దేశ విభజనని శపించిన రాజర్షి

19 May, 2019 00:31 IST|Sakshi

ధ్రువతారలు

‘దుర్బలతే, నిస్పృహే ఇక మీకు దిక్కని ఈ తీర్మానం చెబుతోంది. ముస్లింలీగ్‌ ప్రదర్శించిన భీతావహ వ్యూహాలకి నెహ్రూ ప్రభుత్వం మోకరిల్లింది. దేశ విభజనకు అంగీకరించడమంటే దగా చేయడమే, లొంగిపోవడమే. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుకోవాలన్న ఆ కలను త్యాగం చేయడం కంటే, బ్రిటిష్‌ పరిపాలనలోనే మనం ఇంకొంత కాలం కడగండ్లు పడడం ఉత్తమం. భవిష్యత్తులో సింహాల్లా పోరాడేందుకు సిద్ధమవుదాం.  బ్రిటిష్‌ వారితో పాటు ముస్లింలీగ్‌తో కూడా పోరాడి, దేశ సమగ్రతకు రక్షణ కవచాల్లా నిలబడదాం! ఈ విభజన  ఏ వర్గానికి మేలు చేసేది మాత్రం కాదు. పాకిస్తాన్‌లోని హిందువులు గానీ, భారత్‌లోని ముస్లింలు గాని భయం భయంగానే బతకవలసి ఉంటుంది.’ జూన్‌ 14/15, 1947న ఢిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రత్యేక సమావేశాలలో ఒక గళం నుంచి అనంతమైన బాధతో, క్షోభతో, ఆవేశంతో వెలువడిన మాటలివి. ఆ జూన్‌ 3నే భారతదేశాన్ని భారత్, పాకిస్తాన్‌ దేశాలుగా విభజిస్తూ, ఇంకొక పక్క స్వదేశీ సంస్థానాలకు స్వేచ్ఛనిస్తూ ఆఖరి ఆంగ్ల వైస్రాయ్‌ మౌంట్‌బాటన్‌ ప్రణాళికను ప్రకటించాడు.  దీనికి జాతీయ కాంగ్రెస్‌ తరఫున నెహ్రూ, సర్దార్‌ పటేల్, జెబి కృపలానీ (నాటి జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు) ఆమోదం తెలిపి వచ్చారు. ఆ ఆగస్టు 15కే స్వాతంత్య్రం ఇస్తున్నట్టు మౌంట్‌బాటన్‌ చెప్పడం విజ్ఞతతో కూడినదని నెహ్రూ వ్యాఖ్యానించారు కూడా. ఇంతటి కీలక సమావేశంలో పాల్గొనే బృందంలో గాంధీజీకి జాతీయ కాంగ్రెస్‌ చోటు కల్పించలేదు. ఇదొక గొప్ప చారిత్రక వైచిత్రి.  మౌంట్‌బాటన్‌ విభజన ప్రణాళికను ఆమోదిస్తున్నట్టు తీర్మానం చేయడానికే జాతీయ కాంగ్రెస్‌ ఆ రెండు రోజుల సమావేశాలను ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రోద్యమంలో అగ్రభాగాన నిలిచిన పార్టీ పెద్దలకు కూడా విభజన ప్రణాళిక గురించి సరైన సమాచారం లేదని అర్థమవుతుంది. అలాంటి కీలక సమావేశంలో పురుషోత్తమదాస్‌ టాండన్‌ పలికిన ఆ మాటలే అవి. 

సమావేశంలో పాల్గొన్న  సభ్యులలో అత్యధికులు కరతాళ ధ్వనులతో టాండన్‌ వాదనకు సంఘీభావం తెలియచేశారు. సిం«ద్‌కు చెందిన చోతరామ్‌ గిద్వానీ కూడా ఇంతే ఉద్విగ్నంగా మాట్లాడుతూ విభజన  గురించి తీవ్ర స్థాయిలో నెహ్రూ, పటేల్‌ల నిర్ణయాన్ని  విమర్శించారు. టాండన్‌ ఆవేదన ఒకరకమైనది. గిద్వానీ వాదన అస్తిత్వానికి సంబంధించినది. ఆయన స్వస్థలం సిం«ద్‌ పాకిస్తాన్‌లో అంతర్భాగం కాబోతోంది.  గాంధీ, నెహ్రూ, పటేల్, అబుల్‌ కలాం ఆజాద్, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్, రామ్‌మనోహర్‌ లోహియా, జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి ఎందరో చరిత్ర పురుషులు ఆ రెండు రోజుల సమావేశాలలో పాల్గొన్నారు. అధ్యక్షస్థానంలో జెబి డీలా పడిన వానిలా కూర్చుని ఉన్నారు. దేశ విభజనకు ఆనాడు ఎక్కువమంది వ్యతిరేకమన్నది చారిత్రక సత్యం. కేవలం జాతీయ కాంగ్రెస్‌ నాయకులే కాదు, కొందరు ముస్లింలు కూడా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు.  విభజన ప్రణాళిక గురించి తనకు తెలియదనే గాంధీజీ చెప్పారు. మేం ఆయనకి చెప్పాం అన్నారు నెహ్రూ, పటేల్‌. మీరు చెప్పలేదని రెట్టించారు జాతిపిత. మీరు నౌఖాలీలో ఉండిపోతే విషయాలు ఎలా తెలుస్తాయి అన్నారు చివరికి నెహ్రూ. జయప్రకాశ్‌ నారాయణ్, లోహియా, అబ్దుల్‌ గఫూర్‌ఖాన్, అబుల్‌ కలాం– అంతా ఇలా జరగపోతే బాగుండేది అనే రీతిలోనే మాట్లాడారు. అంటే దేశాన్ని ముక్కలు చేయడం దారుణమనే. ఇన్ని గుండెల  క్షోభ టాండన్‌ గొంతులోనే పలికిందంటే అతిశయోక్తి కాదు.  \ పురుషోత్తమదాస్‌ టాండన్‌ (ఆగస్టు 1, 1882–జూలై 1, 1961) అలహాబాద్‌లో జన్మించారు. ప్రాథమిక విద్య ఇంటిలోనే సాగింది. ఆ పట్టణంలోనే ముయిర్‌ సెంట్రల్‌ కళాశాలలో పట్టభద్రులయ్యారు. ఆ కళాశాలలోనే న్యాయశాస్త్రం చదివారు. చరిత్ర అంశంతో ఎంఎ చేశారు. పురుషోత్తమదాస్‌కు స్వాతంత్య్రోద్యమ కాలం నాటి రాజకీయాలలోనే ‘రాజర్షి’ అన్న గౌరవం ఉండేది. మొదట గాంధీజీయే ఆయనను అలా సగౌరవంగా సంబోధించేవారు. 1960లో ప్రజలే ఆయనను సత్కరించి అదే బిరుదు ఇచ్చారు. 

టాండన్‌ అవిశ్రాంత దేశ సేవకుడు. స్వాతంత్య్ర పోరాట యోధుడు. పత్రికా రచయిత. హిందీని రాజభాషను చేయాలన్న ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. నెహ్రూతో, ఆయన సిద్ధాంతాలతో, భారతదేశంలో అమలవుతున్న లౌకికవాదం మీద ఆయనకు పేచీలు ఉన్నాయి. అయినప్పటికి  1961లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.   టాండన్‌ 1899లోనే భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. వందేమాతరం ఉద్యమం సమయానికి  సంస్థలో ఒక స్థాయి గుర్తింపు తెచ్చుకోగలిగారు. 1906 నాటికే ఆయన జాతీయ కాంగ్రెస్‌ కార్యవర్గంలో అలహాబాద్‌ ప్రతినిధిగా స్థానం పొందారు. అప్పటికి జవహర్‌లాల్‌ నెహ్రూ రాజకీయాలలోకి రాలేదు. కానీ మోతీలాల్‌ వంటి ఉద్దండుడు అలహాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న జాతీయోద్యమంలో కీలకంగా ఉన్న కాలమది.  1906లోనే టాండన్‌ అలహాబాద్‌లో తేజ్‌బహదూర్‌ సప్రూ వద్ద సహాయకునిగా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. స్రపూ సయితం స్వాతంత్య్రం సమరయోధుడే. అసాధారణ న్యాయనిపుణుడు. జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం మీద వాస్తవాలను తెలుసుకోవడానికి జాతీయ కాంగ్రెస్‌ నియమించిన సంఘంలో కూడా టాండన్‌కు చోటు దక్కింది. గాంధీజీ పిలుపు మేరకు టాండన్‌ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని 1921లో కారాగారానికి వెళ్లారు. 1931 నాటి కరాచీ సమావేశాలలో టాండన్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. 1932 నుంచి ఆయన కిసాన్‌ సభ ఆధ్వర్యంలో రైతాంగ ఉద్యమాలలో కూడా చురుకుగా పనిచేశారు. మొత్తం ఏడు పర్యాయాలు ఆయన కారాగార శిక్ష అనుభవించారు.

1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మన చట్ట సభలకు ఎన్నికలు జరిగాయి. యునైటెడ్‌ ప్రావిన్స్‌ (నేటి ఉత్తరప్రదేశ్‌) లెజిస్టేటివ్‌ అసెంబ్లీకి టాండన్‌ ఎంపికయ్యారు. 1948 వరకు అసెంబ్లీ సభ్యునిగా ఉన్నారు. ఆ 13 సంవత్సరాలు కూడా సభాపతిగా పనిచేసి విశేషమైన సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. అప్పటికే విఠల్‌భాయ్‌ పటేల్‌ (సెంట్రల్‌ లెఙస్లేటివ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. సర్దార్‌ పటేల్‌ సోదరుడు) వంటివారు స్పీకర్‌ స్థానానికి ఉండవలసిన విధివిధానాలను తమ వ్యవహార సరళి ద్వారా నిర్దేశించారు. అందులో స్పీకర్‌ పార్టీ సమావేశాలకు వెళ్లరాదనేది ఒకటి. కానీ టాండన్‌ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలకు హాజరయ్యేవారు. పార్టీ సమావేశంలో ప్రస్తావించినదే సభలో కూడా చర్చించవలసి వచ్చినప్పుడు, టాండన్‌ సభ్యులను ఉద్దేశించి, మీలో ఏ ఒక్క సభ్యునికి అభ్యంతరం ఉన్నా, నేను ఈ స్థానం విడిచి వెళతాను అని ప్రకటించేవారు. కానీ ఏ ఒక్క సభ్యుడు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆయన అరెస్టయినప్పటికీ అనారోగ్య కారణాలతో విడుదల చేశారు. ఆయన బయటకు వచ్చి, నిషేధంలో ఉన్న కాంగ్రెస్‌ను మళ్లీ సంఘటితం చేయడానికి కృషి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా టాండన్‌ చిరకాలం నిర్మాణాత్మకమైన పాత్రను నిర్వహించారు. 1946 నాటి రాజ్యంగ పరిషత్‌కు ఆయన ఎన్నికయ్యారు. 1952లో తొలి లోక్‌సభలో కూడా ఆయన అడుగుపెట్టారు. 1956లో పెద్దల సభకు వెళ్లారు. 1950లో కాంగ్రెస్‌ చరిత్రలో చెప్పుకోదగిన ఘట్టం జరిగింది.  టాండన్‌∙జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ఆ సంవత్సరం నాగపూర్‌లో సంస్థ సమావేశాలు జరిగాయి. జెబి కృపలానీ మీద పోటీ చేసి టాండన్‌ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. కృపలానీకి నెహ్రూ మద్దతు, టాండన్‌కు పటేల్‌ మద్దతు ఉన్నట్టు చెబుతారు. కానీ భారత పార్లమెంట్‌ తొలి ఎన్నికల సమయంలో, అంటే 1952లో ఆ పదవికి టాండన్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. కారణం, నెహ్రూ విభేదాలు. ఈ విభేదాల ప్రభావం ప్రభుత్వ పని తీరు మీద గాఢంగానే పడింది. అప్పటి నుంచే కాంగ్రెస్‌లో ప్రభుత్వాధినేత, పార్టీ అధినేత ఒక్కరే ఉండే అలిఖిత నియమం ప్రవేశించిందన్న మాట కూడా ఉంది.
నాటి రాజకీయవేత్తలలో చాలామంది మాదిరిగానే టాండన్‌ రాజకీయాలకే పరిమితమైపోకుండా వివిధ క్షేత్రాలకు సేవలు అందించారు. సర్వెంట్స్‌ ఆఫ్‌ ది పీపుల్స్‌ సొసైటీలో ఆయన సభ్యుడు. హిందీ సాహిత్య సమ్మేళన్‌లో కీలకంగా ఉండేవారు. రాష్ట్ర భాషా ప్రచార సమితికి కూడా సేవలందించారు. వీటికి తోడు ‘అభ్యుదయ’ అనే హిందీ పత్రికకు సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 
టాండన్‌ మతం పట్ల గట్టి విశ్వాసం కలిగి ఉండేవారు. ఆయన రాధా సత్సంగ్‌ అనే చిన్న మత విశ్వాస వర్గానికి చెందినవారాయన. కానీ భారతదేశంలో హిందూ ముస్లిం ఆవశ్యకతను కూడా ఆయన గ్రహించారు. అలాగే బడుగు వర్గాలను సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని దృఢంగా ఆకాంక్షించారు. లక్నోలో జరిగిన 49వ జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో సంస్థ అన్ని వర్గాల దగ్గరకు వెళ్లవలసిన అవసరం గురించి చెప్పారు. 

