మా రాంబాబు గాడి ‘భశుం’ కాపురం!

25 Oct, 2014 22:29 IST|Sakshi
మా రాంబాబు గాడి ‘భశుం’ కాపురం!

నవ్వింత
మా రాంబాబుగాడికి కాస్త స్టైల్‌గా, హీరోలా, షాన్ ఔర్ షౌకత్‌తో జీవించాలని కోరిక. అదేం చిత్రమోగానీ... వాడేదైనా సినిమాటిగ్గా చేయబోతే చాలు... అది డ్రమటిగ్గా ఫెయిలవుతుంటుంది. బాపూగారి ఫేమస్ కార్టూన్ ఒకటుంది. ‘భశుం’ కార్డ్ పడ్డ తర్వాత ‘ఇంత అవక తవక కంగాళీ చిత్రం చూళ్లేదండీ’ అనుకుంటూ ప్రేక్షకులు హాల్లోంచి బయటకొస్తూ ఉంటారు. ఆ ‘భశుం’ కార్డు పడటానికి ముందు జరిగిందంతా మా రాంబాబుగాడి సినిమాయేనని వాడి అనుమానం.  
   
భావుకుల భాషలో చెప్పాలంటే... ఒక ఆహ్లాద భానూదయ తొలికాంతుల వేళ. చలిగిలిగింతలు పెట్టే లేత పవనాల హేల. ధారగా కురుస్తున్న తుషారబిందువుల మాల! అయితే... మా రాంబాబుగాడి భాషలో క్రూడ్‌గా చెప్పాలంటే మంచు కురుస్తూ, చలి గజ్జున వణికిస్తున్న సమయంలో ఆ మంచుగాల్లో లారీల పొగ కాలుష్యం కాస్తా కాక్‌టెయిల్‌లా కలసిన టైము. నెత్తి మీద ముసుగేసుకున్నట్లుగా ఉండే ట్రాక్ సూట్‌తో (పై ముసుగును హుడ్ అంటారట) సినిమా హీరోలా జాగింగ్‌కు బయల్దేరాడు మన రాంబాబు.

తల చుట్టూ ఉన్న హుడ్డులోని గుడ్లు తేలేశాడు. ఆరోగ్యం మాట ఎలా ఉన్నా అలర్జీతో ఆయాసంలో మునిగి ఆసుపత్రిలో తేలాడు. ప్రతివాడూ ప్రత్యూష పవనాలు బాగుంటాయంటాడు. కానీ ఇదేంట్రా... మనకు ఆ అందాలేమీ కనపడలేదు సరికదా... అనారోగ్యం మిగిలి, మందులు మింగాల్సి వచ్చింది అంటూ బాధపడ్డాడు.  వాడి జాతకమే అంత. పరుగులోనే కాదు... పాణిగ్రహణంలోనూ అదే జరిగింది. పేరులోనే ‘గ్రహణం’ అనే మాట ఉన్న తర్వాత అలా జరగకుండా ఎలా ఉంటుంది? అందునా రాంబాబుకీ?!
   
ఈ లోకంలో ఎవడైనా సరే... తన ప్రియురాలిని ప్రేమిస్తే... అదృష్టవంతుడైతే ఓకే అంటుంది. కాకపోతే కుదర్దు అనేస్తుంది. అదేమిటోగానీ... మన రాంబాబుగాడు  ఎలాంటి ప్రపోజలూ పంపకముందే ఓ అమ్మాయి అతడి దగ్గరకు వచ్చి... ‘‘సారీ రాంబాబూ... కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను నిన్ను ప్రేమించడం కుదర్దు. నా అశక్తతకు నన్ను మన్నించు’’ అనేసింది. అప్పట్నుంచి మనవాడికి అమ్మాయిలంటే చెడ్డ మంట. నేను ప్రపోజ్ చేస్తే నువ్వీమాట అనడం ఓ పద్ధతి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఇదేమిటంటూ మండిపడ్డాడు మనవాడు.
 
ఇది జరిగాక ఓ ముగ్గురు నలుగురు అమ్మాయిలు మనవాడికి తమ ప్రేమ ప్రపోజల్స్ పంపారు. కానీ అమ్మాయిలంటే ఉన్న మంట కొద్దీ మనవాడు వాళ్లందర్నీ కసికసిగా రిజెక్ట్ చేసేశాడు. ఈ లోపుగా మరో అమ్మాయి (ఈమె ఐదోది) నుంచి కూడా లవ్ ప్రపోజల్ వచ్చింది. అదేం మూడ్‌లో ఉన్నాడోగానీ... ఈసారి ఓకే చెప్పాడు. మనవాడు ఓకే చెప్పినప్పట్నుంచీ ఆ అమ్మాయి అన్యమనస్కంగా మారిపోయింది. చిరాకూ పరాకులతో చిర్రుబుర్రులాడింది. ఈ అల్లకల్లోలాల మధ్యనే వాళ్ల పెళ్లయిపోయింది.
   
పెళ్లయితే అయ్యింది గానీ... దంపతుల మధ్య రోజూ గిల్లికజ్జాలే. ఏదో ఒక విషయంపై అగ్గిఫైరింగులే. ప్రేమపెళ్లే కదా ఇలా ఎందుకు జరుగుతోందని బంధువర్గమంతా ఆశ్చర్యపడ్డారు. ఎట్టకేలకు చాలా అనునయించి విషయం రాబట్టాడు మన రాంబాబు. సదరు ప్రేమిక చెప్పిన జవాబేమిటంటే... ‘‘ఆ రోజుల్లో మీరు రిజెక్ట్ చేసిన నలుగురు అమ్మాయిలకూ మంచి సంబంధాలు వచ్చాయి. ఒకరికి ఐఏఎస్ సెలక్టయినవాడితో పెళ్లి కాగా... మరొక అమ్మాయికి ఫారిన్ సంబంధం కుదిరింది. ఇంకో అమ్మాయికి ఐఆర్‌ఎస్‌తో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో రాష్ట్రస్థాయి అధికారి! దాంతో మన వీధిలోని అమ్మాయిల్లో ఒక రూమర్ పాకింది.

మీకు ప్రపోజ్ చేసి, మీతో రిజెక్ట్ చేయించుకుంటే చాలు... ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుందనే గుసగుసలు బయల్దేరాయి. ఈ సెంటిమెంట్ టాక్‌తో నేనూ ప్రభావితమై... ఎలాగూ రిజెక్ట్ చేయకపోతారా అని మీకు ప్రపోజ్ చేశాను. మీరు అవునన్నారు కాబట్టి నేను కాదనలేను. నేనే ప్రపోజ్ చేసినా, మీ మీద మనసు లేదు కాబట్టి అవుననలేను. అందుకే మన కాపురం ఇలా ఏడ్చింది’’ అంటూ విషయం బయట పెట్టింది. ఎంత సినిమాటిగ్గా జీవించాలనుకుంటాడో అంత డ్రమటిగ్గా మారిపోవడం వాడి జీవిత ప్రత్యేకత.
   
ఈలోపు రాంబాబు గాడికీ కాస్త గౌరవప్రదమైన ఉద్యోగమే వచ్చి, దాంట్లో చేరిపోయాడు. అది జరిగాక కాస్త కౌన్సెలింగ్ ఇవ్వడంలో దిట్టలైన కొందరు మహిళామణులు బయల్దేరి... ‘రాంబాబు గాడికి ప్రపోజ్ చేస్తే, మంచి సంబంధం కుదురుతుందనే సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. నీ అదృష్టం బాగుంది కాబట్టే వాడికి మంచి జాబ్ వచ్చింది. లేదంటే వాడిలాంటి రెటమతం గాడికి అలాంటి ఉద్యోగమా?’’ అంటూ వాడి భార్యామణిని అందరూ సమాధానపరచారు. దాంతో తన రాతా బాగుండబట్టే రాంబాబుకు జాబు దక్కిందనీ, దాంతో తన అదృష్టమూ చక్కబడిందనే తృప్తితో కలహం సద్దుమణిగించి, కాపురం మొదలుపెట్టింది వాడి సతీమణి. ఇవన్నీ వాడికీ తెలుసుకాబట్టే... ఎప్పుడైనా పెళ్లాంతో కాస్త గొడవ మొదలవ్వగానే... ‘భశుం’ అంటూ బయటికి జారిపోయి, సద్దుమణిగాక ఇంట్లోకి దూరిపోయి... ఇలా ఇంట్లోకీ, బయటకీ షటిల్ సర్వీసు చేస్తుంటాడు.
 - యాసీన్

మరిన్ని వార్తలు