గడ్డిపొదలో బాతుపిల్ల

25 Jan, 2015 00:04 IST|Sakshi
గడ్డిపొదలో బాతుపిల్ల

పిల్లల కథ
భూపాల్, నటుడు, రచయిత

చెరువు అంచుకు ఊరు ఉంది. ఆ ఊరుకొనకు ఒక ఇంట్లో బాతులున్నాయి. బాతు ఒకటి పది పిల్లలు చేసింది. ఒకరోజు అది తన పది పిల్లలను తోల్కొని చెరువుకు పొయ్యి ‘ఈత’ కొట్టేది ఎట్లనో నేర్పించవలెనని అనుకుంది. తెల్లారెగట్ల పిల్లలను తోల్కొని చెరువు దిక్కు నడిచింది. ఆ బాతు పిల్లలన్నింట్ల ‘బేక్‌బేక్’ అనే పేరున్న పిల్ల.... మహా అల్లరి చేస్తుంటది. ఒక్కతాన ఉండదు. కొంటె చేష్ట లెక్కువ.అన్ని పిల్లలు ఒక తాన చేరి తల్లి ముంగటనే ఈత కొడుతుంటే.... ఈ ‘బేక్ బేక్’ తల్లిని కాదని మెల్లెగ పక్కకు జారుకుంది. చెరువు నడుమకు పోయింది.
 
చెరువుల అక్కడక్కడ గడ్డిపొదలున్నాయి. తుంగ పెరిగివుంది. బేక్‌బేక్‌కు ఉషారు ఎక్కువైంది. నీళ్లల్ల ఈదుకుంట, ఎగురుకుంట గడ్డి పొదల దిక్కుపొయ్యింది. అనుకోకుండ పొదల చిక్కుకుంది. దాన్ని గడ్డి చుట్టేసింది. బయటకు యెల్దామంటే కష్టమైంది. ఇగ ఏం జెయ్యాలెనో తోచక అది ఏడువసాగింది. ఆ ఏడుపు చప్పుడు అక్కడికి కొంచెం దూరమున్న చెరువు గట్టుకు వినపడుతుంది. ఆ గట్టు అంచున తొర్రలో ఉన్న ఎండ్రికాయ బయటకొచ్చి చూసింది. బేక్‌బేక్ బాధ దానికి తెలిసింది. మెల్లగా ఈదుకుంటూ దాని దెగ్గరికి పోయి, తన కత్తెర చేతులతో గడ్డిని కత్తిరించింది. బేక్‌బేక్ బయటికొచ్చింది.

నవ్వుతూ కృతజ్ఞతలు చెప్పింది. ఇక్కడ ఇట్లావుంటే....
 అక్కడ తల్లిబాతు, మిగతా పిల్లలు బేక్‌బేక్ కోసం దేవులాట మొదలుపెట్టినయి. తల్లిబాతు ఆ పిల్లలను ఒకతాన్నే ఉండుమని చెప్పి, దేవులాడుకుంట గడ్డి పొదల దిక్కువస్తుంది. అప్పుడే తనూ బయలుదేరిన బేక్‌బేక్ తల్లిని చూసి ఎంతో మురిసిపోయింది.
 తల్లి తిడుతుందేమోనని ముందే తన పొరపాటు ఒప్పుకుంది. క్షమించమంది. ఎండ్రికాయ చేసిన సహాయం గురించి చెప్పింది. ప్రమాదం తప్పింది అన్నది. ఇప్పటి నుంచి భద్రంగా వుంటాననీ, పిచ్చిపిచ్చి లొల్లిమానుకుంటాననీ అన్నది.  

మరిన్ని వార్తలు