బంగారు దెయ్యం

26 Apr, 2015 00:57 IST|Sakshi
బంగారు దెయ్యం

పిల్లల కథ
చాలా కాలం నుండి ఒక జువ్వి చెట్టు మీద ఓ దెయ్యం నివాసముంటుండేది. అది ఎవరినీ ఏమీ హింసించేది కాదు. ఆ ఊరి దొంగలు ఆ చెట్టుకింద దొంగిలించిన వాటిని పంచుకునేవారు. ఒకరోజు రాత్రి సమయంలో బంగారు వస్తువులు పంచుకుంటుండగా, చెట్టుమీద నుండి దెయ్యం దబ్బున కిందికి జారిపడింది. దాంతో దొంగలు బంగారాన్ని విడిచి పరుగుతీశారు.
 
దెయ్యం ఆ బంగారు వస్తువుల్ని మూటలో బిగించి, చెట్టు పలవల మధ్య దాచింది.
 కొంతకాలానికి ఈ విషయం బైటపడింది. విన్నవారందరూ ఆ బంగారం దక్కించుకోవాలనుకున్నారే తప్ప ప్రయత్నం చేయలేకపోయారు. ఒకరోజు ముగ్గురు సాహసవంతులు భూత వైద్యుడిని వెంటబెట్టుకొని దెయ్యం వద్దకు బయలుదేరారు.
 
దారిలో వారికి కర్రపుల్లలు అమ్ముకునే బీద సీనయ్య కలిసి విషయం తెలుసుకొని, తనకీ ఆశపుట్టి వారి వెంట బయలుదేరాడు. దెయ్యం వారిని చూసిన వెంటనే, ‘‘మీరు ఏ ఉద్దేశంతో నా వద్దకు వచ్చారో నాకు తెలుసు. నన్ను బంధించవద్దు. మీకు కావలసింది బంగారమే కదూ. ఇస్తాను. అయితే ఒక షరతు. మీకు బంగారం ఇస్తే ఎవరేం చేస్తారో నాకు చెప్పండి. అది విని నేను మీలో ఎవరికి ఇవ్వాలో ఇస్తాను’’ అంది.
 
మొదటి వ్యక్తి, ‘‘నేను నాకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్ముకొని, వ్యాపారం మొదలుపెట్టాను. దానిలో బాగా నష్టపోయాను. నువ్వు బంగారం నాకిచ్చిన పక్షంలో, తిరిగి వ్యాపారం ప్రారంభించి, పోయిన నా ఆస్తిని సంపాదించుకుంటాను’’ అన్నాడు.    
 మిగతావారు ఏవేవో వారి బాధలు చెప్పుకున్నారు.
 సీనయ్యతో దెయ్యం, ‘‘నువ్వేం చేస్తావో చెప్పు?’’ అంది.
 సీనయ్య, ‘‘నిజం చెప్పాలంటే వీళ్లందరి కంటే బీదవాడిని. ఒకపూట తిండి కూడా సరిగ్గా దొరకదు. నాకూ బోలెడన్ని ఆశలు, కోరికలు ఉన్నాయి. నువ్వు అంటూ బంగారం ఇస్తే, దాంతో కొన్ని ముఖ్యమైన సమస్యలు తీర్చుకొని, మిగతా బంగారంతో నాలా కష్టాల్లో ఉంటూ పూటకు తిండిలేని వారి సమస్యలు తీరుస్తాను’’ అన్నాడు ధైర్యంగా.
 
సీనయ్య ఉదార బుద్ధికి దెయ్యం ఒక్కసారిగా చలించిపోయింది. ‘‘మనిషి ఆశాజీవి! దొరికినదంతా తానే అనుభవించి సుఖపడాలనుకున్న రోజులివి. అటువంటిది నువ్వు కష్టాలు అనుభవిస్తూ పొరుగువాడి కష్టాన్ని తీర్చడం అన్నది గొప్ప మహత్తర విషయం. నిన్ను అభినందిస్తూ ఈ బంగారం ఇస్తున్నాను’’ అని బంగారం మూట అందించింది. దెయ్యం మనసులో... దొంగల బంగారం ఓ మంచి పనికి పనికొచ్చింది అనుకున్నది.
- ఆరుపల్లి గోవిందరాజులు

మరిన్ని వార్తలు