శార్వరి నామ సంవత్సర (తులా రాశి) రాశిఫలాలు

22 Mar, 2020 08:51 IST|Sakshi

(ఆదాయం  14, వ్యయం  11,  రాజపూజ్యం 7, అవమానం 7)

ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు, కొత్త బ్రాంచీలు విస్తరిస్తారు. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు మధ్యస్తంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కొత్తకోణంలో ఆలోచనచేసి నూతనమైన పద్ధతులు కనిపెట్టాలని యోచిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వాముల ఖర్చు ఉమ్మడి ఖాతాలలో వాడకం వాటాలను దాదాపు మించిపోతుంది. ఇలాంటివి సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకుంటారు జలవనరులు మీరు ఆశించిన చోట ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు అభివృద్ధి చెందటం, వాళ్ళ వల్ల పేరుప్రతిష్ఠలు రావడం సంతోషం కలుగుతుంది. అదనపు బరువుబాధ్యతలు తప్పవు. సంతాన పురోభివృద్ధికి కృషి చేస్తారు. మీరు చేస్తున్న అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. రావలసిన బాకీలు కొద్దికొద్దిగా జమ చేసుకుంటారు. అసలు గురించే మీ ఆందోళన.

వడ్డీల మీద ఆశపెట్టుకోరు. బంధువర్గం, దగ్గరివాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు సాయం చేయవలసిన పెద్దలే నవ్వుతూ ద్రోహం చేస్తారు. మీకు ప్రతికూలంగా మాట్లాడుతారు. అభివృద్ధి చెందుతున్న పిల్లల మొహం చూసి కూడా వాళ్ళ అభిప్రాయాలలో మార్పురాదు. ఉన్నవాళ్ళకు ఇంకా మేలు చేయాలని అన్యాయమైన పంచాయితీలు చేస్తారు. ఎదిరించి ప్రయోజనం లేదని తెలుసుకుంటారు. నమ్మకం పెట్టుకున్నందుకు, మీ పొరపాటుకు ఈ శిక్షపడాల్సిందేనని మీరే మౌనంగా బాధను దిగమింగుకుంటారు. మీరు అనుకున్నది, ఆశించినది, కృషి చేసినది నిజంగా మీదే అవుతుంది. ఆర్థికస్థితిలో మార్పు వస్తుంది. ఇతరులకు జవాబు చెప్పవలసిన పనిలేదు. ఉంటే తింటాం లేకపోతే లేదు. బయటవారితో మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి లేదు అన్న భావన చాలా ఊరట కలిగిస్తుంది. అన్నిరకాల దేవుళ్ళ అభిషేకాలకు, పూజలకు మహాతీర్థం పొడి ఉపయోగించండి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలకు శాస్త్రపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.

ప్రతి దానికి వంకలు పెట్టే వాళ్ళని సంతృప్తిపరచలేమని కాస్త ఆలస్యంగా గ్రహిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్‌ పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ సామాగ్రి, రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాలలో లాభాలు వస్తాయి. నిష్కారణమైన ద్వేషానికి మందు కనిపెట్టలేమని గ్రహించి ఊరట చెందండి. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మీకు అన్యాయం చేస్తారని విచారించవద్దు. మీ ప్రయోజనాలు రాచబాటలో వస్తాయి. మీ సన్నిహిత రాజకీయవర్గం డబ్బులు తీసుకుని మీ వ్యతిరేక వర్గానికి మేలు చేస్తారు. దీర్ఘకాలిక పోరాటానికి మీరు సంకల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏకపక్ష నిర్ణాయాలు తీసుకోకుండా ఏదైనా పని చేసేటప్పుడు సన్నిహితులను, నిపుణులను సంప్రదించండి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. శాడిస్టు మనస్తత్వం కలిగిన అధికారుల వల్ల ఇబ్బందిపడతారు. పెయింటింగ్, ఆర్ట్‌ డిజైనింగ్‌లకు మంచి ఖ్యాతి లభిస్తుంది. పొదుపు చేసిన ధనాన్ని సక్రమమైన వాటిల్లో పెట్టుబడిగా పెడతారు. వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గిస్తారు. వీలైనంత పొదుపుగా కాలం గడపాలని చూస్తారు. అయితే సాంతం త్యాగం చేయరు. ఇతరులకు పెట్టే వాటిల్లో లోటు చేయరు. అనవసరమైన వ్యక్తుల సలహాలను దూరంగా పెడతారు. కుటుంబ వ్యవహారాల్లో, వ్యక్తిగత విషయాలలో బంధుమిత్రుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తారు.

వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మెరిట్‌మార్కులు సాధిస్తారు. సంతానాన్ని అధికగారాబం చేస్తున్నారన్న విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోకండి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు, పొలాలకు మంచి ధర లభిస్తుంది. అమ్మాలన్న ఉద్దేశ్యంతో కొనుగోలు చేసిన ఓ ఫ్లాట్‌ను అమ్మి ధనాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెడతారు. బంధువుల మధ్య తగాదాలు మీకు చికాకు కలిగిస్తాయి. ప్రతి విషయంలోనూ జీవితభాగస్వామికి కానీ, మరొకరికి కానీ సంజాయిషీ ఇవ్వాల్సి రావడం మీ మానసిక అసహనానికి కారణం అవుతుంది. సమాజంలో మీకున్న గుడ్‌విల్‌ను నిలబెట్టుకోగలుగుతారు. ఒక యూనిట్‌గా చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. కష్టపడి పనిచేసి ఫలితాలను ఆశిస్తారు. కష్టపడకుండా ఎలాంటి ఫలితాలను ఆశించరు. మనస్సు విప్పి మాట్లాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. శుభకార్యాల నిమిత్తం బంధువులకు సహాయం చేస్తారు. ఇబ్బందికరంగా మారిన పెళ్ళిని కష్టతరంగా పూర్తిచేస్తారు. బంధువులలో ఐకమత్యం కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు సాధించిన పురోగతి, ఆర్థికస్థితి, పేరుప్రతిష్ఠలు చూసి సంతోషించే ఏకైక ఆత్మీయుడు లేకపోవడం మీ తీవ్రమనోవేదనకు కారణం అవుతుంది.

కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం అవుతుంది. ఆర్థికబలం పెరుగుతుంది. పోలీస్‌స్టేషన్‌ స్థాయి పరిష్కారాలు ఇష్టం లేకపోయినా స్నేహితులను ఆదుకోవడానికి మీ పలుకుబడిని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలను, కులాంతర వివాహాలను మీరు సరిపెట్టుకోలేరు. ఈ విషయంలో ఎక్కడా రాజీపడరు. కొన్ని సందర్భాలలో చేతినిండా పని ఉంటే బావుండు, క్షణం తీరిక లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. రుద్రజడను ఉపయోగించండి. కొన్ని వ్యాపార సంబంధమైన విషయాలకు మీరు నాయకత్వం వహిస్తారు. మంచి లాభాలు సాధిస్తారు. లాభాలు పంచుకునే విషయంలో పనిచేయని వ్యక్తులకు, సోమరిపోతులకు భాగాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది మీ మనోవేదనకు కారణం అవుతుంది. దొంగకు, దొరకు ఒకే న్యాయం. ఇది మీరు జీర్ణించుకోలేకపోతారు. కుటుంబసభ్యుల సంతోషం కోసం విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తారు. సివిల్‌ సర్వీస్‌లలో విజయం సాధించడానికి ఎంతో కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మనస్సుకు ఊరట కలుగుతుంది. మీ మీద ఉన్న బాధ్యతలు స్నేహితుడిలా గుర్తుచేస్తాయి.

వివాహాది శుభకార్యాల విషయంలో కుటుంబపరంగా సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. ఎక్కువగా ఆలోచన చేయకుండా శుభకార్యాలను ఘనంగా చేస్తారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిని ఇతరుల సహాయంతో చేసి వచ్చిన లాభాలలో వారికి వాటా ఇచ్చి, వారిని సంతృప్తిపరుస్తారు. వ్యక్తిగత బలహీనత కలిగిన అధికారి మీ చేతికి చిక్కుతాడు. అతని సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులను సాధించుకుంటారు. నమ్మకం లేకపోయినా, ఎదుటివారి నిర్ణయం వల్ల, అనాలోచిత చర్యల వల్ల ఎంతో ప్రయోజనం పొందాల్సిన ఓ వ్యవహారంలో కొద్దిపాటి లాభాలు మాత్రమే దక్కుతాయి. వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయడం మంచిది. మీ ఆత్మీయవర్గం మీ శత్రువర్గం ఎప్పుడూ మీ కార్యక్రమాలపై, మీరు చేసే పనులపై నిఘా ఉంచుతారు. మీ ఆత్మీయవర్గం మీ ఎదుగుదలను సహించలేరు. మీ ఎదుగుదలలో మీరు తొక్కిన అడ్డంకులను ప్రచారం చేస్తారు, విమర్శిస్తారు.

స్త్రీల సహాయనిరాకరణ వల్ల, వాళ్ళతో ఏర్పడిన విభేదాల వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. అంతరాత్మ ప్రబోధానుసారం కొన్ని కార్యక్రమాలను వదిలివేస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. కొన్ని ప్రయోజనాలు వదులుకొని మీ పెద్దరికం, మర్యాదను సమాజంలో నిలుపుకుంటారు. మీడియా ప్రతినిధులతో సాంగత్యం ఏర్పడుతుంది. కష్టసుఖాలను సరిసమానంగా చూస్తారు. ఏది కోల్పోయినా మనోధైర్యం మాత్రం కోల్పోరు. వైఫల్యాల నుండి నేర్చుకున్న పాఠాలు చేతికి అందడానికి సాంకేతిక కారణాలు అడ్డువస్తాయి. శక్తికి మించి శ్రమిస్తారు. అందరూ కూడి వచ్చి సహాయం చేస్తామని చెబుతారు. సమస్యలు మొదలుకాగానే మొహం చాటేస్తారు. కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు. రెండో మూడో కలిసొస్తాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి అధికారులు చికాకు పెడుతున్న తరుణంలో అండగా ఉంటాడు అని భావించిన వ్యక్తి విరోధంతో దూరం కావడం జరుగుతుంది. ఈ సమస్యల వలయం నుంచి బయటకు రావవాల్సిన స్థితిలో ఆర్థిక ఒత్తిడులు, ఆరోగ్యం, న్యాయపరమైన సమస్యలు వస్తాయి. వాటిని అధిగమిస్తారు.

కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహిస్తారు. ప్రతి విషయాన్ని ఆచితూచి పరిశీలిస్తారు. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ గండం నుండి బయటపడతారు. మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వారికి గట్టిగా బుద్ధి చెబుతారు. వాళ్ళని ఎవరూ నమ్మకుండా బహిష్కరించే విధంగా చేయగలుగుతారు. పిల్లల విషయంలో ఒక దిగులు, ఆలోచన ఉంటుంది. సెంటిమెంట్స్‌ ప్రకారం వ్యాపారంలో ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలలో ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడతాయి. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్నవారు మిమ్ములను నమ్మకంలోకి తీసుకుంటారు. రాజకీయ జీవితంలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. చలనచిత్ర రంగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. విదేశాలలో నివసించేవారు స్వగృహం కొనుగోలు చేస్తారు. గ్రీన్‌కార్డు, స్టాంపింగ్‌ వంటివి అనుకూలిస్తాయి.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా