ఆనవాళ్లు తుడిచేశారు | Sakshi
Sakshi News home page

ఆనవాళ్లు తుడిచేశారు

Published Sun, Dec 7 2014 1:25 AM

ఆనవాళ్లు  తుడిచేశారు - Sakshi

రేషన్ కార్డులకు నకిలీ ఆధార్ అనుసంధానం వ్యవహారం
పట్టణ డీలర్లనే దోషిగా చేశారు
రూరల్ డీలర్లను వదిలేశారు
కంప్యూటర్ సర్వర్‌లో వివరాల తొలగింపు!
లక్షల్లో చేతులు మారిన తీరు
రెవెన్యూలో ఓ ఉన్నతాధికారి కీలకపాత్ర?

 
గుడివాడ : బోగస్ రేషన్ కార్డులకు నకిలీ ఆధార్ అనుసంధానం వ్యవహారంలో కొందరు డీలర్ల వద్ద మామూళ్లు దండుకుని గుట్టుచప్పుడు కాకుండా ఆనవాళ్లు తుడిచేసినట్లు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకుగాను గుడివాడ రూరల్ మండలంలోని కొందరు రేషన్ డీలర్లు మండల రెవెన్యూ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారికి పెద్ద మొత్తంలో చేతులు తడిపినట్లు తెలుస్తోంది. బోగస్ తెల్లరేషన్ కార్డులకు నకిలీ ఆధార్ అనుసంధానం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంలో గుడివాడ పట్టణంలో ఉన్న 43 మంది డీలర్లపై కేసులు నమోదుచేసి విచారణ  చేపట్టారు. ఇందులో భాగస్వాములుగా ఉన్న దాదాపు 55 మందిపై పోలీసులు విచారణ జరిపి కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గుడివాడ రూరల్ మండలంలోని 26 మంది రేషన్ డీలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇదే అదునుగా భావించిన ఈ అధికారి ఆయా డీలర్లను పిలిపించి ప్యాకేజీలు మాట్లాడుకుని గుట్టుచప్పుడు కాకుండా నకిలీ రేషన్ కార్డుల వివరాలను కంప్యూటర్ సర్వర్ నుంచి తొలగించినట్లు సమాచారం.

రాత్రికి రాత్రే ఈ వ్యవహారం పూర్తిచేసినట్లు తెలిసింది. కంప్యూటర్ నుంచి ఈ వివరాలు తొలగించాలంటే పౌరసరఫరాల శాఖ పాస్‌వర్డు ఉంటే సరిపోతుంది. ఈ పాస్‌వర్డు ద్వారా దాదాపు రెండువేలకు పైగా తెల్లకార్డులు తొలగించారని తెలుస్తోంది. బిళ్లపాడు, బొమ్మలూరు, దొండపాడు, శేరీగొల్వేపల్లి తదితర గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్ల వద్ద పెద్ద ఎత్తునే బోగస్ కార్డులు ఉన్నట్లు తెలిసింది. బోగస్‌కు ఆధార్ అనుసంధానం చేసిన వ్యవహారంలో రూరల్ మండలంలోని కొందరు డీలర్లు ఉన్నట్లు సమాచారం. గ్రామాల్లో ఉన్న డీలర్లకు నకిలీల వ్యవహారంలో పాత్ర ఉందని తెలిసినా వీరిపై విచారణ చేయాలని గుడివాడ తహశీల్దార్ కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. ఈ వ్యవహారంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గుడివాడ రూరల్ మండలంలోని రేషన్ డీలర్లపై విచారణ జరిపించాలని, సర్వర్ నుంచి కార్డుల వివరాలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అంతులేని అవినీతి దాహం...

మండల రెవెన్యూ కార్యాలయంలోని సదరు ఉన్నతాధికారి అవినీతి దాహానికి అంతులేకుండా పోతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికీ మామూళ్లు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నాడని పలువురు పేర్కొంటున్నారు. భూమి మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్)కు ఛలానా ఎంత చెల్లిస్తారో నాకు అదనంగా అంత మొత్తంలో మామూళ్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఇప్పటికీ రేషన్ డీలర్ల వద్ద నెలనెలా మామూళ్లు దండుకుంటున్నాడని చెబుతున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఒక్కోదానికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు డిమాండు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సాల్వెన్సీ పత్రానికీ పెద్ద మొత్తంలోనే దండుకుంటున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
 
 

Advertisement
Advertisement