పాతకాలపు పెళ్లి

3 Aug, 2014 00:35 IST|Sakshi
పాతకాలపు పెళ్లి

ఆధునికత పూర్తిగా లోబరుచుకున్నాక, కోల్పోతున్న సంప్రదాయాలపై మనసు మళ్లడం సహజమే! బల్గేరియాలో ఇదే జరిగింది. వాళ్లు ఏకంగా పదిహేడో శతాబ్దంలో అక్కడ పెళ్లి ఎలా జరిగేదో అలా తిరిగి ప్రదర్శించారు. పనిలో పనిగా ఒక జంటకు పెళ్లి కూడా చేశారు.

రజ్‌గ్రాడ్ నగరానికి సమీపంలోని ఒక గ్రామ వేడుకలో భాగంగా జరిగిన ఈ శుభకార్యంలో వందలాది బల్గేరియన్లు తమ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించారు. ఆచారంగా చిరు గంటలు మోగించడం, వధూవరులకు మేలు చేయాలని పొట్టేలును బహూకరించడం, బృందనాట్యం చేయడం, సమష్టిగా విందారగించడం... అంతా కన్నులపండువగా జరిగింది.
 
ఒంటె గొర్రె
పరిమాణానికి గొర్రెలాగానూ, చూడ్డానికి ఒంటెలాగానూ కనిపిస్తున్న ఈ జీవిని అల్పకా అంటారు. ఒంటె జాతికే చెందినదేగానీ అందులో చిన్నరకం. దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఫొటో మాత్రం ఐరోపాలో తీసింది. ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్ రాష్ట్రంలోనిది. వేసవి ప్రవేశించే సమయంలో వాటికి ఇలా శుభ్రంగా బొచ్చు గొరిగేస్తారు. ఆ ఉన్నితో రకరకాల దుస్తులు తయారవుతాయి. క్షవరం తర్వాత మెలానీ విట్టుమ్ తన వ్యవసాయ క్షేత్రంలో అల్పకాలకు ఇలా స్నానం చేయిస్తోంది. ఇక్కడ సంబంధం లేని విషయం ఒకటి. అల్పకాలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఒకటి వేసిన పేడ మీదే అన్నీ వచ్చి వరుసగా వేస్తాయి.
 
తప్పిపోతే బాగుండు!

ఏ చిక్కూలేకపోతే జీవితంలోని మజా అర్థంకాదు. చిక్కుపడాలి, దాని ముడి విప్పాలి. అప్పుడుగానీ బతికిన అనుభూతి గాఢంగా పెనవేసుకోదు. అది అర్థం చేయించడానికే కాబోలు ఈ ప్రహేళికా నిర్మాణాలు! అమెరికాలోని ‘నేషనల్ బిల్డింగ్ మ్యూజియం’లోని ‘మేజ్’ ఇది. రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి.లో ఉంది. ఇందులో సందర్శకులు తప్పిపోతూ సంబరపడిపోతుంటారు. బయటపడ్డాక మరింత సంబరపడతారు.

మరిన్ని వార్తలు