ఇల్లు తిరగేస్తే...!

26 Jan, 2014 00:17 IST|Sakshi
ఇల్లు తిరగేస్తే...!

 వర్ణం
 ఇల్లు తిరగేసి ఉండటం ఎప్పుడైనా చూశారా... ఏంటా ఆశ్చర్యం. ఇపుడు చూస్తారు ! ఈ ఫొటో చూడండి. ఆ ఇంట్లో అడుగుపెడితే కిందుండాల్సినవన్నీ  పైకప్పుకు వేళ్లాడుతుంటాయి. పైనుంచి టీ పాయ్ వేలాడుతూ ఉంటుంది. కానీ దానిమీద పెట్టిన ఫోను కిందపడదు. కిచెన్లో అన్ని వస్తువులు ఉంటాయి. కానీ వంట మాత్రం చేయలేరు. బాత్‌రూమ్ కమోడ్ తలెత్తి చూస్తే కానీ కనిపించదు... ఏంటీ వింత అనిపిస్తుంది కదా. పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి రష్యా ప్రభుత్వం చేసిన ప్రయోగం ఇది. మాస్కోలోని ‘ఆల్-రష్యా ఎగ్జిబిషన్ సెంటర్లో’ ఇలాంటి తలకిందుల ఇళ్లు కనిపిస్తాయి. అక్కడ కేవలం ఇల్లు మాత్రమే ఉండదు... ఇంట్లో ఉండాల్సిన అన్ని వస్తువులు ఇంటితో పాటు తలకిందులుగా ఉంటాయి. రండి వెళదాం రష్యాకి!
 
 20 ఏళ్ల పడుచుల ఆనందకేళి !
 గాల్లో తేలియాడుతున్న ఈ అమ్మాయిలు ఇరవై ఏళ్లు నిండిన జపాన్ పడుచులు. ప్రతి సంవత్సరం జపాన్ ప్రభుత్వం అధికారికంగా జరిపే ఉత్సవం ఇది. గత ఏప్రిల్ నుంచి రాబోయే ఏప్రిల్ వరకు ఎవరికైతే ఇరవై ఏళ్లు నిండుతాయో వారంతా ఎవరి టౌన్లో వారు గవర్నమెంటు ఆఫీసుకు జపాన్ సంప్రదాయ వస్త్రాలు కిమోనో (ఫొటోలో వేసుకున్నవి) ధరించి వెళ్లాలి. వారందరినీ ఉద్దేశించి అధికారులు జపాన్ ప్రభుత్వ చట్టాల ప్రకారం ఇక నుంచి మీరు పెద్దలు. మీపై బాధ్యతలు కూడా పెరుగుతాయి అంటూ కాస్త మంచి మాటలు చెప్పి చిన్న జ్ఞాపిక వంటి బహుమతులు ఇచ్చి పంపుతారు.  ప్రపంచంలో ఇంత పద్ధతిగా పిల్లలకు బాధ్యతల గురించి తెలపడం ఇక్కడే ఉంటుంది. ఈసారి 12 లక్షల మంది ఇరవై ఏళ్లు పూర్తిచేసుకున్నారక్కడ.
 

మరిన్ని వార్తలు