టైన్ చేస్తున్నా. సోవియట్ యూనియన్ పతనమయ్యాక ఆ సాహిత్యం మన దగ్గరకి రావడం లేదు. అంతకుముందున్నవే మిగిలాయి. వాటిని పదిలంగా ఉంచాలి. మనముందు తరం బాల్యంలో ఆస్వాదించిన సోవియట్ సాహిత్యాన్ని ఈ తరం పిల్లలకూ అందించాలి. ఈ పుస్తకాల సేకరణ, భద్రపరచడం కోసం నా సమయాన్ని, డబ్బునీ ఖర్చుపెడుతున్నా. ఎందుకు అని ప్రశ్నించకుండా సహకరిస్తున్న నా భార్య మాధవీలతకు హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లల బర్త్‌డే పార్టీలకు వందలు వందలు పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే బదులు.. ఆ ఖర్చులో ఒక వంతు పెట్టి ఇలాంటి పుస్తకాలను ప్రింట్ చేయించి పిల్లలకు పంచితే ఎంతో విలువైన కానుకనిచ్చినవాళ్లవుతారు. ఆలోచించండి’ అని పేరెంట్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నాడు అనిల్.

మరిన్ని వార్తలు