మౌనవీణ గానమిది...

13 Dec, 2015 02:40 IST|Sakshi
మౌనవీణ గానమిది...

గ్రేట్ లవ్ స్టోరీస్
‘అడవి మౌనంగా ఉంటుంది. ఆ మౌనంలో నుంచే మహత్తరమైన గానం వినిపిస్తుంది. ఆ గానంతో పక్షులు తీయగా గొంతు కలుపుతాయి. పచ్చటి అడవి సంగీత కచేరిగా మారుతుంది’... కవి మిత్రుడు అడవి మీద  చెప్పిన  కవిత పదే పదే గుర్తుకు వస్తోంది మల్వా (మధ్యప్రదేశ్) సుల్తాన్ బజ్ బహదూర్‌కు. మనసు బాలేనప్పుడు, జీవితం మరీ యాంత్రికంగా అనిపించినప్పుడు, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలను కున్నప్పుడు వేటకు వస్తుంటాడు బహదూర్. పేరుకే వేటగానీ అడవి అందాన్ని ఆస్వాదించడమే అతని ఉద్దేశం.
 
ఆ రోజూ అలానే వచ్చాడు. ఉన్న ట్టుండి ఎక్కడి నుంచో తేనెలూరే పాట వినిపించింది. ‘కవి చెప్పినట్లు అడవి పాడుతుందన్నమాట’ అనుకుంటూ అటు వైపు వెళ్లాడు. పాడుతోంది అడవి కాదు... అందమైన అమ్మాయి! తన స్నేహితులతో కలసి గొర్రెలను మేపుతూ పాడుతోంది. బహదూర్‌ను చూసి పాట ఆపింది.

‘ఫరవాలేదు పాడు’ అన్నాడు బహదూర్. ఆమె మళ్లీ పాడడం ప్రారం భించింది. ఆ గానంలో తనను తాను మరిచిపోయాడు బహదూర్. ‘‘నీ పేరేమిటి?’’ అని అడిగాడు.
 ‘‘రూపమతి’’ అని చెప్పింది.
 ‘‘రూపమతీ... ఎన్నో కచేరీలు విన్నాను. కానీ ఇంతటి తీయటి స్వరాన్ని ఎప్పుడూ వినలేదు’’ మాట్లాడుతూనే ఉన్నాడు బహదూర్. సిగ్గుపడుతూనే ఉంది రూపమతి. ఇది మొదలు... రూపమతి కోసం వారానికి రెండుసార్లు అడవికి  రావడం మొదలెట్టాడు బహదూర్. ఆమె తేనెగాన ప్రవాహంలో ఆనందంగా మునకలు వేసేవాడు. ఒకరోజు-
 
‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు.
 ‘‘మీరెక్కడా మేమెక్కడా? రాజావారు గొర్రెలు కాసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా రని లోకులు నవ్వుతారు’’ అందామె.
 ‘‘కొన్ని పనులు జనం కోసం చేయాలి. కొన్ని పనులు మన కోసమే చేయాలి. ప్రేమ, పెళ్లి అనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయాలు. నేను నిన్ను పెళ్లి చేసుకోవా లనుకుంటున్నాను’’ అన్నాడు బహదూర్.
 ‘‘నేను మాత్రం కాదంటానా!’’ అన్నట్లు కొంటెగా చూసింది రూపమతి.
   
బజ్ బహదూర్ రూపమతిని పెళ్లి చేసుకోవడం సంచలనాన్ని సృష్టించింది.  గొర్రెలు కాసే అమ్మాయిని బహదూర్  పెళ్లి చేసుకొని రాజుల పరువు తీశాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయినా చలించ లేదు బహదూర్. పైగా నర్మదా నది ఒడ్డున ఆమె కోసం మహల్‌ను కట్టాడు.
 రూపమతిని బహదూర్ పెళ్లి చేసుకోవడం అతడి సన్నిహితులు, బంధువులలో చాలామందికి నచ్చలేదు. తమ మనసులోని కోపానికి పుకార్ల రూపం ఇచ్చారు. ‘బహదూర్ రాజ్య పాలనా వ్యవహారాలు పట్టించుకోవడం లేదు, ఆమే ప్రపంచంగా బతుకుతున్నాడు’ అన్నారు. ‘బహదూర్‌ను బానిసలా మార్చుకుంది రూపమతి’ అన్నారు.
 
ఈ పుకార్లు చివరకు శత్రువుల వరకు చేరాయి. అంతర్గత కలహాలతో బలహీ నంగా ఉన్న మల్వాను జయించడానికి ఇదే అదను అనుకున్నారు. ఆదామ్‌ఖాన్, పీర్ మహ్మద్ ఖాన్‌ల ఆధ్వర్యంలో మల్వాపై దాడి జరిగింది. బహదూర్ విజయం సాధించాడు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అదనపు సైన్యాలు దిగాయి.

ఇక బహదూర్‌కు ఓటమి తప్ప లేదు. రాజ్యాన్నే కాదు, రూపమతిని కూడా వశపరుచుకోవాలనుకున్నాడు ఆదామ్. అతన్నుంచి తప్పించుకోవడానికి విషం మింగి మరణించింది రూపమతి. ఆ వార్త వినగానే శత్రువుల వద్ద బందీగా ఉన్న బహదూర్ గుండె బద్దలయ్యింది. ఒకప్పుడు వాళ్లిద్దరినీ కలిపిన ఆ అడవి పాడుతోంది. విషాదాన్ని ఒలికిస్తోన్న ఆ పాట విని సెలయేళ్లు కన్నీళ్లయ్యాయి!
 - యాకూబ్ పాషా
 
* రూపమతి కోసం బజ్ బహదూర్ నిర్మించిన అందమైన రాజమహల్, దీనికి నీరు సరఫరా చేయడానికి నిర్మించిన రెవ కుంద్ రిజర్వాయర్... ఎక్కడెక్కడి నుంచో వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రేమికులు ఈ ప్రదేశాలను పవిత్ర స్వర్గధామాలుగా చూస్తారు.
* రూపమతి పాడిన 26 కవితలను అహ్మద్-ఉల్-ఉమ్రి సంకలనం చేశాడు. ‘ద లేడీ ఆఫ్ ద లోటస్: రూపమతి’ పేరుతో ఎల్.యం.క్రంప్ ఇంగ్లిష్‌లోకి అనువదించారు.

మరిన్ని వార్తలు