ప్రాతఃస్మరణీయుడు

5 Aug, 2018 01:35 IST|Sakshi

ధ్రువతారలు

నౌరోజీ గురించి, ఆయన పార్లమెంటరీ సేవల గురించి బాలగంగాధర తిలక్‌ చేసిన వ్యాఖ్య అద్భుతంగా అనిపిస్తుంది– ‘బ్రిటిష్‌ పార్లమెంట్‌కి ఒక సభ్యుని ఎన్నుకునే అధికారం మా 28 కోట్ల భారతీయులకు ఇస్తే, మేం తప్పనిసరిగా నౌరోజీనే ఎన్నుకుని ఉండేవాళ్లం’.

‘ఒక నల్లజాతీయుడిని ప్రజాప్రతినిధిగా చూసుకోవడానికి బ్రిటిష్‌ ప్రజలు సిద్ధంగా లేరు.’ ఇది 1886లో నాటి బ్రిటిష్‌ ప్రధాని లార్డ్‌ సాలిస్‌బరీ చేసిన ప్రకటన. ఆ సంవత్సరం బ్రిటిష్‌ పార్లమెంట్‌ దిగువ సభ ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికలలో లిబరల్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆసియా వాసిని గురించి కన్జర్వేటివ్‌ పార్టీ వాడైన సాలిస్‌బరీ ఈ మాట అన్నాడు. ఆయనే దాదాభాయ్‌ నౌరోజీ. ఆసియా నుంచి బ్రిటిష్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి ఆసియా వాసి ఆయనే. ఆయన భారతీయుడు కావడం ఇంకొక చరిత్రాత్మక సంఘటన. మొత్తం బ్రిటిష్‌ జాతీయులంతా ఆయనను వ్యతిరేకించలేదు. ఆయనకు మద్దతుగా ఒక అద్భుత వనిత, చరిత్ర మహిళ నిలిచారు. ఆమె ఫ్లారెన్స్‌ నైటింగేల్‌.  ‘నల్లజాతీయుడు’ అంటూ సాలిస్‌బరీ అత్యంత సంస్కార హీనంగా మాట్లాడినా అది నౌరోజీ విషయంలో వరమే అయింది. అప్పటికి ఇంకా రవి అస్తమించని సామ్రాజ్యంగానే వెలిగిపోతున్న బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్య పత్రికలలో ప్రముఖ స్థానం సంపాదించింది. దీనితో రాత్రికి రాత్రి నౌరోజీ ఇంగ్లండ్‌లో ప్రముఖ వ్యక్తి అయిపోయారు. సాక్షాత్తు ఇంగ్లండ్‌ ప్రధాని ప్రస్తావించిన ఆ నల్లజాతీయుడు ఎవరు? ఆయన దాదా భాయ్‌ నౌరోజీ (సెప్టెంబర్‌ 4,1825–జూన్‌ 30, 1917)! భారతదేశంలో బొంబాయి నగరం నుంచి వచ్చారు. అయినా తెల్లవాళ్లలాగే పాలిపోయినట్టు కనిపించే శరీరం వర్ణంతో ఉండే నౌరోజీని నల్లజాతీయుడు అని ఎందుకంటున్నారు అన్న సందేహం కూడా అప్పుడే వచ్చింది. చర్చ మొదలైంది. 
నౌరోజీ అంటే కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతఃస్మరణీయుడు. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. మూడు పర్యాయాలు జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సభలకు అధ్యక్షత వహించిన నాయకుడు. బొంబాయిలోనే గుజరాతీ మాట్లాడే పేద కుటుంబంలో నౌరోజీ పుట్టారు. ఆయన నాలుగో ఏటనే తండ్రి నౌరోజీ పలాన్జీ దోర్దీ కన్నుమూశారు. కుమారుడిని పెంచే బాధ్యత తల్లి మానేక్‌బాయి మీద పడింది. ఆమె కొడుకును బాగా చదివించింది. ఆయన ఎలిఫెన్‌స్టోన్‌ ఇనిస్టిట్యూట్‌లో చదివారు. తరువాత అక్కడే ఆచార్య పదవిని పొందారు. తన జొరాస్ట్రియన్‌ మతంలో సంస్కరణల కోసం ఆయన పాటు పడ్డారు. 1855లో వ్యాపారం కోసం ఇంగ్లండ్‌ వెళ్లారు. కొద్దికాలం తరువాత తన సొంత జౌళి పరిశ్రమను స్థాపించారు. ఇంగ్లండ్‌లో భారతీయుడు స్థాపించిన తొలి వాణిజ్య సంస్థ అదే.  భారతదేశ దుస్థితికి కారణం– భారతీయ జీవనం గురించి ఆంగ్లేయులకి తెలియకపోవడమేనన్నారాయన. 1833 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్‌ పాలకుల నుంచి 20 ఏళ్ల పాటు భారత్‌ను లీజ్‌కు తీసుకున్నారు. 1853లో ఈ లీజ్‌ను కొనసాగించడానికి ప్రతిపాదన వచ్చింది. దీనిని నౌరోజీ తీవ్రంగా వ్యతిరేకించారు.

నౌరోజీ మళ్లీ 1892లో జరిగిన ఎన్నికలలో ఫిన్స్‌బరీ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి ఈ ‘నల్లజాతీయుడు’ విజయం సాధించాడు. తక్కువ ఓట్లతోనే నెగ్గి ఉండవచ్చు. కానీ చరిత్ర సృష్టించాడు. నల్లవాడి గెలుపుని జీర్ణించుకోలేని  ప్రత్యర్థి, కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థి మళ్లీ ఓట్లు లెక్కించాలని కోరాడు. అదే జరిగింది. మొదట కేవలం మూడు ఓట్లు ఆధిక్యం ఉంది. తిరిగి లెక్కించినప్పుడు ఆ సంఖ్య ఐదుకు చేరింది. అప్పటికి కూడా ఆయనను గేలి చేయడం మానలేదు. దాదాభాయ్‌ నేరో మెజారిటీ (అత్తెసరు ఓట్లతో గెలిచినవాడు) అని పిలిచేవారు, తెల్లజాతీయులు. కానీ వాటిని పట్టించుకోలేదాయన. ‘మనం ప్రధానంగా యుద్ధం చేయవలసింది పార్లమెంటులోనే’ అనే వారాయన. నిజంగానే ఆ యుద్ధంలో విజయం సాధించారు. అక్కడి సంప్రదాయం ప్రకారం బైబిల్‌ మీద ప్రమాణం చేసి పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ తాను పార్శీ మతస్తుడు కాబట్టి నౌరోజీ అందుకు అంగీకరించలేదు. చిత్రంగా జెండా అవస్తా మీద ప్రమాణం చేయడానికి ఆయనకు అనుమతి లభించింది. ఒక సందర్భంలో నౌరోజీ గురించి, ఆయన పార్లమెంటరీ సేవల గురించి బాలగంగాధర తిలక్‌ చేసిన వ్యాఖ్య అద్భుతంగా అనిపిస్తుంది– ‘బ్రిటిష్‌ పార్లమెంట్‌కి ఒక సభ్యుని ఎన్నుకునే అధికారం మా 28 కోట్ల భారతీయులకు ఇస్తే, మేం తప్పనిసరిగా నౌరోజీనే ఎన్నుకుని ఉండేవాళ్లం’. పార్లమెంటులో ఉన్నది మూడేళ్లే అయినా నిర్మాణాత్మకమైన కృషి చేశారు నౌరోజీ. ఆ సమరానికి అనేక కోణాలు ఉన్నాయి. అందులో రెండు ముఖ్యమైనవి. ఒకటి – భారతదేశంలో ఇంగ్లండ్‌ చేస్తున్న ఆర్థిక దోపిడీ. రెండు– భారతదేశానికి స్వయం ప్రతిపత్తి. మూడు– మహిళలకు ఓటు హక్కు. 

