కథ: చినిగిన చిత్తరువు

6 Jul, 2014 01:48 IST|Sakshi
కథ: చినిగిన చిత్తరువు

గత ఏడు నెలలుగా ప్రతి నెలా మొదటి శనివారం ప్లీ మార్కెట్టుకి వెళ్లడమే నా పని. రాబర్టుకి నేను ఉదయమే వెళ్లిపోవడం అస్సలు ఇష్టం ఉండదు. నిన్న రాత్రి నేను పడుకోబోయే ముందు చెప్పడానికి వెళ్లాను. నన్ను చూడగానే కంప్యూటర్లో ఒక బొమ్మ చూపించాడు. డెబ్భయ్యేళ్ల ముసలామె ఫొటో అది. అక్కడక్కడ నా పోలికలు కనిపిస్తున్నాయి. నలభయ్యేళ్ల తరువాత నేనిలా ఉంటానని చెప్పాడు, నేను ఎవరని అడిగినప్పుడు. రాబర్ట్ పెద్ద సాఫ్ట్‌వేర్ గీక్. ఇరవై నాలుగ్గంటలూ కంప్యూటరే అతని లోకం. ఫొటోలో ముఖ కవళికల్ని బట్టి వయసు నిర్ధారించవచ్చనీ, అలాగే వయసు మీద పడ్డాక, నా మొహంలో మార్పు కూడా ఈ సాఫ్ట్‌వేర్ చెబుతుందనీ అన్నాడు. ఇలాంటివి చాలా చూపిస్తూ ఉంటాడు. నేను ఇవేమీ పట్టించుకోను. నాకు కొన్ని అర్థం కావు కూడా. ఎప్పటిలాగే తిట్టుకుంటూ తల పట్టుకున్నాడు. కానీ నేను వెళ్లి తీరాలి. లేకపోతే నెలనెలా మనశ్శాంతి ఉండదు.
 
 నేను ఇలా ప్రతి నెలా ఠంచనుగా వెళ్లడానిక్కారణం ఉంది. మా అమ్మ శాండియేగోలో ఉండేది. మా అమ్మకి నేనొక్కత్తినే కూతుర్ని. పది నెలల క్రితం మా అమ్మ పోయింది. ఆవిడ పోయాక, వారసురాలిగా కొంత ఆస్తి నాకొచ్చింది. శాండియేగోలో ఇల్లు అమ్మేసి డబ్బు చేసుకున్నాను. కాలేజీ చదువుకి నేను చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. అవన్నీ ఇల్లమ్మితే వచ్చిన డబ్బుతో కట్టేశాను. ఒక్కతే ఉన్నా అమ్మ ఇంటి నిండా సామాన్లే. దానికితోడు అమ్మకి పెయింటింగ్ పిచ్చి. పోయేవరకూ ఆవిడకి అదే కాలక్షేపం. అమ్మ పోయాక, ఆవిడ దగ్గరున్న నలభైకి పైగా మంచి పెయింటింగులు నాతో తెచ్చుకున్నాను. చాలావరకూ బాక్సుల్లో పెట్టి గరాజ్ మొత్తం నింపేశాను. ప్రతి నెలా అమ్మ దాచుకున్న కొన్ని వస్తువులు, పెయింటింగులు ప్లీ మార్కెట్లో అమ్మడానికి వెళతాను. మొదట్లో ఈ సలహా ఇచ్చింది రాబర్టే! గరాజ్ అంతా సామాన్లతో నిండిపోయి, రెండు కార్లూ పార్క్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది. దానికితోడు పిల్లల ఆటబొమ్మలు ఇల్లంతా ఉన్నాయి. గరాజ్ సేల్ పెడదామని మొదట్లో అనుకున్నాను. కానీ రాబర్టే ప్లీ మార్కెట్లో పెడితే అమ్మ పెయింటింగులు అమ్ముడుపోతాయని అన్నాడు. ఇంతకుముందు రాబర్ట్ శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లి గ్యాలరీల వాళ్లని అడిగి చూశాడు. ఎవరూ అంత ఉత్సాహం చూపించలేదు. అమ్మ పెయింటింగ్స్ అత్యద్భుత కళాఖండాలు కాకపోయినా, ఇంట్లో గోడలకి తగిలించుకోవచ్చు. నా చిన్నప్పుడు కొన్ని పెయింటింగ్ ప్రదర్శనలు కూడా నిర్వహించడం నాకింకా గుర్తుంది.
 
 కుపర్టినో డీ యాంజా కాలేజీ ఆవరణలో ప్రతి నెలా మొదటి శనివారం ప్లీ మార్కెట్ పెడతారు. అందులో మనం స్టాల్ పెట్టాలంటే కొంత ఫీజు కట్టాలి. చుట్టుపక్కల ఊళ్ల నుండి అనేకమంది వచ్చి రకరకాల వస్తువులు అమ్ముతారు. కొన్ని కొత్తవి, మరికొన్ని పాతవి. బేరం చేయవచ్చు కూడా. నాకూ గరాజ్ సేల్ కంటే ఇదే బెటరనిపించింది. మొదటిసారి చాలా బీరువా బొమ్మలు అమ్ముడయ్యాయి. కానీ ఒక్క పెయింటింగూ అమ్మకానికి పోలేదు. అక్కడికీ ఒక్కోటి రెండు వందల డాలర్లు పెట్టాను. అసలు బొమ్మ కంటే ఫ్రేములే ఎక్కువ ఖరీదు చేస్తాయి.
 
 రెండో విడత నెలలో నా స్టాలు దగ్గరికి ఒక గడ్డం వ్యక్తి వచ్చాడు. ఎర్రటి రాగి జుట్టు, మాసిన బట్టలతో చూడ్డానికి బికారిలా అనిపించాడు. ఆ పెయింటింగులన్నీ ఎంతో తీక్షణంగా చాలాసేపు పరిశీలించి చూశాడతను. కొంతసేపయ్యాక, అందులో ఒక రెడ్ ఇండియన్ బొమ్మ ఉన్న పెయింటింగ్ అమ్ముతావా అని అడిగాడు. నేను దాని ఖరీదెంతో చిన్న కాగితమ్మీద రాసి పెట్టి తగిలించాను. అయినా చెబుదామని అనుకుంటుండగానే జేబులోంచి ఇరవై డాలర్లు చేతిలో పెట్టాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. అది రెండు వందలకి తక్కువగా అమ్మలేనని చెప్పాను. చాలాసేపు బతిమాలాడు. కుదరదని గట్టిగా చెప్పడంతో నాకేసి గుర్రుగా చూస్తూ వెళ్లిపోయాడు.
 
 మళ్లా తర్వాతి నెల ఇదే భాగోతం. ఈసారి మరో పది డాలర్లు పెంచి ముప్పైకి అమ్మమన్నాడు. కుదరదని చెప్పి వేరే కస్టమర్ల వైపు దృష్టి మళ్లించాను. కొంతసేపు ఆ పెయింటింగ్‌కేసి చూసి చూసి వెళ్లిపోయాడు. చూడ్డానికి అతను బీదవాడిలా అనిపించాడు. అతని వాలకం చూస్తే, అలాగే ఉన్నాడు మరి. ఈసారీ అతన్ని పట్టించుకోకపోవడంతో గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. ఇంటికెళ్లాక, రాబర్టుతో చెప్పాను. ‘అమ్మలేకపోయావా?’ అన్నాడు. అమ్మ ఎంతో ఆప్యాయంగా దాచుకున్నవి, మరీ అంత చౌకగా అమ్మలేనని చెప్పాను. ‘‘మీ అమ్మ గుర్తుగా ఉంచుకో; కాదనను. కానీ వాటి నుండి లాభం ఆశిస్తున్నావెందుకు? మీ అమ్మ నుండి నీకూ అప్పనంగా వచ్చినవే కదా?’’ అన్నాడు. చూస్తూ చూస్తూ అంత మంచి పెయింటింగు మరీ ముప్పై డాలర్లకి అమ్మలేనని చెప్పాను. వచ్చే నెల నాతో రమ్మనమని చెప్పాను. మొదట్లో రానన్నాడు. కానీ ఆ గడ్డం వ్యక్తి గురించి చెప్పాక, సరేనన్నాడు.
 తరువాత నెలలో ప్లీ మార్కెట్టుకి ఎప్పటిలాగే ఆ గడ్డం వ్యక్తి వచ్చాడు. ఈసారి మరో పది డాలర్లు పెంచి నలభయ్యన్నాడు. నేను అతన్ని చూశాను కానీ పట్టించుకోలేదు. రాబర్టే అతనికి జవాబు చెప్పాడు. గత మూడుసార్లుగా వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావని చెబుతూ, అతనికి అమ్మనని కరాకండిగా చెప్పేశాడు. ఈసారి వస్తే పోలీసు కంప్లయింట్ ఇస్తానని బెదిరించాడు. రాబర్టుకేసి కొరకొరా చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతని రూపం చూస్తే స్ట్రీట్ బెగ్గర్లా ఉన్నాడని అన్నాడు. ఈ నెల ఒక్క పెయింటింగూ అమ్ముడు పోలేదు. వచ్చే నెల నుండి ఇహ రాకూడదని నిశ్చయించుకున్నాను. రోజంతా ఈ ప్లీ మార్కెట్ పనే తినేస్తోంది.
 
 ఓ రెండు వారాల తర్వాత రాబర్టు కొలీగ్ మేనల్లుడు ఒకతను శాన్ ఫ్రాన్సిస్కో ఆర్ట్ గ్యాలరీలో పనిచేస్తాడనీ, అతణ్ని  ఇంటికి తీసుకొస్తాననీ చెప్పాడు. అతన్ని వెంటబెట్టుకుని ఓ రోజు వచ్చి అన్ని పెయింటింగులూ చూపించాడు. అన్నీ చాలా బావున్నాయి కానీ పాతబడిపోయాయని పెదవి విరిచాడు. వచ్చే నెల శాంతా క్లారాలో పురాతన వస్తు ప్రదర్శనలో పెట్టమని చెప్పాడు. దానికి తన దగ్గర రెండు ఫ్రీ పాసులున్నాయని చెప్పాడు. అక్కడ వీటికి వెల కట్టవచ్చని, అక్కడికి వచ్చినవాళ్లలో ఎవరైనా కొనే అవకాశం ఉంటుందని చెప్పాడు. లేదంటే క్రైగ్స్ లిస్టు వెబ్‌సైటులో పెట్టమని సలహా ఇచ్చాడు. ఓ రెండు వారాల తర్వాత మాకు యాంటీక్ షో పాసులు పట్టుకొచ్చి ఇచ్చాడు.
 
 ప్రతి ఊళ్లోనూ ఏడాదికి రెండుసార్లు ఈ యాంటిక్ షో పెడతారని తరువాత తెల్సింది. మన దగ్గరవున్న అరుదైన పురాతన వస్తువులుంటే వాటికి వెల కడతారు. ఒక్కోసారి మనం పనికిరానివనుకున్న వస్తువులు వేలకొద్దీ అమ్ముడుపోయే అవకాశం ఉంది. పురాతన వస్తువుల అమ్మకం అమెరికాలో చాలా పెద్ద వ్యాపారం అని మెల్లగా అర్థమైంది. ఈ యాంటీక్ షోకి చచ్చేటంతమంది జనం వచ్చారు. వచ్చినవాళ్లలో సగం జనాభా నాలాంటి వాళ్లేననిపించింది. మాకు మధ్యాహ్నం మూడింటికి సమయం కేటాయించారు. అంతవరకూ ఒక గోడకి ఆనించి మూలగా ఒకవైపు పెట్టాను. వచ్చిపోయేవాళ్లు కొంతమంది వచ్చి చూసిపోతున్నారు. మా వంతు వచ్చింది. మమ్మల్ని పిలవగానే అక్కడికి వెళ్లాం. ఒకతను వచ్చి పెయింటింగులన్నీ చూశాడు. మేం పట్టుకెళ్లినవాటిలో మూడొంతులు పైగా ఆరువందలకి మించి వెల కట్టలేనని చెప్పాడు.
 
 చివర్లో వెళుతూ అక్కడ వెనక్కి తిప్పబడున్న మరో పెయింటింగ్ తిప్పి చూశాడు. కొంతసేపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఈ పెయింటింగ్ ఎక్కడిదని తేరిపార చూస్తూ అన్నాడు. మా అమ్మ ఆర్టిస్ట్ అనీ, ఇవన్నీ ఆవిడ సేకరించుకున్న చిత్రాలనీ చెప్పాను. అతను ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘ఇది చాలా అరుదైన పెయింటింగ్. దీని విలువ కనీసం వంద వేల డాలర్లుండొచ్చు’’ అన్నాడు. రాబర్టుకి, నాకు నోట మాట రాలేదు. ఈ చిత్రం విశేషం తెలుసాని అడిగాడు. చెప్పొద్దూ, నాకు చిన్నప్పట్నుండీ ఈ చిత్రకళ మీద అస్సలు ఇష్టం లేదు. అమ్మ ప్రయత్నించింది కానీ, నాకు అబ్బలేదు. బలవంతపు ప్రోత్సాహం వలన కళలు అబ్బవని అమ్మ చాలా ఆలస్యంగా గ్రహించింది. నేనూ ఆ చిత్రం కేసి మరోసారి పరిశీలనగా చూశాను. కొట్టొచ్చినట్లు రంగులు కనిపిస్తూ ఒక రెడ్ ఇండియన్ చిత్రం. ఆ రెడ్ ఇండియన్ చేతిలో ఒక పెద్ద దండం ఉంది. రంగు రంగుల పక్షి ఈకల కిరీటమూ, అటవిక దుస్తులు ధరించి ఉన్నాడు. రంగులతో ప్రత్యేకంగా కనిపిస్తోంది కానీ అంతకుమించి నాకేం కనిపించలేదు. అదే ఆ మదింపు వేసే వ్యక్తితో అన్నాను.
 
 ‘‘ఈ చిత్రంలో గొప్పదనం ముందున్న రెడ్ ఇండియన్‌ది కాదు. వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండుది. పరిశీలనగా చూడండి. అది ఒక ఆవర్జా చిట్టా బ్యాక్‌గ్రౌండులో వేశారు. ఈ చిత్రం వేసింది బలూయీ అన్న చిత్రకారుడు. ఇది సుమారు అరవయ్యేళ్ల నాటి అరుదైన చిత్రం. ఇదొక్కటే కాదు దీని వెనుకాల చరిత్ర చాలా ఉంది’’ అని అన్నాడు. నేను, రాబర్ట్ దాని వెల ఊహకందనంతగా ఉండటం అన్న ఆశ్చర్యంలోనే ఇంకా మునిగి ఉన్నాం. అతని మాటలు అంతగా మా బుర్రకెక్కలేదు. మరలా అతనే చెప్పుకొచ్చాడు.
 
 ‘‘పద్దెనిమిది వందల డెబ్భై, ఎనభై ప్రాంతాల్లో సైంట్ అగస్టీన్, ఫ్ల్లారిడా పరిసరాల దగ్గర తెల్లవాళ్లకి, రెడ్ ఇండియన్ జాతులు కియోవా, చెయన్నే, కమాడో, చెరోకీ వారికీ మధ్య యుద్ధం జరిగింది. దీన్నే రెడ్ రివర్ యుద్ధం అంటారు. ఈ ఇండియన్ తెగలకి ప్రత్యేక ప్రతిపత్తికి వ్యతిరేకంగా తెల్లవాళ్లు చాలాకాలం యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చాలామంది రెడ్ ఇండియన్ తెగలవాళ్లు బందీలయ్యారు. సరిగ్గా ఆ సమయంలో కల్నర్ రిచర్డ్ ప్రాట్ అనే అధికారి ఈ బందీలైన రెడ్ ఇండియన్లని అమెరికన్ జీవన స్రవంతిలో భాగం చేయాలన్న ఉద్దేశ్యంతో, వెస్ట్రన్ అమెరికన్ కల్చరు గురించి వారికి అవగాహన ఏర్పరిచే నెపంతో చిత్రకళని ప్రోత్సహించాడు. వాళ్లకి రంగు రంగుల పెన్సిళ్లు, రంగులు అందించాడు. ఈ రెడ్ ఇండియన్స్‌నే నేటివ్ అమెరికన్స్ అని అంటారని తెలుసు కదా! ఆ బందీలు తమ సంస్కృతినీ, అప్పటి యుద్ధం తాలూకు అణచివేతనీ బొమ్మల రూపంలో వేసి ఈ అవకాశాన్ని వాడుకున్నారు. చూస్తూండగా కాగితం కొరత ఏర్పడింది. కాగితం దొరక్కపోయేసరికి వాళ్లు దుకాణాల్లో పాతబడిన ఆవర్జా చిట్టా కాగితాల మీద బొమ్మలేసేవారు.
 
 దీన్నే లెడ్జర్ పెయింటింగ్ అంటారు. చాలామంది ఈ చిత్రాలని ఒక జాతి సాంస్కృతిక విధ్వంసానికి ప్రతీకలుగా పరిగణిస్తారు. పాల్ కరిల్, వోహా, హౌలింగ్ లాంటి ఎంతోమంది ఆర్టిస్టులు అద్భుత కళాఖండాలు చిత్రీకరించారు. మీ దగ్గరున్న చిత్రం ఆ లెడ్జర్ పెయింటింగ్ ఆధారంగా 1930-40 ప్రాంతాల్లో వేసిన చిత్రం. మీ అమ్మగారు చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. ఇది చాలా అరుదైన పెయింటింగ్. మరికొంతమంది ఎక్‌స్పర్టులకి చూపించి కచ్చితమైన విలువ, కాలము అంచనా వేయొచ్చు. ఒకటైతే చెప్పగలను, ఇది మాత్రం బలొయీ సంతకం. ఇతను ఆ కాలం వాడే! 1940 ప్రాంతాల్లో పోయాడు’’ అంటూ వివరం చెప్పాడు. నాకు, రాబర్టుకి నోట మాట రాలేదు. కళ్లప్పగించి వింటున్నాం. నాకైతే ఒక్కసారి ప్లీ మార్కెట్లో బికారతను గుర్తుకొచ్చాడు. బహుశా వాడు బలొయీ సంతకం గుర్తుపట్టుండవచ్చు. అందుకే రెండు మూడుసార్లు మరలా మరలా వచ్చాడు.
 
 ఆ షోలో చిత్రం వెలకట్టినతను మాచేత చాలా కాయితాలు పూర్తిచేయించాడు. తనకి తెలిసున్న కొంతమందికి ఈ చిత్రం గురించి చెబుతానని చెప్పాడు. మాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఇంటికొస్తూ దారి పొడుగునా దీని గురించే చర్చ. ఆ బికారతనికి రాబర్టు పోరు పడలేక నేను అమ్మేసుంటే ఎంత నష్టపోయుండేవాళ్లమో కదా అనుకున్నాను.
 
 ఆ మర్నాడు ఒక పెయింటింగ్ గ్యాలరీ ఏజెంట్ శాన్‌ఫ్రాన్సిస్కో నుండి కాల్ చేశాడు, పెయింటింగ్ చూడ్డానికి వస్తానని. వచ్చి చూసి అతను వంద వేల డాలర్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇది బలొయీ ఒరిజినల్ పెయింటింగ్ అని అతనితో వచ్చిన మరో వ్యక్తి నిర్ధారణ చేశాడు. రేపు శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి డీల్ సైన్ చేయాలని అన్నాడు. మా ఆనందానికి అవధుల్లేవు. వాళ్లు వెళ్లాక, బలొయీ గురించి రాబర్ట్ ఇంటర్నెట్‌లో వివరాల కోసం వెతికాడు. చాలా వివరాలే సంపాదించాడు. అతను 1945లో పోయాడనీ, అతను వేసిన బొమ్మలు చాలా మ్యూజియాల్లో ఉన్నాయనీ తెలిసింది. అతని ఫొటో కూడా ఒక చోట దొరికిందతనికి. బలొయీ నలభయ్యేళ్ల వయసులో ఉండగా ఉన్న చిత్రం. అదీ ఒకతను వేసిన పెయింటింగ్.  కొంతసేపయ్యాక నన్ను గట్టిగా పిలిచాడు. ఏమయ్యిందాని పరిగెడుతూ అతని దగ్గరికొచ్చాను.
 
 ‘‘నేను ఆ బలొయీ ఫొటోకి మనం చూసిన బికారతని గెడ్డం పెట్టి ఏజ్ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్‌లో రకరకాలుగా ప్రయత్నించా. ఈ ఫొటో చూడు. అచ్చం మనం ప్లీ మార్కెట్‌లో కలిసినతనిలాగే లేడూ?’’
 పరిశీలనగా చూస్తే అచ్చం అలాగే ఉన్నాడు. అంటే ఆ చిత్రాలు కొంటానన్న వ్యక్తి ఈ బలొయీ బంధువా?
 ‘‘రాబర్ట్! ఈ ఫొటోలో ఉన్న ఇతని వయసెంత ఉండచ్చు?’’ అని అడిగాను. కొంత లెక్కలు కట్టి అరవై దాటుండచ్చని అన్నాడు. అయితే మనం చూసినతను బలొయీ కొడుకయ్యుండచ్చని నిర్ధారణకొచ్చాం. ఇది మా ఊహ మాత్రమే!
 ‘‘నాకైతే అతనికి, బలొయీకి పోలికలు స్పష్టంగా కనిపించాయి. అందుకే అతను పదే పదే ఆ ఒక్క చిత్రం కోసమే మూడు సార్లొచ్చాడు.’’
 ‘‘అయితే కొనచ్చుగా! మరీ గీకి గీకి బేరాలాడాడు కదా?’’ అన్నాను.
 ‘‘బహుశా అతని దగ్గరంత డబ్బుల్లేవేమో? మనకి తెలియదు కదా? నిజంగా అతను బలొయీ కుటుంబానికి చెందినవాడైతే ఈ చిత్రం అతనికి దక్కాల్సిందే!’’ అన్నాడు.
 నేను దానికి ఒప్పుకోలేదు. అది మా అమ్మ కొనుక్కుని ఉండొచ్చు. లేదా ఎవరైనా బహుమతిగా ఇచ్చుండొచ్చు. అయినా అది మా అమ్మ ఆస్తి.
 
 ‘‘నేను చెప్పేది హక్కుల గురించి కాదు. మన అవగాహనా లేమి గురించి. మనకి ఈ పెయింటింగుల విలువ తెలీదు. అందులో ఉండే కష్టము, వాటి వెనకాల కథ, చరిత్ర తెలీదు. మనలాంటి వాళ్ల వల్ల చరిత్ర చాలా ధ్వంసం అవుతుందనిపిస్తోంది. నువ్వూ నేనూ దీన్ని కాపాడాల్సింది పోయి, లాభపడాలనుకుంటున్నాం. ఇదే కాదు, మీ అమ్మ దాచుకున్న వస్తువుల్లో చాలా భాగం అమ్మేశాం. అందులో ఏది పనికొచ్చేదో ఏది పనికిరానిదో మనకి తెలియదు. నిజానికి మనం ఆ యాంటీక్ షోకి వెళ్లకపోయుంటే ఓ వంద డాలర్లకి అమ్మేసుండేవాళ్లం కాదా? అందుకే అతనికి చెందాలన్నాను. అయినా ఇది నీ ఆస్తి. ఏం చెయ్యాలన్నది నీ ఇష్టం.’’చాలాసేపు ఆలోచనలో పడిపోయాను. పదే పదే ఆ గడ్డపు వ్యక్తి గుర్తుకొచ్చాడు. నేను అతనితో ఎంతో అగౌరవంగా ప్రవర్తించాను. కనీసం ఒక్కసారైనా అతని గురించి అడిగే ప్రయత్నం చేయలేదు. ఎంత ఇష్టం లేకపోతే అతను ప్రతి నెలా పని కట్టుకొస్తాడు. రాబర్ట్ చెప్పినట్లు అతని దగ్గర అంత డబ్బులేదేమో?
 
 రాత్రంతా ఆలోచనలతో నిద్రపట్టలేదు. నాకు అమ్మ ద్వారా చిత్ర కళంటే పరిచయం ఉంది కానీ దాని విలువ తెలీదు. అమ్మకి విలువైనది, నాకు పనికి రాలేదు. అందులోనూ లాభం వెతుక్కున్నా. దాని విలువ తెలిసినవాడు  వెలకడితే ఆనందంగా డాలర్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకో గిల్టీగా అనిపించింది. తెల్లారి లేచేసరికి రాబర్ట్ అప్పటికే వర్కుకి వెళ్లిపోయాడు. సాయంత్రం రాబర్ట్ ఇంటికొచ్చాక, నా నిర్ణయం చెప్పాను, శాన్ ఫ్రాన్సిస్కో గ్యాలరీ ఏజెంటు డీల్ క్యాన్సిల్ చేసేయమని. నా మాట విని ఆశ్చర్యపోతూ ఒకటికి రెండుసార్లు రెట్టించి మరీ అడిగాడు. వచ్చే నెల డీ యాంజా ప్లీ మార్కెట్టుకి వెళదామని అన్నాను. ఆ గడ్డం వ్యక్తి కోసం ఎదురుచూస్తూనే ఉంటాను; ఎప్పటికైనా రాకపోతాడా అన్నదే నా ఆశ.
 - సాయి బ్రహ్మానందం గొర్తి

మరిన్ని వార్తలు