టాటూ కాదది ఎర్రటి డేంజర్‌ మార్క్‌!

20 May, 2017 23:21 IST|Sakshi
టాటూ కాదది ఎర్రటి డేంజర్‌ మార్క్‌!

ఒంటినే క్యాన్వాసులాగా మార్చి... సృజనాత్మకమైన అనేక రకాల డిజైన్లను ప్రదర్శించే ‘టాటూ’లను వేసుకోవాలని అనుకుంటున్నారా? టాటూను నేటి ట్రెండ్‌గా, ఫ్యాషన్‌గా భావించి దాన్ని వేసుకోవాలన్నది మీ ఉద్దేశమా? అయితే మరోసారి ఆలోచించుకోండి అని హెచ్చరిస్తుంది అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) సంస్థ. మార్కెట్‌లోకి రావాల్సిన అన్ని రకాల మందులకు  ప్రపంచవ్యాప్తంగా దీని ఆమోదం లభించాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సంస్థ చేసే హెచ్చరికలు కాబట్టి దీనికి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.

 ఎఫ్‌డీఏకు చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ కాస్మటిక్స్‌ అండ్‌ కలర్స్‌ విభాగానికి చెందిన డైరెక్టర్‌ డాక్టర్‌ లిండా కేట్జ్‌ మాట్లాడుతూ ‘‘టాటూస్‌ వేసుకున్న వారిలో చాలామంది ఆ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, చర్మ అలర్జీలకు గురవుతున్నారు. ఇలా టాటూ వేయించుకునే చాలా మందికి దాని వల్ల ర్యాష్, చర్మం ఎర్రబారడం, టాటూ వేసిన చోట ఉబ్బుగా మారడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. టాటూ కోసం వాడే కలుషితమైన సూదులు, కంటామినేటెడ్‌ సిరా వంటివి ఇందుకు కారణాలు’’ అని పేర్కొంటున్నారామె. పైగా టాటూలు ఎప్పుడూ సురక్షితం కాదని చెబుతున్నారు.

 ‘‘ఇలా టాటూలు వేయించుకునేవారికి మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. భవిష్యత్తులో వారు ఏదైనా సందర్భంలో ఎమ్మారై చేయించుకోవాల్సి వస్తే... తమకు టాటూ ఉందన్న విషయం డాక్టర్‌కు విధిగా చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రదేశంలో వాపు, మంట వచ్చే అవకాశాలు ఉంటాయి’’ అంటున్నారు డాక్టర్‌ కాట్జ్‌.  ఇందులో వాడే ఇంకు లేదా రంగు పదార్థం వంటివాటిల్లో ఎఫ్‌డీఏ అనుమతి పొందినదంటూ ఏదీ లేదని ఎఫ్‌డీఏకి చెంది నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు