అతిపురాతనం అధరాలంకరణం!

19 Mar, 2016 23:57 IST|Sakshi
అతిపురాతనం అధరాలంకరణం!

పురాణాలు, ప్రబంధాలలో బింబాధర వర్ణనలను విరివిగానే చదువుకుని ఉంటాం. వాటిని చదివినప్పుడల్లా లిప్‌స్టిక్‌లేవీ లేని కాలంలో అప్పటి కవులు పెదవులను అంత సవర్ణభరితంగా ఎలా వర్ణించారబ్బా అని ఆశ్చర్యపోయే ఉంటాం. ఇప్పటి మోడర్న్ మేకప్‌లో వాడే లిప్‌స్టిక్ అప్పట్లో ఉండేది కాదు. అయితే, అధరాలంకరణ అలవాటు అప్పట్లో లేదనుకుంటే పొరపాటే! ఐదువేల ఏళ్ల కిందటే సుమేరియన్లు పెదవులకు రంగు పూసుకునేవారు. పైగా ఆడా మగా తేడా లేకుండా అందరూ పూసుకొనేవాళ్లు. ప్రాచీన ఈజిప్షియన్లు తమ సామాజిక హోదాను చాటుకొనేందుకు పెదవులను శ్రద్ధగా అలంకరించుకునేవారు. మొక్కల నుంచి ఖనిజాల నుంచి ఎరుపు రంగును సేకరించి, శుభ్రపరచి పెదవులకు అలంకారంగా వాడేవారు. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్ నిత్యం ఎర్రబారిన పెదవులతోనే ప్రజలకు దర్శనమిచ్చేది.


తెల్లని ముఖంలో ఎర్రని పెదవులను జనం అబ్బురంగా చూసేవాళ్లు. కొన్నాళ్లకు ఈ ఫ్యాషన్‌ను అనుకరించడం మొదలుపెట్టారు. అప్పట్లో తేనెటీగల కొవ్వులో మొక్కల నుంచి సేకరించిన ఎరుపురంగును కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని దీర్ఘకాలం భద్రపరచుకుని ఉపయో గించేవారు. ఆధునిక లిప్‌స్టిక్‌కు ఒకరకంగా ఇదే పూర్వరూపం. ప్యారిస్‌లోని ఓ కాస్మొటిక్స్ సంస్థ 1884లో మొదటిసారిగా రకరకాల రసాయనాలను ఉపయోగించి ఆధునిక లిప్‌స్టిక్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇక అప్పటి నుంచి పాశ్చాత్య ఫ్యాషన్ రంగంలో లిప్‌స్టిక్ కీలకంగా మారింది. క్రమంగా ఇది ఇతర దేశాలకూ వ్యాపించింది.

మరిన్ని వార్తలు