శబ్ధ కాలుష్యం ఆపలేదని బ్రేకప్‌.. 

27 Mar, 2018 10:27 IST|Sakshi

సాక్షి, పాట్నా : చిన్న కారణాలకే పెళ్లిళ్లు పెటాకులవుతున్న రోజుల్లో బీహార్‌లో ఓ మహిళ విడాకులకు సిద్ధపడిన కారణం వింటే ఎవరైనా విస్తుపోతారు. ఇంటి చుట్టుపక్కల శబ్ధకాలుష్యాన్ని నివారించడంలో విఫలమయ్యాడని భర్తకు విడాకులు ఇవ్వాలని స్నేహ సింగ్‌ అనే మహిళ నిర్ణయించుకుంది. హజీపూర్‌, రోడ్‌నెంబర్‌ 3లోని ఆమె నివాసం పొరుగునే ప్రార్ధనా మందిరాల నుంచి లౌడ్‌స్పీకర్లతో సమస్యలు ఎదురవడంతో స్నేహ సింగ్‌ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.  స్ధానికులకు అసౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతోనే మతం పేరిట కొందరు ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అధికారుల తీరుతో విసుగెత్తిన స్నేహ ప్రదాని నరేంద్ర మోదీ, బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌లకు లేఖలు రాశారు.

వీటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో భర్త రాకేష్‌ సింగ్‌ నుంచి విడాకుల కోసం ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట స్నేహ, రాకేష్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. తనకు అవసరమైన భద్రతను కల్పించలేని వ్యక్తితో తాను కలిసి జీవించలేనని ఆమె తేల్చిచెప్పారు. దివ్యాంగుడైన రాకేష్‌ గతంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ఆటగాడు కావడం గమనార్హం. శబ్ధ కాలుష్యంపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, పొరుగు వారితో తలపడే పరిస్థితిలో తాను లేనని రాకేష్‌ నిరాసక్తత వ్యక్తం చేశాడు. మరోవైపు స్నేహను ఒప్పించేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. దుండగులు వారి ఇంటిపై రాళ్లు విసురుతున్నారని పోలీసుల నుంచి ఎలాంటి సాయం అందడం లేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు