ఈ పరిస్థితుల్లో పిల్లలు కలుగుతారా?

11 Sep, 2016 00:40 IST|Sakshi
ఈ పరిస్థితుల్లో పిల్లలు కలుగుతారా?

సందేహం
నా వయసు 25 ఏళ్లు. ఎత్తు 5.4 అడుగులు. బరువు 55 కిలోలు. నాకు ఏడాది కిందట పెళ్లయింది. మేనరికం సంబంధం. త్వరలోనే పిల్లలు కావాలనుకుంటున్నాం. అయితే, నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయి. పరీక్షలు జరిపిస్తే ఓవరీస్ ఎన్‌లార్జ్ అయ్యాయని, థైరాయిడ్ సమస్య కూడా ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో పిల్లలు కలుగుతారా? దీనికి తగిన చికిత్స ఉందా?
- శ్రావణి, ఆదోని
 
థైరాయిడ్ సమస్యల వల్ల కొందరిలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం జరుగుతుంది. దానివల్ల అండం సరిగా తయారు కాకపోవడం వల్ల పిల్లలు కలగడానికి ఇబ్బంది కావచ్చు. డాక్టర్‌ని సంప్రదించి థైరాయిడ్ హార్మోన్ మాత్రలు తగిన మోతాదులో క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ హర్మోన్ కంట్రోల్ కావడంతో పాటు ఇతరత్రా హార్మోన్ల ఇబ్బందులు ఏవీ లేనట్లయితే, పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి, కొద్ది కాలంలోనే గర్భందాల్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక ఓవరీస్ ఎన్‌లార్జ్ కావడం అంటే కొందరిలో కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల ఓవరీలో ఉండే కణజాలం పెరగడం అన్న మాట.

దీనినే స్ట్రోమల్ హైపర్ ప్లేసియా అంటారు. మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ కొందరు ఆడవాళ్లలోనూ మోతాదుకు మించి విడుదలైనప్పుడు ఇలాంటి సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వారిలో అవాంఛిత రోమాలు పెరగడం, మొటిమలు ఎక్కువగా రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. హార్మోన్ల మార్పు వల్ల అండం తయారు కాకపోవడం, దానివల్ల గర్భందాల్చలేకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యలకు డాక్టర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం వల్ల పిల్లలు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ బరువు కూడా ఎత్తుకు తగినంతే ఉంది. మరింత బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
 
నేను ఇంటర్ చదువుతున్నాను. ఫిట్‌నెస్ కోసం కొన్నాళ్లుగా స్కిప్పింగ్ చేస్తున్నాను. అయితే, స్కిప్పింగ్ వల్ల బ్రెస్ట్ లూజ్ అయిపోతుందని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. స్కిప్పింగ్ వల్ల బ్రెస్ట్ లూజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయా?
- అను, ఈ-మెయిల్
 
స్కిప్పింగ్ చేయడం వల్ల రొమ్ములు సాగడమేమీ ఉండదు. స్కిప్పింగ్ చేసేటప్పుడు రొమ్ములు ఎక్కువగా కదలడం వల్ల కొందరిలో నొప్పిగా ఉండవచ్చు. రొమ్ములో ఎలాస్టిక్ టిష్యూ ఉంటుంది కాబట్టి, స్కిప్పింగ్ చేసినప్పుడు ఊగినా, తర్వాత సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కాకపోతే స్కిప్పింగ్ చేసేటప్పుడు కరెక్ట్ సైజ్ సపోర్టింగ్ స్పోర్ట్స్ బ్రా వేసుకోవడం మంచిది. దానివల్ల స్కిప్పింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా ఉంటుంది. బరువు తగ్గడానికి, శరీరం నాజూకుగా ఉండటానికి స్కిప్పింగ్ మంచి వ్యాయామం.
 
నా వయసు 16 ఏళ్లు. ఎత్తు 5.4 అడుగులు. బరువు 37 కిలోలు. నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. రెండు నెలలకోసారి వస్తున్నాయి. ఒక్కోసారి రెండు నెలలకు పైన కొన్నిరోజుల ఆలస్యం కూడా అవుతోంది. మొహం మీద మొటిమలు విపరీతంగా వస్తున్నాయి. ఈ సమస్యకు ఏమైనా మందులు ఉన్నాయా?

- విజయ, నెల్లూరు
 
నీ ఎత్తుకు కనీసం 55-60 కిలోల వరకు బరువు ఉండాలి. నువ్వు కేవలం 37 కిలోల బరువే ఉన్నావు. అంటే దాదాపు 20 కిలోల బరువు తక్కువగా ఉన్నావు. బరువు మరీ తక్కువగా ఉండటం, రక్తహీనత, థైరాయిడ్ లోపాలు వంటి కారణాల వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వచ్చే అవకాశాలు ఉంటాయి. పౌష్టికాహార లోపం వల్ల నువ్వు బరువు తక్కువగా ఉండి ఉండవచ్చు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల కూడా రక్తహీనత, బరువు పెరగకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి పరిస్థితిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొందరిలో అండాశయంలో నీటిబుడగలు (పాలీసిస్టిక్ ఓవరీస్) ఉండటం వల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తుంటాయి. హార్మోన్లలో మార్పుల వల్ల అవాంఛిత రోమాలు, మొటిమలు ఎక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

నీ వయసు 16 ఏళ్లు.. ఇలాంటి యుక్తవయసులో కొందరి శరీర తత్వాన్ని బట్టి మొటిమలు ఎక్కువగా రావచ్చు. ఒకసారి గైనకాలజిస్టును కలుసుకుని అవసరమైన రక్తపరీక్షలు, థైరాయిడ్, పాలీసిస్టిక్ ఓవరీస్ పరీక్షలు, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించుకుని, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని చికిత్స తీసుకుంటే మంచిది. ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పులు వంటి పోషకాహారం తీసుకోవడం మంచిది.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు