బరితెగించేశారు.. టీడీపీ అరాచకపర్వం | Sakshi
Sakshi News home page

బరితెగించేశారు.. టీడీపీ అరాచకపర్వం

Published Sun, Jul 6 2014 1:45 AM

బరితెగించేశారు.. టీడీపీ అరాచకపర్వం - Sakshi

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అరాచక పర్వానికి తెరతీసింది. తమకు మెజారిటీ లేని జిల్లాల్లో పరిషత్ పీఠాలను సొంతం చేసుకోవటానికి దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు నిండు సభల్లోనే బేరసారాలు, బెదిరింపుల నీచస్థాయికి దిగజారింది. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్‌పీటీసీ సభ్యులపై దౌర్జన్యకాండకు తెగబడింది. జిల్లా కలెక్టర్, పోలీసులపై దాడులకు సైతం వెనకడుగు వేయలేదు. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానాలకు శనివారం ఎన్నికల సంఘం ఎన్నిక నిర్వహించింది. వీటిలో 11 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ నేతల దౌర్జన్యాలతో ఎన్నిక నిలిచిపోయింది. టీడీపీ బరితెగింపుకు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జడ్‌పీ ఎన్నికలు సాక్షీభూతంగా నిలిచాయి. కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మెజారిటీ సభ్యులుండగా వారిలో 8 మందిని బలవంతంగా తమవైపుకు తిప్పుకుని, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులను బయటకు గెంటేసి, తలుపులు మూసేసి తమవారిని గెలిపించుకుంది. జడ్పీల్లో తమ అన్యాయాలకు ఎదురులేకుండా చేసుకొనేందుకు వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్‌పీటీసీలను ప్రలోభాలు, బెదిరింపులతో తమ పార్టీలో చేర్చుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాలు టీడీపీకి దక్కాయి. కడప జడ్‌పీ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంది.     - సాక్షి, హైదరాబాద్
 
 మెజారిటీ పార్టీని గెంటేసి.. తలుపులు మూసేసి..
 
 సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. బలం లేకపోయినా.. టీడీపీ నాయకులు బలవంతంగా జడ్‌పీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇందుకు జిల్లా ఉన్నతాధికారులు వంత పాడటం విమర్శలకు తావిచ్చింది. జడ్‌పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 30 స్థానాలను దక్కించుకోగా.. టీడీపీకి 20, కాంగ్రెస్‌కు 2, ఆర్‌పీఎస్‌కి ఒక స్థానం వచ్చాయి. జడ్‌పీ చైర్మన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాల్సి ఉంది. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ టీడీపీ నాయకులు ప్రలోభాలకు తెరతీశారు. కాంగ్రెస్, ఆర్‌పీఎస్ జడ్‌పీటీసీ సభ్యులతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన ఎనిమిది మందికి ఎర వేశారు. కొందరిని బలవంతంగా క్యాంపుకు తీసుకెళ్లి పదిహేను రోజులకుపైగా దాచి ఉంచారు.



శనివారం జడ్‌పీ చైర్మన్ ఎన్నికను పథకం ప్రకారం నడిపించారు. జడ్‌పీ కార్యాలయం సమావేశపు హాలులో టీడీపీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేర్వేరుగా బారికేడ్లు కట్టించారు. క్యాంపుకు తీసుకెళ్లిన జడ్‌పీటీసీ సభ్యులను భారీ భద్రత నడుమ ప్రైవేట్ బస్సులో కర్నూలుకు తీసుకొచ్చారు. భారీగా మోహరించిన పోలీసులు వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తమకు ఎన్నికల్లో పాల్గొనే హక్కు ఉందని చెప్తూ.. అందుకు సంబంధించిన జీఓ పేపర్లను నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చూపించినా పోలీసులు పట్టించుకోలేదు. ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లకుండా తలుపులు మూసివేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు బి.సి.జనార్దన్‌రెడ్డి, జయనాగేశ్వర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్నారు. దమ్ముంటే తమ కంపార్ట్‌మెంట్‌లోకి రావాలంటూ రెచ్చగొట్టారు. అయినా కలెక్టర్ మాత్రం జడ్‌పీటీసీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తుండడంతో ‘‘కలెక్టర్ డౌన్ డౌన్, ప్రభుత్వం డౌన్ డౌన్’’ అంటూ వైఎస్సార్ సీపీ జడ్‌పీటీసీ సభ్యులు నినాదాలు చేశారు. దీనిపై వారిని బయటకు పంపేయండి అని కలెక్టర్ ఆగ్రహంతో ఎస్‌పీకి ఆదేశాలిచ్చారు. దీంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు జడ్‌పీటీసీ సభ్యులను సైతం ప్రమాణ స్వీకారం చేయించకుండా పోలీసులతో ఎస్‌పీ బయటకు గెంటివేయించారు. చివరికి సమావేశపు హాలు తలుపులు మూసివేసి కేవలం పది నిమిషాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కానిచ్చేశారు.
 
 మైకులు తోసేసి.. టేబుళ్లు తన్నేసి..
 
 సాక్షి, నెల్లూరు/నెల్లూరు (క్రైమ్): పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ ైచె ర్మన్ ఎన్నిక జరగనివ్వకుండా టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగడంతో.. జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ ఎన్నికను వాయిదా వేశారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ నేతలు గొడవ చేస్తూ, అడుగడుగునా అడ్డుకుంటూ, సమావేశాన్ని రసాభాస చేశారు. టీడీపీ (వెంకటగిరి) ఎమ్మెల్యే రామకృష్ణ స్వయంగా కలెక్టర్ ఎదుట ఉన్న మైకును తోసివేసి, నామినేషన్, ప్రమాణస్వీకార పత్రాలను చించివేశారు.


ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు తమ అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఎంపీ లు, ఎమ్మెల్యేలు, జడ్‌పీటీసీ సభ్యులపై దాడిచేసి చొక్కాలు చింపారు. మహిళా జడ్‌పీటీసీ సభ్యుల చీరలు లాగారు. వృద్ధురాలని కూడా చూడకుండా కావలి జడ్‌పీటీసీ పెంచలమ్మను ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేశారు. జిల్లాలోని 46 జడ్‌పీటీసీల్లో వైఎస్సార్ సీపీకి 31, టీడీపీకి 15 స్థానాలు దక్కడం తెలిసిందే. కానీ శనివారం నాటికి ఆరుగురు వైఎస్సార్‌సీపీ జడ్‌పీటీసీ సభ్యులను టీడీపీ నేతలు ప్రలోభపెట్టి తమవైపుకు తిప్పుకున్నారు. అయినా వైఎస్సార్‌సీపీకి మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ మంది సభ్యులు (25) ఉండటంతో, వారిలో ముగ్గురిని సమావేశంలోంచే బహిరంగంగా ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేశారు.

 దిగ్భ్రాంతికి గురైన కలెక్టర్

 జడ్‌పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మధ్యాహ్నం 1.00 నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ ప్రకటించారు. అప్పటికి వైఎస్సార్‌సీపీ జడ్‌పీటీసీ సభ్యులు వచ్చినా టీడీపీ సభ్యులు రాకపోవడంతో 20 నిమిషాలు చూసి, కోరం ఉండటంతో ప్రమాణ స్వీకార  కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. తమ సభ్యులు ఇంకా రాకుండానే ఎలా ప్రారంభిస్తారంటూ ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్టర్ పోడియం వద్దకొచ్చి టేబుల్‌ను కొట్టారు. నానా దుర్భాషలాడారు. టేబుల్ మీది మైకును కిందకు తోసేశారు. టీడీపీ జెడ్పీటీసీలు కూడా వచ్చి కలెక్టర్‌ను చుట్టుముట్టారు. టేబుల్‌పై పేపర్లను చించేసి, టేబుల్‌ను తోసిపడేశారు. దిగ్భ్రాంతికి గురైన కలెక్టర్ లేచి పక్కకు వెళ్లారు. కావలి జడ్‌పీటీసీ పెంచలమ్మ ఒక దశలో స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు. ఆమెకు ఆరోగ్యం క్షీణించిందని సాకు చెప్పి ఆస్పత్రికి తరలించడానికి టీడీపీ వాళ్లు అంబులెన్స్‌ను పిలిపించారు. ఇంత గందరగోళం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ సభ్యులు మళ్లీ కలెక్టర్‌ను అడ్డుకున్నారు. చివరికి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్‌పై దౌర్జన్యానికి దిగిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై నాన్‌బెయిల్‌బుల్ కేసు నమోదైంది.

నిండు సభలోనే... బేరాలు, బెదిరింపులు
 
 ప్రకాశం జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ అరాచకం
 
 సాక్షి, ఒంగోలు: టీడీపీ బరితెగింపుకు ప్రకాశం జిల్లా పరిషత్ ఎన్నిక పరాకాష్టగా నిలిచింది. జడ్‌పీ పీఠం తమకు దక్కదన్న భయంతో వాయిదా వేయించారు. దీనికోసం అన్ని రకాల ఎత్తుగడలు, ప్రలోభాలను టీడీపీ సభ్యులు జడ్‌పీ వేదికగా ప్రయోగించారు. వీరికి మంత్రి సిద్దా రాఘవరావు, టీడీపీ ఎంపీ రవీంద్ర మాల్యాద్రి, ఎమ్మెల్యేలు అండగా నిలిచారు. మెజారిటీ లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేయించడానికి కావాల్సిన అన్ని జిమ్మిక్కులను పార్టీ నాయకులు ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 31 మంది గెలుపొందగా, తెలుగుదేశం పార్టీ 25 స్థానాలను మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే.


అయితే.. ఇప్పటికే ముగ్గురు వైఎస్సార్ సీపీ జడ్‌పీటీసీలను టీడీపీ ప్రలోభపెట్టి తమవైపునకు తిప్పుకుంది. మొదటి నుంచి ఏడుగురు జడ్‌పీటీసీలు తమ వైపునకు వస్తారని ప్రచారం చేసినా ముగ్గురు మాత్రమే వెళ్లడంతో ఇరుపార్టీల బలం సమానంగా మారింది. లాటరీలో జడ్‌పీ పీఠం తమకు దక్కుతుందో లేదో అన్న భయంతో వాయిదా వేయించేందుకే మొదటి నుంచి ప్రయత్నించింది. సమావేశం జరుగుతుండగానే అర్దవీడు మండల జడ్‌పీటీసీ (ఎస్‌టీ )ని ప్రలోభపెట్టే ప్రయత్నం ఆ పార్టీ జడ్‌పీటీసీలు చేశారు. ‘మీ బావకు కోటి రూపాయలు ఇస్తాం. నువ్వు మాకు ఓటు వేయ’మని అడిగారు. దీంతో ఆ జడ్‌పీటీసీ తాను డబ్బులకు అమ్ముడుపోయే మనిషిని కాదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. వివాదం తెలుసుకుని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీ జడ్‌పీటీసీలను ప్రశ్నిస్తుండగా వారందరూ వాగ్వాదానికి దిగారు. ఒకదశలో గొట్టిపాటి రవికుమార్‌ను తోసి వేయడంతో ఆయన కూడా ఎదురుతిరిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. కోరం ఉండటంతో ఎన్నిక వాయిదా వేయడం కుదరదని కలెక్టర్ విజయకుమార్ స్పష్టం చేయడంతో వారు తమ ఎస్టీ సభ్యురాలిపై దౌర్జన్యం చేశారంటూ పోడియం ఎదుట బైఠాయించారు. కలెక్టర్ మూడుసార్లు సమావేశాన్ని వాయిదా వేసినా టీడీపీ సభ్యులు పట్టు వీడలేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు.
 

Advertisement
Advertisement