నాదసలే రఫ్‌ హ్యాండ్‌!

13 May, 2017 23:43 IST|Sakshi
నాదసలే రఫ్‌ హ్యాండ్‌!

కృష్ణవంశీ ‘అంతఃపురం’ సినిమాలో గుర్తుండే పాత్రలలో ‘జీవీ’ పాత్ర ఒకటి.ప్రత్యర్థులను మందుపాతరతో పేల్చేయడానికి ఉచ్చు బిగించే సీన్‌ నుంచి, ప్రత్యర్థుల చేతిలో మేకలా బలయ్యే సీన్‌ వరకు అద్భుతమైన విలనిజాన్ని పండించాడు జీవీ.భారీ డైలాగులేమీ లేకపోయినా భారీ కాయంతో, పొడవాటి వెంట్రుకలతో భయపెట్టాడు. భయానకాన్ని సృష్టించడానికి అతని రెండు కళ్లు వందల ఆయుధాలయ్యాయి. ‘ఎవరీ జీవీ?’ అని అందరూ మాట్లాడుకునేంత గుర్తింపు తెచ్చుకున్న ‘జీవీ’ అసలు పేరు సుధాకర్‌ నాయుడు. ఈయన చిరంజీవి వీరాభిమాని∙విద్యార్థి సంఘ రాజకీయాలు, క్రికెట్‌ గురించి తప్ప... ‘నటన’ మీద ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు సుధాకర్‌ నాయుడు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సుధాకర్‌ ఆ తరువాత హైదరాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు.

రెండు సంవత్సరాల తరువాత... ఏదో అసంతృప్తి.‘ఇది కాదు... ఇంకా ఏదో చేయాలి’ అనుకున్నాడు.తరువాత యు.ఎస్‌ వెళ్లి  ఇంటర్నేషనల్‌ లా మాస్టర్స్‌ చేశాడు. రోజూ జిమ్‌కు వెళ్లడం, జుట్టు పొడవుగా పెంచడంతో పాటు అక్కడి జీవనశైలితో మమేకమైపోయి ఇండో–అమెరికన్‌గా మారిపోయాడు. రెండున్నర సంవత్సరాల తరువాత ఇండియాకు వచ్చాడు. అమెరికా నుంచి తెచ్చిన గిఫ్ట్‌ను తనకు బంధువైన దాసరి నారాయణరావుకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు... పొడవాటి జుట్టు చూసి ‘ఏంటీ ఇలా అయిపోయావు?’ అన్నారు దాసరి.

‘‘అమెరికాలో ఉన్నాను కదా’’ అని చిన్నగా నవ్వాడు సుధాకర్‌.‘‘అరుణ్‌బాబుతో సినిమా స్టార్ట్‌ చేస్తున్నాను. నటిస్తావా?’’ అడిగారు దాసరి.‘‘నాకెందుకు సార్‌ నటన... కోర్టులో ప్రాక్టీస్‌ చేయాలి’’ అని మొదట అన్నాడు గానీ దాసరి ఒప్పించడంతో ‘చిన్నా’ సినిమాతో  విలన్‌గా పరిచయం అయ్యాడు సుధాకర్‌ నాయుడు. ఫీల్డ్‌లో సుధాకర్‌లు ఇద్దరు ముగ్గురు ఉండడంతో ‘చిరంజీవి’లోని చివరి అక్షరాలతో సుధాకర్‌ నాయుడికి ‘జీవీ’గా వెండితెర నామకరణం చేశారు దాసరి. ఈ సినిమా తరువాత ‘అంతఃపురం’లో నటించే అవకాశం వచ్చింది జీవీకి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని జీవీ తెలుగులో మాత్రమే కాదు కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ ‘అగ్రెసివ్‌ విలన్‌’గా మంచి గుర్తింపు పొందుతున్నారు.

మరిన్ని వార్తలు