భారత జాతీయ కాంగ్రెస్‌ తొలితరం నేతలంతా విధేయులే. బ్రిటిష్‌ జాతి భారతదేశం నుంచి వెళ్లిపోవాలని, సంపూర్ణ స్వాతంత్య్రం భారతీయుల పరం కావాలని ఆశించిన వారు కారు. స్వయం ప్రతిపత్తి, డొమీనియన్‌ స్థాయి కల్పిస్తే అదే చాలునన్న భావమే వారికి ఉంది. అయినా ఇంగ్లండ్‌ మూలంగా భారతదేశం ఎంత నష్టపోతున్నదో వారి దేశంలోనే, వారి పార్లమెంటు వేదికగానే నినదించదలిచినవారు నౌరోజీ. రాజకీయానికి ఆర్థిక కోణం ఎంత అవసరమో భారతీయులకు చెప్పినవారు నౌరోజీ. అందుకే రాజకీయాలకు నౌరోజీ గణాంకాలు కూడా నేర్పారని అంటూ ఉండేవారు. తన భావాలను, వాస్తవాలను ‘పావర్టీ అండ్‌ అన్‌బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అన్న పుస్తకంలో నౌరోజీ అమోఘంగా నమోదు చేశారు. డ్రెయిన్‌ థియరీ ఆయన మేధో జనితమే. 1886 ప్రాంతంలో భారత జాతీయాదాయం ఎంత? అంటే ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్‌ రాచరికానికి భారతదేశం దఖలు పడ్డ దరిమిలా, ఇరవై ఎనిమిదేళ్లకు ఆర్థిక పరిస్థితి గురించి నౌరోజీ సంధించిన ప్రశ్న ఇది. బహుశా బ్రిటిష్‌ ఇండియాలో జరుగుతున్న ఆర్థిక దోపిడీ గురించి గణాంకాల ఆధారంగా వెలువడిన తొలి ప్రశ్న ఇదే కావచ్చు. జాతీయాదాయం గురించి అధికారులు చెబుతున్న గణాంకాలను తాను విశ్వసించలేనని కరాఖండీగా చెప్పేశారాయన. ‘ది ఇండియన్‌ ఎకనమిస్ట్‌’ అన్న ఒక్క పత్రిక మాత్రమే ఇలాంటి వివరాలు ప్రచురిస్తూ ఉండేది. ఆ పత్రిక కూడా చాలినంతగా సమాచారం ఇవ్వడం లేదని ఆయన వాదన. అసలు అధికారుల లెక్కలు తప్పుతోవ పట్టించే విధంగా ఉన్నాయని అనేవారు నౌరోజీ. భారత్‌ అభివృద్ధి పథంలో సాగిపోతోంది అంటూ నోటిమాటగా చెప్పే మాటలు సరికావని కూడా తేల్చి చెప్పారాయన. దేశంలో సగటు వార్షిక తలసరి ఆదాయం ఎంత? ఇది చెప్పాలి అన్నారు. ఆకలితో నకనకలాడిపోతూ శ్రమించే కార్మికుడిని బట్టి కాదు, కార్మికుడు ఆరోగ్యంతో ఉంటే అతడి అవసరాలు ఎలా ఉంటాయో, ఆ ఆదాయం ఆధారంగా వివరాలు చెప్పాలని కోరారు. ఈ ప్రశ్నలు ఎందుకు వేయవలసి వచ్చిందో కూడా చెప్పారు నౌరోజీ. బ్రిటిష్‌ అధికారులు ఇచ్చిన గణాంకాల ప్రకారం 1867–1870 సంవత్సరాలలో సగటున భారతీయుడి తలసరి ఆదాయం ఏటా రూ. 20 మాత్రమే. శ్రామికుడు ఆరోగ్యంగా పనిచేయాలంటే ఉండవలసిన ఆదాయం రూ. 34. పై తరగతుల వారికీ, మధ్య తరగతుల వారికీ జాతీయాదాయంలో ఎక్కువ వాటా దక్కుతోంది. పేదలకి మాత్రం కనీస అవసరాలకు కూడా ఆదాయం అందడం లేదు. కాబట్టి బ్రిటిష్‌ ఇండియాలో రెండు భారతాలు ఉన్నాయని నిర్ధారించారాయన. సౌభాగ్యంతో వెలుగొందుతున్న భారత్‌ ఒకటి. ఇది బ్రిటిష్‌ వారికీ, కొందరు విదేశీయులకీ పరిమితం. రెండవది పేద భారతం. ఇది పేద భారతీయుల పరం. 

