చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

21 Jul, 2019 11:40 IST|Sakshi

పాటతత్త్వం

ఓ బేబీ చిత్రంలోని ‘ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన’ పాట గురించి నా మనసులో భావాలు పంచుకోవాలనుకున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన పాట. భర్త పోయిన భార్య తన బిడ్డను ఎంత కష్టపడి పెంచుకుందో అనే నేపథ్యంలో వచ్చిన ఈ పాట నా జీవితానికి కూడా వర్తిస్తుంది. నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే మా నాన్నగారు గతించారు. అప్పటికి నాకు ఇద్దరు చెల్లెళ్లు. వాళ్లు చాలా చిన్న పిల్లలు. అమ్మ వయసు 35 కూడా ఉండదు. మగ దిక్కులేని కుటుంబం ఎలా ఉంటుందో తెలిసిందే. తాతయ్య కూడా (అమ్మమ్మ భర్త) చాలా తొందరగా పోయారు.

రకరకాల వ్యాపారాలు చేసి తన పిల్లలను పెంచుకుంది మా అమ్మమ్మ. ఆ సంఘటనలన్నీ నా మనసును కలచి వేశాయి. సినిమాలో కనిపించే లక్ష్మి పాత్రలో నాకు మా అమ్మమ్మ కనిపించారు. అలాంటి కుటుంబాల నేపథ్యంలో ఉన్నాను కాబట్టి ఈ పాట రాయటం నాకు సులువైంది. మా ఇంట్లో చూసిన పాత్రలే రెండూ. అందువల్లే అంత నేచురల్‌గా వచ్చాయి మాటలు పాటలు. ‘సమాజంలో రకరకాల మనుషులు కన్నేసినా, మగాడికి మొగుడిలా బతికాను’ అని అమ్మమ్మ నా దగ్గర చాలాసార్లు అంది. ఆ మాటలను యథాతథంగా రాశాను.ఈ పాట పల్లవి విన్నవారంతా ఇదొక కొత్త భావన అన్నారు.

ఆకాశం అనేది సమాజమైతే, ప్రతి తల్లి ఆ ఆకాశంలో ఏకాకి మేఘమే. తన బాధను ఎవరికీ చెప్పకోలేదు. తనలో తాను కుమిలిపోతే వచ్చేదే ఏడుపు ... అదే వాన.  ‘నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా’ – ఏ దిక్కు, ఇల్లు లేని ఆ తల్లి నడిరోడ్డు మీద ఉంది, ఆ విషయం తెలియని పసి పిల్లవాడు పాల కోసం తల్లి ఎదను తాకుతుంటాడు. అప్పుడు తల్లికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాలకోసం ఏడ్చి నన్ను ఇబ్బంది పెట్టకు అని పిల్లవాడిని బతిమాలుతుంది. ‘తన పేగే తన తోడై తన కొంగే నీడై’ పేగు తోడు అంటే తన పేగు పంచుకుని పుట్టిన కొడుకే, వాడికి కొంగు తప్ప ఇంక నీడ ఇవ్వడానికి ఏమీ లేదు. అంత హీనమైన పరిస్థితిలో ఉంటుంది ఆ తల్లి.

‘అరచేత తలరాత ఎవరు చెరిపారో’  – అరచేతి రేఖలు వేరు, తలరాత వేరు, రెండింటినీ కలిపి ప్రయోగం చేశాను. మన అదృష్టం మన తలరాతను ఎవరు చెరిపేశారో అని గతం తలచుకుంటుంది. ‘ఒంటౖరై ఉన్నా ఓడిపోలేదు/జంటగా ఉంటే కన్నీరే కళ్లలో’ ఒంటరితనంతో ఉన్నా, ఏనాడూ ఓటమిని అంగీకరించకుండా, జీవితంలో ఎంతో పోరాడింది. ఆవిడ కళ్లలో ఉన్న కన్నీళ్లే ఆమెకు తోడుగా ఉన్నాయి. అందువల్ల ఆ తల్లికి తోడులేకపోవడం అనే ప్రశ్నే లేదు.

‘చీకటెంతున్నా వెలుగునే కన్నా బోసి నవ్వుల్లో నా బిడ్డ సెందురుడే’ – జీవితంలో చీకటి ఎంత ఉన్నా వెలుగునే చూసింది ఆ తల్లి. మరో అర్థంలో వెలుగుని కన్నది అని కూడా వచ్చేలా ఉపయోగించాను. బోసి నవ్వుల్లో తన బిడ్డ చంద్రుడే కనుక, ఆ తల్లి జీవితంలో చీకటి లేదు’ అనే భావనతో రాశాను. ఆ తల్లి నిరాశ నిస్సత్తువలో ఉన్నప్పుడు తన కొడుకే తనకు ఓదార్పు అయ్యాడు. ‘కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే’ – బతికి ఉందా లేదా అని అడిగే దిక్కు లేకపోవడంతో, తాను బతికి ఉందా లేదా అనే స్పృహ కూడా లేని దీనమైన స్థితిలో ఆ తల్లి పడిన బాధల నుంచి పుట్టింది ఈ పాట.

చలికి శరీరం వణుకుంతుంటే, తాను బతికి ఉన్నానని తెలుసుకుంది ఆ తల్లి. పాట కోసం కొత్తగా నేను శ్రమ పడలేదు. ఒక్క పూటలో రాసేశాను. రెండు చరణాలు రాశాను. సినిమాలో ఒక చరణం మాత్రమే పెట్టగలిగాం. నా మీద వేటూరి గారి ప్రభావం ఉంటుంది. ఈ పాట విషయంలో ఆయన ఆశీస్సులు నా నెత్తి మీద ఉన్నాయో, సరస్వతీ కటాక్షం ఉందో తెలీదు. నేను ఏ పాటనూ ఆలోచించి రాయను. పెన్ను పెట్టాక ఏది వస్తే అది రాస్తాను. మళ్లీ ఒక్క అక్షరం కూడా మార్చను. ఏదో మైకంలాంటిది వచ్చినప్పుడు నేను నేను కాదని నా అభిప్రాయం. అందుకే ఎవరైనా పాట బావుందని చెప్పినా అది నాకు ఆపాదించుకోను.
- లక్ష్మీ భూపాల, సినీ రచయిత
చిత్రం: ఓ బేబీ, రచన: లక్ష్మీ భూపాల, గానం: నూతన మోహన్‌, సంగీతం: మిక్కీ. జె. మేయర్

మరిన్ని వార్తలు