టాండన్‌ అభిప్రాయాలను, నిర్భీకతను నాటి కాంగ్రెస్‌లో నెహ్రూ అనుకూలురు ఆయన మీద వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకున్నారని అనిపిస్తుంది. టాండన్‌ మదన్‌మోహన మాలవీయ, లాలా లజపతిరాయ్‌ల అభిప్రాయాలకు చాలా దగ్గరవాడని ఒకప్రచారం ఉండేది. అలాగే ఆయన హిందుస్తానీని కాకుండా హిందీనే జాతీయ భాషగా ప్రవేశపెట్టాలని రాజ్యాంగ పరిషత్‌లో వాదించినప్పుడు కూడా ద్రవిడ పార్టీల నుంచి, కొందరు ఇంతరుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.   గాంధీ అభిప్రాయాలను మనసావాచా గౌరవించారు టాండన్‌. అహింసా సిద్ధాంతాన్ని ఎంతగానో మన్నించారు. పశువుల చర్మంతో కుట్టిన పాదరక్షలను వదిలి, రబ్బరు చెప్పులు వేసుకునేవారు. ఆయన పార్లమెంట్‌ సభ్యుడైన తరువాత ఒక సంఘటన జరిగింది.  ఆ రోజుల్లో పార్లమెంట్‌ సభ్యుని వేతనం నెలకు నాలుగు వందల రూపాయలు. ఒకసారి టాండన్‌ తన జీతం చెక్కు పని మీద పార్లమెంటు కార్యాలయానికి వెళ్లారు. ఇకపై తన వేతనం మొత్తం నాలుగు వందల రూపాయలు కూడా పబ్లిక్‌ సర్వీస్‌ ఫండ్‌కు బదలీ చేయవలసిందని అక్కడి ఉద్యోగిని కోరారు. ఇది విన్న మరొక పార్లమెంటు సభ్యుడు టాండన్‌ను అడిగాడు. ‘మీకు ఇచ్చేదే కేవలం నాలుగు వందలు. ఈ భత్యం మొత్తం నెలకు సంబంధించినది. కానీ మీరు మొత్తం డబ్బును ప్రజా సేవకు ఇచ్చేస్తున్నారు, ఎందుకు?’  అన్నాడతడు. అందుకు టాండన్‌ సమాధానం ఇది– ‘నాకు ఏడుగురు కొడుకులు. అంతా చాలినంత సంపాదించుకుంటూ కుటుంబాలని పోషించుకుంటున్నారు. నెల తిరిగేసరికి ఒక్కొక్క అబ్బాయి వంద రూపాయల వంతును పంపుతారు. ఆ ఏడు వందల రూపాయలలో నేను మూడు లేదా నాలుగు వందలు ఖర్చు చేస్తాను. ఆ మిగిలిన మొత్తం కూడా ఏదో ఒక సంస్థకు ఇస్తాను. నాకు ఎక్కువైనప్పుడు అది ఇంకొకరికి ఉపయోగపడాలి.’భారత స్వరాజ్య సమరంలో కొందరు మహానుభావులను చూస్తుంటే, వారి నిబద్ధతను, అందులో భాగంగా వారు ఎంచుకున్న జీవన విధానాన్ని చూస్తే గాంధీ అంతేవాసిత్వంలోని దివ్యత్వాన్ని మించిన దివ్యత్వం వారిలో దర్శనమిస్తుంది.  గాంధీ సిద్ధాంతంలో ఒదగడానికి  వీలుగా అలాంటి వారంతా ఆ మించిన దివ్యత్వాన్ని తమకు తాము తగ్గించుకున్నారని కూడా అనిపిస్తుంది. అలాంటివారిలో పురుషోత్తమదాస్‌ టాండన్‌ ఒకరు.  
- ∙డా. గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు