మహిళకు భరోసానిద్దాం

14 Sep, 2014 02:52 IST|Sakshi

టెక్నికల్‌గా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న భారతావని.. ఆడపిల్లల భద్రత విషయంలో పాతాళానికి దిగజారుతోంది. రాజధాని వీధుల నుంచి పల్లెసీమ వరకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న దాడులతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ(అగ్రికల్చర్ ప్రొడక్షన్) పూనం మాలకొండయ్య, హోంశాఖ సెక్రటరీ సౌమ్య మిశ్రా, ఐజీ (ట్రైనింగ్) స్వాతి లక్రా, సీఐడీ ఐజీ చారు సిన్హా తదితరులతో ఏర్పాటు చేసిన కమిటీ వివిధ రంగాల్లోని మహిళ ల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. శనివారం బషీర్‌బాగ్‌లోని సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్స్, టీచర్లతో సమావేశమైంది. మారేడ్‌పల్లిలోని పద్మశాలి కళ్యాణమంటపంలో పలువురు స్థానిక మహిళలు, బాలికల అభిప్రాయాలను తీసుకుంది.
 
 క్షేత్రస్థాయిలో అధ్యయనం..
 మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని పూనం మాలకొండయ్య అన్నారు. కమిటీ తక్షణ నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నాలుగు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తామన్నారు. కమిటీ నివేదిక మహిళలకు భరోసా ఇస్తుందన్నారు.

 సమావేశంలో సలహాలు, సూచనలు
-    నైతిక విలువలు, సెక్స్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేకంగా పీరియడ్ ఏర్పాటు చేయాలి
-    సమాజంలో దుష్ర్పభావం కలిగించే సినిమాలు.. బాలికలను, మహిళలను కించపరిచే విధంగా వచ్చే టీవీ సీరియల్స్‌ను నియంత్రించాలి
-   పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగ టీచర్లను కఠినంగా శిక్షించాలి
-  దోషులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
-   పాఠశాలల్లో సెల్‌ఫోన్లు నిషేధించాలి, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలి
 
 సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించాలి
 తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల కంటే 6, 7, 8 తరగతుల విద్యార్థులే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్‌ను ముందుగానే నేర్పించాలి. తల్లిదండ్రులే పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి.
 - శుభా శుక్లా, సైకాలజిస్టు, కౌన్సిలర్
 
 ప్రత్యేక దృష్టి పెట్టాలి
 తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యాలు ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆపదలో పిల్లలే  రియాక్ట్ అయ్యేవిధంగా శిక్షణ ఇవ్వాలి. అధికారులను, పోలీసులను కన్సల్ట్ చే సేలా చూడాలి. అవసరమయ్యే లీగల్ పాయింట్స్, ఫోన్ నంబర్లపై అవగాహన కల్పించాలి.
 - సంగీత వర్మ, ప్రధాన కార్యదర్శి,
 గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం
 
 సమాజంతో భయం
మహిళలు ఎక్కువగా భయపడుతున్నది చుట్టూ ఉన్న సమాజం గురించే. కూతురుకు ఏదైనా జరిగితే బయటకు చెప్పుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. చట్టానికి తెలిసే లోపే సొసైటీలోని పెద్దలు తమ పలుకుబడితో దోషులకు అండగా నిలుస్తున్నారు. ఈ సమస్యను స్త్రీలే ఎదుర్కోవాలి.
 -  భార్గవి, స్పెషల్ ఆఫీసర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం
 
మార్పు ఇంటి నుంచే ముస్లిం యువతులపై ఇంటా, బయటా వివక్ష ఉంటోంది. మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి. పెళ్లి చేస్తే ఆడపిల్ల భారం తగ్గుతుందనుకునే తల్లిదండ్రులు మారాలి. వారిని బాగా చదివించడంతో పాటు అన్ని విధాలా ప్రోత్సహించాలి.
 -  సబియా సుల్తాన, టీచర్ - కేజీ బీవీ
 - ముషీరాబాద్/కంటోన్మెంట్

మరిన్ని వార్తలు