భారతీయుల మీద బ్రిటిష్‌ పాలకుల వివక్ష పన్నుల విషయంలో ఇంకా స్పష్టంగా తెలుస్తూ ఉంటుందని నౌరోజీ ఉదాహరణలతో చెప్పారు. పన్ను విధింపులో ఇది మరీ సుస్పష్టం. ఇంగ్లండ్‌లో విధించే ఆదాయం పన్ను 8 శాతం. అదే భారతదేశంలో మాత్రం 15 శాతం పన్ను విధించేవారు. మాంచెస్టర్‌ నుంచి దిగుమతి అయ్యే జౌళి ఉత్పత్తుల మీద సుంకం ఎత్తివేయడం గురించి ఇంగ్లండ్‌ కుత్సితానికి నిదర్శనంగా కనిపిస్తుంది. దీనితో భారతదేశంలోని జౌళి పరిశ్రమ నాశనం కావడానికి పునాది వేసినట్టయింది. ప్రభుత్వం తెచ్చే రుణాలకి అధిక వడ్డీ చెల్లించడం, ఐరోపావారు అందించే సేవలకి విపరీతంగా చెల్లింపులు చేయడం– ఈ రెండింటితోనే భారత్‌లో పేదరికం వీరవిహారం చేస్తోందని నౌరోజీ విశ్లేషించి చూపారు. భారతీయుల మీద భారం ఎక్కువగానే పడుతున్నదంటూ 1870లో నాటి ప్రధాని గ్లాడ్‌స్టోన్‌ వెల్లడించిన సంగతి గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు, మరో 23 సంవత్సరాల తరువాత ఆయనే భారత్‌ భరిస్తున్న సైనిక వ్యయం ప్రమాదకర స్థాయిలో ఉందని కూడా అన్నాడు. అయినా బ్రిటన్‌ తన అవసరాల కోసం సైన్యాన్ని వినియోగించుకున్నప్పుడు తన వాటా తాను భరించవలసి ఉంటుందని కూడా నౌరోజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 37 ఏళ్ల గణాంకాలను పరిశీలించిన తరువాత నౌరోజీ ఎగుమతి, దిగుమతుల వివరాలు కూడా ఇచ్చారు. భారత్‌ నుంచి జరిగిన ఎగుమతుల కంటే, దిగుమతుల విలువ 50 కోట్లకు పెరిగిందని ఆయన తేల్చారు. రైల్వేల నిర్మాణం కూడా బ్రిటన్‌ అవసరాలకే ఎక్కువ ఉపయోగపడుతున్నది తప్పితే సాధారణ భారతీయుడికి అందుబాటులోకి రావడం లేదని నౌరోజీ ఆక్రోశించారు. అంటే రైల్వే వ్యవస్థ నిర్మాణం కోసం తెచ్చిన విదేశీ రుణభారం భారత్‌ మీద పడేది. ఈ వాదనలను బట్టి బ్రిటిష్‌ ప్రభుత్వం వైలీ కమిషన్‌ నియమించింది. భారతదేశంలో జరిగే ఆదాయ వ్యయాల గురించి నివేదిక ఇవ్వడానికి ఉద్దేశించిన కమిషన్‌ ఇది. పరిపాలనా వ్యయం, సైనిక వ్యయం భారత్, ఇంగ్లండ్‌ ఏ నిష్పత్తిలో భరించాలన్న అంశాన్ని సిఫారసు చేయడం కూడా ఈ కమిషన్‌ ఉద్దేశం. నౌరోజీ సేవలు చరిత్రపుటలకి అందేవి కావు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు 1894లో ఆయనకు ఒక లేఖ రాశారు– ‘పిల్లలు తండ్రి వైపు చూస్తున్నట్టు, భారతీయులు మీ వైపు చూస్తున్నారు. ఇక్కడ అచ్చంగా ఉన్న భావన ఇదే.’  దక్షిణాఫ్రికాలో భారతీయుల, విస్తృతార్థంలో చెప్పాలంటే నల్లజాతీయుల కడగండ్లను తీర్చడానికి బ్రిటిష్‌ ప్రభుత్వంతో చర్చించవలసిందని నౌరోజీ ఎంపీగా ఉండగా గాంధీజీ రెండు పర్యాయాలు లేఖల ద్వారా కోరారు. గాంధీజీ ఆయనలో తండ్రిని చూశారు. కానీ జాతి ఆయనను ‘గ్రాండ్‌ ఓల్డ్‌మన్‌ ఆఫ్‌ ఇండియా’గా గౌరవించింది. 
∙డా. గోపరాజు నారాయణరావు 
  

మరిన్ని వార్తలు