ఫోబియా... నిత్యం వెంటాడే శత్రువు

9 May, 2015 23:56 IST|Sakshi
ఫోబియా... నిత్యం వెంటాడే శత్రువు

భయం భయం
భయం... మనల్ని ధైర్యంగా వెంటాడే శత్రువు. మనం పుట్టిన తర్వాత అది మనలో ఎప్పడు పుడుతుందో చెప్పలేం. కానీ ఒకసారి పుట్టిందంటే చనిపోయే వరకు ఎంతో కొంత వెంటాడుతూనే ఉంటుంది. తొమ్మిదిశాతం మంది ఏదో ఒక ఫోబియాతో బాధపడుతుంటారని అమెరికాలోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ చెప్తోంది. ప్రధానంగా కనిపించే పది ఫోబియాలను చూద్దాం.
 
ఆక్రోఫోబియా... ఎత్తై ప్రదేశాలంటే భయపడడాన్ని ఇలాగంటారు. వీరిలో కొంతమంది విమానం ఎక్కాలన్నా భయపడతారు. దానిని ఏరో ఫోబియా అంటారు.
క్లాస్ట్రో ఫోబియా... మూసి ఉన్న ప్రదేశాలంటే భయం. గదిలో తలుపులు మూసుకోవడానికి కూడా భయపడతారు. వీరు క్లోజ్‌డ్ లిఫ్ట్‌లో వెళ్లడానికి భయపడతారు.
అగోరా ఫోబియా... బహిరంగ ప్రదేశాలను చూసి భయపడడం. ఇల్లు దాటి బయటకు రారు. సమావేశాలకు వెళ్లాలన్నా, ఆఖరుకు మార్కెట్‌కెళ్లాలన్నా భయపడుతుంటారు. అలా చెప్పకుండా ఏదో వంకలు చెబుతూ ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
నైక్టోఫోబియా... చీకటంటే భయం. చీకట్లో భయపడడం బాల్యంలో సహజమే. పెద్దయ్యేకొద్దీ ఆ భయం తగ్గిపోవడం సహజం. అలా తగ్గకపోతే దానిని ఫోబియాగా గుర్తించాలి.
ఓఫిడియో ఫోబియా... పాములంటే భయం. పామును చూస్తే అందరూ భయపడతారు. కానీ ఈ ఫోబియా ఉన్న వారికి పాము తలంపే చెమటలు పట్టిస్తుంది.
ఆరాక్నో ఫోబియా... సాలీడును చూస్తే భయపడడం. మనలో చాలామందికి సాలీడు ఒంటి మీద పడితే కొత్త బట్టలు వస్తాయని ఓ నమ్మకం. పిల్లలు సాలీడును ఒంటి మీద వేసుకుంటుంటారు కూడా. అయితే సాలెపురుగంటేనే భయపడే వాళ్లూ ఉంటారు.
పానో ఫోబియా... ఇది మెడికల్ ఫోబియా. ఇంజెక్షన్ సూదిని చూసి భయపడడం. ఎంత పెద్ద వాళ్లయినా సరే ఇంజెక్షన్ వేయించుకోవాలంటే భయపడుతుంటారు.
ఆస్ట్రా ఫోబియా... మెరుపు, వెలుతురంటే భయం. వర్షం మొదలైందంటే... ఇల్లు దాటి బయటకు వెళ్లరు. గదిలో దూరి తలుపులు వేసుకుని కళ్లు మూసుకుంటారు.
నోసో ఫోబియా... ఏదో జబ్బు ఉందనే అపోహతో కూడిన భయం. ఈ ఫోబియా ఉన్న వారిలో ఎక్కువ మంది వైద్యవిద్యార్థులే. కోర్సులో అనేక రోగాలను తెలుసుకుంటారు కాబట్టి దేహంలో ఏ చిన్న మార్పు కనిపించినా అది ఏ రోగ లక్షణాలకు సరిపోలుతుందా అని అన్వయించుకుంటూ ఉంటారు.
హైడ్రో ఫోబియా... నీటిని చూసి భయపడడం. ఈత రాకపోవడం వల్ల మునిగిపోతామనేటువంటి సాధారణ భయం ఉంటుంది. నీటి ప్రమాదాలను దగ్గరగా చూడడం వల్ల భయం ఏర్పడవచ్చు. అలాగే రేబిస్ వ్యాధికి (కుక్క కాటు) గురైనప్పుడు నీటిని చూస్తే విపరీతంగా ఆందోళన చెందుతూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.

ఈ ఫోబియాలు తీవ్రమైతే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి గుర్తించిన వెంటనే నిపుణులతో కౌన్సెలింగ్ తీసుకుని ఆ భయాలను దూరం చేసుకోవాలి.

మరిన్ని వార్తలు