చెస్‌లో గెలవడానికి షార్ట్‌కట్‌లు ఉండవు

8 Jul, 2013 03:24 IST|Sakshi
చెస్‌లో గెలవడానికి షార్ట్‌కట్‌లు ఉండవు
రథాలను నడుపుతున్నాడు. 
 గుర్రాలను దౌడు తీయిస్తున్నాడు.
 ఏనుగుల్ని అదిలిస్తున్నాడు.
 కాల్బలాన్ని ఆదేశిస్తున్నాడు.
 యావత్ చతురంగ బలాలనే... 
 చెప్పుచేతల్లో ఉంచుకున్నాడు.
 ఈమధ్యే యుద్ధక్షేత్రం నుంచి... 
 గుర్తుగా ఒక విజయాన్ని  వెంట తెచ్చుకున్నాడు!
 ఎవరీ సేనాపతి? ఏ రాజ్యం వాడు?
 తల్లెవరు? తండ్రెవరు?
 అక్కడికే వస్తున్నాం. 
 పేరు కుశాగ్ర , ఊరు మారేడ్‌పల్లి, వయసింకా పది నిండలేదు!
 నిండకుండానే, ఇరాన్ వెళ్లొచ్చాడు.
 చెస్‌లో చెడుగుడు ఆడి, నేరుగా చాంపియన్ ‘షిప్’ వేసుకొచ్చాడు. 
 ప్రపంచాన్ని జయించి గ్రాండ్ మాస్టర్ అవడం 
 ఈ బాలకుడి కల!
 ఆ కలకు మెత్తని దిండు, వెచ్చని దుప్పటి... 
 అమ్మ మీనా. 
 కలను నిజం చేసుకునే మెలకువకు అలారం... 
 నాన్న రాజేశ్. 
 చదరంగంలో వీరిద్దరి గోరుముద్దలే ఈవారం ‘లాలిపాఠం’!
 
 సికింద్రాబాద్, ఈస్ట్ మారేడ్‌పల్లి, ఇంటి నంబరు 388.  ఈ ఇంటిపిల్లలు చెస్‌క్రీడాకారులుగా వార్తల్లోకి వచ్చారు. వీటివెనుక తల్లిదండ్రుల ఆశ, తాతయ్య - నానమ్మల అండదండలు, పిన్ని-బాబాయ్‌ల ప్రోత్సాహం ఉన్నాయి. అన్నింటికంటే ముందు పిల్లాడికి కుశాగ్రమోహన్ అని పేరు పెట్టడంలో ఏదైనా దూరదృష్టి ఉందా అన్నప్పుడు మీనా మాట్లాడుతూ ‘‘ఇంట్లో పిల్లలందరికీ పేర్లు మా మామగారే పెట్టారు. ఆయనకు సంస్కృతం పేరు ఇష్టం’’ అన్నారు. 
 
 ఆటవిడుపుగా చెస్!
 
 పిల్లలిద్దరికీ చెస్ ఆడడం ఎలా అలవాటైంది అనే సందేహానికి సమాధానంగా ‘‘మా వారు తమ్ముళ్లిద్దరితో రాత్రి పదింటికి డైనింగ్ టేబుల్ మీద చెస్ ఆడేవారు. ఉదయం ఎవరి డ్యూటీలకు వారు వెళ్లిపోయేవారు, అందరూ కలిసేది భోజనాల సమయంలోనే. మేము వంటపాత్రలు తెచ్చేలోపు చెస్ బోర్డు పరిచేవాళ్లు. అలా మా పాపకు అలవాటైంది. తను నేషనల్ లెవెల్ వరకు ఆడింది. చెస్‌తోపాటు స్విమ్మింగ్, కూచిపూడి కూడా ప్రాక్టీస్ చేసేది. ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం. చదువు మీదనే దృష్టి పెట్టింది. కుశాగ్రమోహన్‌కి చెస్ వాళ్ల అక్కనుంచే అలవాటైంది’’ అని చెప్పారు మీనా.  
 
 తొలి గురువు తండ్రి!
 
 కుశాగ్రమోహన్ ఆటలో రాణించడంలో తండ్రి ప్రోత్సాహం గురించి ప్రస్తావించినప్పుడు రాజేష్‌మోహన్ మాట్లాడుతూ... ‘‘నాకు ఆటలు ఇష్టం, ఇంజనీర్‌గా ఉద్యోగం చేయకుండా మా కుటుంబం నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌షాప్‌లో పనిచేస్తున్నాను. చెస్ మేధాశక్తికి గీటురాయి. బాబుతో చెస్ ఆడేవాడిని. మొదట్లో నేను ఇచ్చిన వర్క్‌బుక్‌ని బాబు ఎంతవరకు ఫాలో అవుతున్నాడో గమనించేవాడిని. తనిప్పుడు నా స్థాయిని మించి ఆడేస్తున్నాడు’’ అన్నారు. ఆ మాట చెప్పేటప్పుడు ఆయనలో పుత్రోత్సాహం కనిపించింది.
 
 అదే తొలి పుస్తకం!
 
 పరినిష్ట కూడా ఇంత ఎక్సర్‌సైజ్ చేసిందా అన్నప్పుడు ‘‘నాకప్పుడు ఇంత సిస్టమాటిక్‌గా శిక్షణ ఇప్పించడం తెలియదు. ట్రైనింగ్‌కి కోచ్ దగ్గరకు పంపించడమే నా వంతు అనుకున్నాను. కోచ్‌లు కూడా పుస్తకాలుంటాయని చెప్పలేదు. పరినిష్ట జాతీయస్థాయిలో ఆడినప్పుడు ఒక పుస్తకం తెచ్చింది. కుశాగ్ర ఆ బుక్‌తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆ పుస్తకంలో ఆథర్ రాసిన ముందుమాట చదివినప్పుడు నాకు పుస్తకం విలువ తెలిసింది. పరినిష్ట అప్పటికే సెవెన్త్ క్లాస్. తనకు ప్రాక్టీస్ చేసే టైమ్ లేకపోయింది’’ అన్నారు రాజేశ్.
 
 స్కూలు... ప్రాక్టీస్!
 
 కుశాగ్ర స్కూలు గురించి ప్రస్తావించినప్పుడు మా అబ్బాయి గట్టిగా స్కూలుకెళ్లేది నాలుగు నెలలే. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చెస్, డిసెంబర్ నుంచి మార్చి వరకు స్కూలు ఉండేటట్లు ప్లాన్ చేశారు మా వారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు వాళ్లు కూడా సహకరిస్తున్నారు. చెస్‌టోర్నమెంట్ ఉన్నప్పుడు 45 రోజులపాటు రోజుకు తొమ్మిది గంటల సేపు దిల్‌షుక్‌నగర్‌లో కోచ్ రామరాజు దగ్గర ప్రాక్టీస్ చేసి, ఇంటికొచ్చి థియరీ ఫాలో అవుతాడు. డిసెంబర్ నుంచి క్లాస్ సిలబస్ పూర్తి చేస్తాడు. మూడవ తరగతిలో ఏప్లస్ గ్రేడ్ తెచ్చుకున్నాడు’’ అన్నారు మీనా.
 
 చెస్ వంటి ఇంటలెక్చువల్ గేమ్‌ని సామాన్యులు ప్రాక్టీస్ చేయగలిగిన పరిస్థితులున్నాయా అన్నప్పుడు చెస్ మెటీరియల్, కోచింగ్ ఫీజుల వరకు సాధ్యమే. కానీ టోర్నమెంట్‌కి వెళ్లే ప్రయాణ ఖర్చులను భరించడం కష్టమేనంటారు రాజేశ్. ‘‘కుశాగ్ర ఎక్కడ టోర్నమెంట్ ఆడాల్సి వచ్చినా కోచ్‌తోపాటు నేను, మీనా కూడా వెళ్లాల్సి వస్తోంది. పైగా ప్రభుత్వం నుంచి ఈ ఆటకు ఎటువంటి సహకారమూ అందడం లేదు’’ అన్నారాయన.
 
 పరిణతి కోసం ప్రయత్నం!
 
 కుశాగ్ర ఆటతీరుని రాజేశ్ చాలా నిశితంగా విశ్లేషించారు. ‘‘పెద్దవాళ్లు చదవాల్సిన పుస్తకాలను ఇప్పుడే చదివించడంతో కుశాగ్రకు ఎండ్‌గేమ్ థియరీ అర్థమైపోయింది. నార్మల్ ప్లేయర్ డ్రాగా పూర్తవుతుందనుకునే ఆటను గెలుపువైపు నడిపించడంతోపాటు తన గేమ్ పోతోందన్న విషయాన్నీ తెలుసుకోగలుగుతున్నాడు. గ్రహించిన విషయాన్ని తనలోనే దాచుకుని గుంభనంగా ఆట నడిపించే పరిణతి రాలేదు. పైగా వీడు ఓవర్‌ఎక్స్‌ప్రెసివ్. ఆట పోతోందన్న అనుమానం రాగానే ఆ భావాన్ని వ్యక్తం చేసేస్తాడు. ఎదుటి ప్లేయర్ వీడి ముఖం చూసి తనకు లాభించే అంశం ఉందని గ్రహించగలుగుతారు. ఈ విషయంలో తనకి నేనే కౌన్సెలింగ్ ఇవ్వాలి’’ అన్నారు.
 
 కుశాగ్రకు వచ్చిన మెడల్స్ గురించి ప్రస్తావించినప్పుడు ఈ ఆటలో కేవలం మెడల్స్ ఆధారంగానే ఆటగాడిని అంచనా వేయకూడదు. అదీకాక నాకు పిల్లలు ఆటలో ఓడిపోయి బిక్కముఖంతో కనిపిస్తే నచ్చదు. మా వాడు గెలిచిన ఆటలో మరో పిల్లాడు ఏడుస్తాడు, అతడూ మా వాడంత చిన్న పిల్లవాడే కదా. అందుకే ఓటమిని స్వీకరించ గలిగిన వయసు వచ్చే వరకు తక్కువ టోర్నమెంట్‌లలో ఆడించడమే కరెక్ట్’’ అన్నారు. 
 
 ఇంతలో మీనా లోపలి నుంచి కుశాగ్ర ఐదేళ్ల వయసులో గెలిచిన తొలి విజయం తాలూకు పేపర్ కటింగ్ తెచ్చి చూపించారు. కుశాగ్ర ‘గ్రాండ్‌మాస్టర్ కావాల’నే కలను జాతీయ పత్రికలతో చెప్పిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు ‘‘రోజూ కలగంటాడు. ఈ రోజు కూడా ‘తనకు వరల్డ్ చాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్ వచ్చినట్లు కల వచ్చింద’ని చెప్పాడు’’ అన్నారామె నవ్వుతూ.
 
 చెస్‌లో గెలవడానికి షార్ట్‌కట్‌లు ఉండవు, పిల్లలు ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఏడాది- రెండేళ్లలోనే ఏదో సాధించాలన్నంత తొందర తల్లిదండ్రులకు ఉండకూడదంటారు కుశాగ్ర తండ్రి. ఆటను అధ్యయనం చేసి, ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇప్పించే తల్లిదండ్రులు ఉంటే రష్యా మాత్రమే కాదు, భారత్ కూడా ప్రపంచానికి గ్రాండ్‌మాస్టర్‌లను వందల్లో ఇస్తుందనడంలో సందేహం లేదు.
 
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 కుశాగ్ర మోహన్ గురించి...
 హెచ్‌పిఎస్‌లో నాలుగవ తరగతి.
 
 ఇరాన్‌లో జూన్ 20-27 మధ్య జరిగిన ఏషియన్ యూత్ చెస్ చాంపియన్‌షిప్ 2013 పోటీల్లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఇదే ఇతడి తొలి అంతర్జాతీయ విజయం.
 
 అంతకు ముందు...
 2012, వరంగల్‌లో నిర్వహించిన స్టేట్ అండర్ -7 చాంపియన్‌షిప్‌లో మొదటిస్థానం, అండర్-9 నేషనల్ చాంపియన్‌షిప్‌లో రెండవస్థానం.  2011లో ఢిల్లీలో ఓఎన్‌జిసి నిర్వహించిన ఏషియన్ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో అండర్ -7 కేటగిరీలో రెండవస్థానం.   2010, డిసెంబర్‌లో కోల్‌కతాలో జరిగిన అండర్ - 6 కేటగిరీలో మొదటి స్థానం.  అంతర్జాతీయ పోటీల్లో శ్రీలంక, యూరప్ చాంపియన్‌షిప్‌లలో 5, 8 స్థానాలు.
 
 చెస్ అనేది ఆట కాదు... అధ్యయనం!
 ఇంట్లో సెంటర్ టేబుల్ మీదున్న పెద్ద పెద్ద చెస్ పుస్తకాల గురించి ప్రస్తావించినప్పుడు రాజేశ్ ‘‘ఇదంతా చెస్ మెటీరియల్, చెస్ అనేది ఆట కాదు, అధ్యయనం’’ అంటుండగా కుశాగ్ర చిన్నాన్న పెద్ద చెక్కపెట్టెని దివాన్ కింద నుంచి బయటకు లాగి ‘ఇవన్నీ చెస్ పుస్తకాలే’ అని చూపించారు. వందకు పైగా ఉన్నాయవి. కుశాగ్ర ఇవన్నీ చదువుతాడా అని ఆశ్చర్యంగా అడిగినప్పుడు రాజేశ్ అందుకుంటూ ‘‘అన్నీ చదవలేదు, పాతిక పుస్తకాలే చదివాడు. పుస్తకాన్ని మించిన గురువు లేరు. ఈ విషయంలో గారీ కాస్పరోవ్ తండ్రి నాకు స్ఫూర్తి’’ అన్నారు. ఇంత కలెక్షన్ ఇప్పుడే అవసరమా అనే సందేహానికి ఆయన ఇచ్చిన సమాధానంలో దూరదృష్టితోపాటు తండ్రి పడే తపన వ్యక్తమయ్యాయి. 
 
 తాతగారి పర్యవేక్షణలో... 
 కుశాగ్ర రోజుకు ఆరేడు గంటలు చెస్‌తోనే గడుపుతాడు. చెస్ పుస్తకాలు చదువుతాడు, లాజికల్ అప్లికేషన్ మీద వర్కవుట్ చేస్తాడు. లాప్‌టాప్‌లో చెస్ ఆడుతాడు. మేము మా పనుల్లో ఉంటే కుశాగ్ర ఏ టేబుల్ సరిగా చేశాడు, ఏది అర్థం కాక వదిలేశాడు వంటివన్నీ వాళ్ల తాతగారే చూసుకుంటారు.
 - మీనా, కుశాగ్ర తల్లి
 
మరిన్ని వార్తలు