స్వాతిముత్యాలు

31 Aug, 2014 01:26 IST|Sakshi
స్వాతిముత్యాలు

కల్మషం ఎరుగని నవ్వులు.. కుతంత్రం కనిపించని చూపులు.. కుట్రలు తెలియని ఆలోచనలు.. ఇదే వారి ప్రపంచం. లౌక్యానికి దూరంగా.. సంతోషానికి దగ్గరగా.. సంచలిస్తున్న వారి హావభావాలు.. కన్నవారికి అనుక్షణం బాధ్యతలు గుర్తు చేస్తుంటాయి. అక్కరకు రాని సానుభూతి తప్ప.. ఇంకేమీ ఇవ్వని ఈ లోకంలో నిస్వార్థానికి చిరునామాగా నిలుస్తున్నారీ అమాయక చక్రవర్తులు. మనసుకు మాలిన్యం అంటని స్వాతిముత్యాల హృదయాలను ఆవిష్కరించడానికి.. వారి తల్లిదండ్రులను హీరో సునీల్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. పసితనం దగ్గరే ఆగిపోయిన ఇంటలెక్చువల్లీ చాలెంజ్డ్ పిల్లల అంతరంగాలను మనముందుంచారు.
- సునీల్
 
సునీల్: అమ్మా.. మీ బిడ్డ స్పెషల్ కిడ్ అని తెలియగానే చిన్నారి గురించి బాధపడ్డారా..? మీ గురించి బాధ పడ్డారా?
సునీత: ఏ త ల్లయినా ఆ షాక్ నుంచి తేరుకోవడం అంత ఈజీ కాదు సార్. నా ఇద్దరు పిల్లలూ స్పెషల్ కిడ్సే. నా బిడ్డలకే ఎందుకిలా అయిందన్న బాధ నుంచి తేరుకోవడానికి నాకు చాన్నాళ్లు పట్టింది. వారి మాటల్లో, చేతల్లో ప్రత్యేకత కనిపించినపుడు మాత్రం నాకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను.
సునీల్: వావ్.. వారు నేర్చుకోలే క కాదు! మనం సరిగా దృష్టి పెడితే వారు ఎన్నో అద్భుతాలు చేయగలరని సంతోష్‌లా చాలామంది నిరూపించారు.  
 అపర్ణ: అవును సార్ మా అబ్బాయి వరుణ్ రెండుసార్లు స్పెషల్ ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ కేటగిరీలో మెడల్స్ తీసుకొచ్చాడు. అంతేకాదు.. బుక్  బైండింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. వాడి బుక్స్‌కి బోలెడంత గిరాకీ ఉంది.
 సునీల్: అది మన గొప్పతనం కాదండీ.. వంద శాతం వాళ్ల ప్రత్యేకతే. మనతో పోల్చుకుంటే వీళ్లు ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తారు. ఇజ్రాయెల్ వంటి దేశాల్లో మిలటరీ సెక్షన్‌లో గన్స్‌లో బులెట్ లోడింగ్ స్పెషల్ చిల్డ్రన్స్‌తో చేయిస్తుంటారు. వీళ్లయితే పక్కాగా చేస్తారని. అదే మనలాంటి వారికి అప్పగిస్తే బుర్ర ఎక్కడో పెట్టి పొరపాట్లు చేస్తాం. మీ గురించి చెప్పండి సార్..
 సుధాకర్: మా అమ్మాయి సుస్మిత. తనకు మూడేళ్లు వచ్చాక స్పెషల్ కిడ్ అని గుర్తించాం. మేం మానసికంగా కుంగిపోయాం. చదువులో ముందుకు వెళ్లలేకపోతుందని స్పోర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాం. స్పెషల్ ఒలింపిక్స్ వరకూ వెళ్లింది. స్విమ్మింగ్‌లో పథకాలు సాధించింది. పెళ్లి చేశాం.. ఓ పిల్లాడు కూడా. ఆడపిల్ల కదా సార్.. ఓ అయ్య చేతిలో పెట్టేవరకూ చాలా ఆందోళన పడ్డాం. ఇప్పుడు  హ్యాపీ.
 సునీల్: గుడ్. శ్రీదేవి గారు.. నిర్వాహకులుగా మీరు చెప్పండి..
 శ్రీదేవి: ‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్’ స్టార్ట్ చేసి 13 ఏళ్లవుతుంది. నాలుగు సెంటర్లున్నాయి. దాదాపు 300 మంది చిన్నారులను మామూలు మనుషులుగా మార్చగలిగాం. వీరిలో 30 మంది పదో తరగతి పూర్తి చేశారు. 16 మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు స్పోర్ట్స్‌లో.. ఇంకొందరు డ్యాన్స్‌లో.. మరికొందరు రకరకాల వొకేషనల్ పనుల్లో రాణిస్తున్నారు. వెయ్యి మంది మామూలు వారిని గొప్పవాళ్లుగా తీర్చిదిద్దడంలో కంటే.. ఒక స్పెషల్ కిడ్‌ని ఓ పనిలో నిష్ణాతుణ్ని చే యడంలో ఉన్న తృప్తి చాలా గొప్పది.
 సునీల్:  వీరు ఎక్కువగా ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు?
 శ్రీదేవి: కంప్యూటర్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మెకానిక్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఉంటున్నాయి. మొన్నీమధ్యే ఇద్దరబ్బాయిలు బోయిన్‌పల్లిలోని హీరోహోండా షోరూమ్‌లో చేరారు. అలాగే మాల్స్‌లో కూడా వీళ్లు బాగా పని చేయగలరు. కానీ అవకాశాలు కల్పించేవారు కరువయ్యారు.
 సునీల్: అవును.. ఈ విషయంలో మనం పూర్తిగా ఫెయిల్యూర్. విదేశాల్లో అయితే వీరిని మామూలు మనుషుల్లానే ట్రీట్ చేస్తారు. ఉద్యోగ అవకాశాల్లో కూడా వీరి కోటా పెద్దది. మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి రావాలంటే ఏం చేయాలంటారు?
 వెంకట రమణారెడ్డి: వీళ్లు చేయగల పనులను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల్లో వీరికి కోటా కల్పించాలి.
 శ్రీదేవి: అంతేకాదు.. మన రాష్ట్రంలో వీరి సంఖ్యపై సర్వే చేయించి వీరి జీవనోపాధి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి.
 సునీల్: మీకో విషయం చెప్పాలి.. మానవజాతిలోనే యూదులను అత్యంత తెలివైన వాళ్లుగా అభివర్ణిస్తారు. అయితే ఇంటలెక్చువల్లీ చాలెంజ్డ్ కూడా వాళ్లలోనే ఎక్కువ! అమెరికాలో ఒత్తిడితో బాధపడే గొప్ప గొప్ప వాళ్లూ.. స్పెషల్ కిడ్స్‌తో ఒకరోజు ఉండటానికి వారి తల్లిదండ్రులకు అప్లికేషన్లు పెట్టుకుంటారు తెలుసా..?
 వెంకట రమణారెడ్డి: వారికి కల్మషం తెలియదు.. అబద్ధం రాదు.. ఇష్టం లేని పని చేయరు.. నచ్చని వారి జోలికెళ్లరు. నచ్చితే వదలరు. అందుకే వారంటే అందరికీ ఇష్టమే. మావాడు నేను బయటకు వెళ్లి వచ్చే లోపు ఊరంతా చుట్టేసి అందరినీ పలకరించి వస్తాడు.  ‘మీ అబ్బాయి చాలా మంచివాడ’ని అందరూ అంటుంటారు. వీడు మామూలుగా పుట్టి.. గొప్పగా చదివి విదేశాలకు వెళ్లినా.. ఆ మాట అనిపించుకునే వాడు కాదేమో.
 శ్రీలక్ష్మి: మాకు ఇద్దరు అబ్బాయిలు. చిన్నోడు స్పెషల్ కిడ్. పెద్దవాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పెద్దోడికి కోపం వస్తే.. అంత త్వరగా చిన్నోడితో మాట్లాడడు. కానీ వీడు మాత్రం వెంటనే అన్నా అంటూ ద గ్గరికి వెళ్లి.. కలిపేసుకుంటాడు.
 సునీల్: నిజం చెప్పాలంటే అసలు వికలాంగులం మనమే. మన మాట ఎవరైనా వినకపోతే వెంటనే కోపం వచ్చేస్తుంది. అదే వాళ్ల బాధని ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకోకుండా విసిగిస్తాం.. ఆ టైంలో వాళ్లకు ఎంత కోపం రావాలి ?
 అపర్ణ: వీరిని అర్థం చేసుకుని.. వారిలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకుని ప్రోత్సహిస్తే.. ఆ పిల్లలు కూడా గొప్పస్థానాల్లో ఉంటారు.
 సునీత: సార్.. చిన్న ప్రశ్న.. మన సినిమాల్లో స్పెషల్ చిల్డ్రన్స్ పాత్రలు చాలా అరుదు. నిజానికి సినిమాకు మించిన ప్రచార మాధ్యమం మరొకటి లేదు కదా..!
 సునీల్: నిజమే. మన దగ్గర అలాంటి ప్రయత్నాలు తక్కువే. హాలీవుడ్‌లో చాలా చేశారు. వీరిని చూపించిన తీరు కూడా అద్భుతం. అలాంటి సినిమాలు ఇక్కడ కూడా వస్తే సమాజంలో మార్పు తప్పకుండా వస్తుంది. దానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.  ‘స్టార్ రిపోర్టర్’గా మిమ్మల్ని కలసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కొన్ని సంగతులు పంచుకున్నాను. హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ!!
 
 సునీల్:  నా దృష్టిలో వీళ్లు దేవుడిచ్చిన వరాలు. మాకెందుకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు భగవంతుడా అని మీరెప్పుడూ బాధపడకూడదు. ముందుగా తల్లిదండ్రులను ఎంచుకుని దేవుడు ఈ పిల్లలను ఇస్తాడు. ఎవరైతే ఓపికగా ఈ చిన్నారులను పెంచగలరో వారికే స్పెషల్ కిడ్స్ ఇస్తాడు. ఏమంటారు..?
 శ్రీదేవి: నిజమే సార్.. సరిగా నిలబడలేని వారు, బేసిక్ థింగ్స్ కూడా తెలియని పిల్లలు ఈ రోజు స్పెషల్ ఒలింపిక్స్‌కు వెళ్లి పతకాలు సాధించారంటే ఆ గొప్పదనం తల్లిదండ్రులదే.
 నీరజ: మా అబ్బాయి రాజేష్‌ను పదేళ్ల కిందట ‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్’కు తీసుకొచ్చాం. అప్పుడు వాడికేం తెలియదు. అలాంటిది ఈ రోజు వాడు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ పిల్లలు ఇలా ఎదగడానికి కారణం ఇలాంటి సంస్థలే.
 శ్రీదేవి: యస్.. స్వీడన్ వాళ్ల డేటా ఎంట్రీ ప్రాజెక్ట్‌లో సంతోష్‌ది చాలా ముఖ్యమైన పాత్ర.

మరిన్ని వార్తలు