తమిళ నోట తెలుగు పాట

7 Dec, 2014 01:25 IST|Sakshi
తమిళ నోట తెలుగు పాట

పండబారిన వెన్నెల రాత్రిలో, చేరదేశపు చెలులు దగ్గర ఉండగా, చక్కటి తెలుగు పాట పాడుతూ, సింధు నదిలో పడవ నడుపుదాం...

దర్శకుడు జ్ఞాన రాజశేఖరన్- ‘భారతి’ పేరుతో ఒక జీవితచరిత్రను సినిమాగా తీయడానికి ముఖ్య కారణం, సుబ్రహ్మణ్యం భారతి భావనలు ఆయన్ని ఊపేయడం మాత్రమే కాదు; ప్రమాదవశాత్తూ, దురదృష్టవశాత్తూ కూడా, సుబ్రహ్మణ్య భారతి మరణించినప్పుడు కేవలం పద్నాలుగు మంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారని తెలియడం కూడా!
 
అదెలా జరిగిందో తెలియాలంటే, జీవితానికీ సాహిత్యానికీ ఉన్న సంబంధం ఏమిటో తెలియాలి. సాహిత్యాన్ని జీవితం, జీవితాన్ని సాహిత్యం పెనవేసుకున్న వైనం తెలియాలి.సుబ్రహ్మణ్య భారతి అసలు పేరు సుబ్బియ. ఐదేళ్లకే తల్లిని కోల్పోయాడు. నేర్చుకున్న సంగీతం ఒడిలో సేదతీరాడు. 11 ఏళ్ల వయసులోనే అపర గాంధర్వులనుకున్నవారితో సంగీతంలో పోటీపడ్డాడు. ఫలితంగా ‘భారతీయార్’ అన్న బిరుదునూ, దానిమీదుగానే ‘పేరు’నూ పొందాడు.
 
అలౌకిక బీజాలు కనబడుతున్న కొడుకుని లౌకిక ప్రపంచంలోకి లాగడానికి పదహారేళ్లకే పెళ్లి జరిపించాడు తండ్రి. అయినా వివాహం బంధనం కాలేకపోయింది. కాశీ వెళ్లాడు భారతి. సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. లోకసంచారిగా బ్రిటిష్‌వారి పాలనలోని భారతదేశపు పేదరికాన్ని, అసమానతలను నగ్నంగా దర్శించాడు. దేశపుత్రుడిగా మాతృమూర్తికి స్వాతంత్య్రపు అంబరాల్ని తొడగాల్సిన బాధ్యతను గుర్తెరిగాడు. భారతమాతను తల్చుకుంటేనే అంతరాళాల్లో  పొంగే ధైర్యాన్ని స్పృహించాడు. ‘కాలిపోయినా, బాధపడ్డా పదేపదే వందేమాతరం’ పాడదామన్నాడు.
 
భారతి లక్ష్యాలు రెండు. మొదటిది స్వాతంత్య్రం పొందడం. రెండవది, స్వాతంత్య్రం అనంతరం మనల్ని మనం సంస్కరించుకోవడం. అందుకుగానూ ‘స్వదేశీ మిత్రన్’, ‘ఇండియా’ వంటి పత్రికలు నెలకొల్పాడు. కవిత్వం అల్లాడు. కథలు చెప్పాడు. వ్యాసాలు రాశాడు. కన్నన్ పాట్టు, కూయిల్ పాట్టు, పాప్ప పాట్టు లాంటి రచనలు చేశాడు. సమాజ స్థితినీ, గతినీ సజీవంగా చిత్రించాడు. కులాల మెట్లు కూలిపోవాలన్నాడు. మతాల అడ్డుగోడలు పడిపోవాలన్నాడు.

జన హృదయ పరివర్తనను కాంక్షించాడు. ‘కాకీ, పిచ్చుకలదీ మన కులమే; సముద్రం, పర్వతం మన సమూహమే’ అన్నాడు. ‘మూర్ఖులు మాత్రమే మనుషుల మధ్య మంటలు పెడతా’రన్నాడు. అడ్డగోలు దేవుళ్ల ఉనికిని నిరసించాడు. ‘దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడూ ప్రతి జీవిలోనూ ఉన్నా’డన్నాడు. ‘ప్రేమతో మాత్రమే ఈ ప్రపంచం వర్ధిల్లగల’దని విశ్వసించాడు. వంద సంవత్సరాల క్రితమే లింగ వివక్షను ప్రశ్నించాడు. విద్యతోనే వికాసమని మహిళలకు ఉద్బోధించాడు. స్వయం సమృద్ధమైన సామ్యవాదాన్ని స్వప్నించాడు.
 
‘ప్రియురాలు తమిళంలో మాట్లాడితే అది జీవనదుల ఊట’ అంటూనే, ‘సుందర తెలుంగు నిఱ్ పాట్టి శైత్తు/ త్తోణిగ ళోట్టి విళైయాడి వరువోం’(పండబారిన వెన్నెల రాత్రిలో, చేరదేశపు చెలులు దగ్గర ఉండగా, చక్కటి తెలుగు పాట పాడుతూ, సింధు నదిలో పడవ నడుపుదాం’ అని భారతీయ హృదయాన్ని ఆవిష్కరించుకున్నాడు. ‘వెలుగే నీ కనులే చిట్టెమ్మా సూర్యచంద్రులే/ నల్లని నీ కనుపాపే చిట్టెమ్మా వానమేఘాలే’ అని పాడుకున్నాడు. ‘నిప్పులో చెయ్యిపెడితే నిన్ను ముట్టుకున్నట్లే ఉందేమిటి కృష్ణా’ అని పరవశించాడు.
 
‘కవిత రాసేవాడు కవి కాడు. కవిత్వాన్ని జీవితంగా జీవితాన్ని కవిత్వంగా చేసుకున్నవాడే కవి’ అన్నాడు భారతి. ఆయన కవిని మించిన సంస్కర్త. సంస్కర్తను మించిన కవి. జీవితాన్నీ సాహిత్యాన్నీ లౌక్యంగా వేరు చేయలేదు. ఆయనకు రెండూ ఒకటే.  రైతులతో, కూలీలతో భుజాలు కలిపి తిరిగాడు. దళితులను ఆలింగనం చేసుకున్నాడు. స్వయంగా ‘హరిజనుడికి’ ఉపనయనం చేశాడు. తన కూతురు తంగమ్మను అదే వర్గంలో ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. అదిగో, అప్పుడు, ఆయన దగ్గరివాళ్లందరికీ దూరమైపోయాడు. దగ్గరవడానికి ప్రయత్నించినవాళ్లు ఆ సమయంలో దూరంగా ఉండివుంటారు!
 
దాంతో- నిత్యజీవితపు కోలాహలం నుంచి అనాసక్త స్థితికి వచ్చాడు. కవిత్వం రాసుకోవడం, పార్థసారథి కోవెలకు వెళ్లడం, అక్కడి ఏనుగుతో కాసేపు గడపడం చేస్తూవచ్చాడు. అయితే రోజూ ఆయనచేతి అరటిపళ్లను ప్రేమగా తినేంతగా మాలిమి అయిన ఆ ఏనుగే తొండంతో ఆయన్ని చుట్టి నేలకు కొట్టింది. ఒక వీరుడు మరణించకూడని చావు అది! కానీ వాస్తవం అది! అలా నలభయ్యో జన్మదినం కూడా చూడకుండా సుబ్రహ్మణ్య భారతి (11 డిసెంబర్ 1882- 11 సెప్టెంబర్ 1921) దుర్మరణం పాలయ్యాడు.
 
‘భారతి నిజంగా అగ్నిలాంటివాడు. జనం ఆ అగ్నిని తమ చేతుల్లో కొంతసేపే మోయగలరు తప్ప ఎల్లప్పుడూ కాదు. అగ్నిని కింద పడవేయాల్సిందే, పడవేశారు’ అంటాడు జ్ఞాన రాజశేఖరన్, ‘అంత్యక్రియలకు పద్నాలుగు మంది హాజరు’కు గల అప్పటి కారణాన్ని ఊహిస్తూ. కానీ, అదే అగ్ని నెమ్మదిగా హృదయాల్ని వెలిగించే దివ్వెలుగా రూపాంతరం చెందివుంటుంది! ఇక పడేయడం కాని పని!
 - ఆర్.ఆర్.

మరిన్ని వార్తలు