వేడెక్కుతోంది...

13 May, 2017 23:42 IST|Sakshi
వేడెక్కుతోంది...
- 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- చింతూరులో అత్యధికంగా 43 డిగ్రీలు
- మరో వారం రోజులు ఇంతే 
అమలాపురం : భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా అగ్నిగుండంగా మారిపోతోంది. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విలీన మండలమైన చింతూరులో శనివారం ఏకంగా 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. రాజమహేంద్రవరం, పచ్చని కోనసీమలో సైతం 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. కాకినాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తుని, మండపేట వంటి ప్రాంతాల్లో సైతం ఇదే ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం పది గంటల తరువాత బయటకు రావాలంటనే భయపడుతున్నారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో కూడా 33 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం, వేడి గాలులతో సామాన్యులు అపసోపాలు పడుతున్నారు. ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం విశేషం.  
ఈ వారం మరింత తీవ్రత...
ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వారం పొడవునా అత్యధిక ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాల్లో ఎండతీవ్రత ఎక్కువగ ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పుడే ఎండతీవ్రతలు ఇలా ఉంటే రోహిణిలో ఎలా తట్టుకునేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. 
మరిన్ని వార్తలు