మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఇవి ఉన్నాయా?!

3 Aug, 2014 01:24 IST|Sakshi
మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఇవి ఉన్నాయా?!

వాయనం

హ్యాండ్ బ్యాగ్ లేకుండా బయటకు వెళ్లే మహిళ ఇప్పుడెక్కడా కనిపించదు మనకి. ఫ్యాషన్‌లో హ్యాండ్‌బ్యాగ్ కూడా భాగమే. ఏ డ్రెస్ మీదకి ఎలాంటి హ్యాండ్ బ్యాగ్ బాగుంటుంది, ఏ మోడల్ బాగుంటుంది, ఎంత మోడ్రన్‌గా ఉండాలి అంటూ రకరకాల అంశాలను పరిశీలించి మరీ కొంటారు.

కానీ బయటికెళ్లేటప్పుడు ఆ బ్యాగ్‌లో ఏముండాలి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతుంటారు. అది సరికాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదు నేటి రోజుల్లో. కాబట్టి ప్రతి మహిళా తనను తాను కాపాడుకోవడానికి తమ బ్యాగ్‌లో  కొన్ని వస్తువుల్ని ఉంచుకుని తీరాలి.

హ్యాండ్‌బ్యాగ్‌లో కచ్చితంగా ఉండాల్సింది... డైరీ. అందులో పోలీస్ స్టేషన్, ఉమెన్స్ సెల్, హాస్పిటల్, ఇంట్లో వాళ్ల నంబర్లు, ఆఫీసు-కొలీగ్స్ నంబర్లు... అన్నీ ఉండాలి. కొన్నిసార్లు వాళ్లకు సిగ్నల్ అందకపోవచ్చు. వాళ్ల ఫోన్ ఆఫ్ చేసి ఉండొచ్చు. కాబట్టి... ల్యాండ్‌ఫోన్స్ ఉంటే కనుక ఆ నంబర్లు కూడా ఉంచుకోవడం మంచిది.
ఓ పెన్ను, పుస్తకం కూడా ఉంచుకోండి. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఫోన్ చేయలేని, కేకలు పెట్టలేని పరిస్థితి ఉంటే ఈ రెండూ ఉపయోగపడతాయి. కొన్ని నెలల క్రితం ముంబైలో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఓ గదిలో బంధించారు. సెల్‌ఫోన్ లాగేసుకున్నారు. ఆమె దగ్గర ఉన్నది పెన్ను, పుస్తకం మాత్రమే. కాగితాలు చింపి, వాటి మీద తనను కాపాడమంటూ రాసి ఓ చిన్న గుంత గుండా బయటకు విసిరింది. వాటిని చూసిన ఓ వ్యక్తి పోలీసుల సాయంతో ఆమెను కాపాడాడు. ఏదెలా ఉపయోగపడుతుందో చెప్పలేం కదా!
మీరు వాడే ఫోన్ కాకుండా ఇంకో ఫోన్‌ని కూడా ఉంచుకోవడం మంచిది. సెలైన్స్‌లో ఉంచి బ్యాగులో వేసుకోండి. చేతిలో ఫోన్ ఎవరైనా లాగేసుకున్నా, ఆ ఫోన్ మిమ్మల్ని కాపాడవచ్చు. ఫుల్‌గా చార్జింగ్ పెట్టి తీసుకెళ్లడం మర్చిపోకండి!
స్విస్ నైఫ్, పెప్పర్ స్ప్రే లాంటి దేదైనా ఉంచుకోవడం కూడా అత్యవసరం. అవి కొనుక్కోలేకపోతే కనీసం కాసింత కారప్పొడి అయినా మూటగట్టి పెట్టుకోండి!
కేవలం రక్షణకు అవసరమైనవే కాదు, మామూలు సమస్యలు కూడా వస్తుంటాయి. ఉదాహరణకు... నడు స్తుంటే చెప్పు తెగిపోవచ్చు. హ్యాండ్‌బ్యాగ్ స్ట్రాప్ ఊడిపోవచ్చు. కుట్టించుకోవడానికి షాపుకెళ్లేవరకైనా మేనేజ్ చేయాలి కదా! అందుకే చిన్న క్విక్ ఫిక్స్ వేసుకుంటే మంచిది కదా!
అలర్జీలు, సడెన్‌గా అటాక్ చేసే ఆరోగ్య సమస్యల వంటివి ఉంటే.. ఆ మందులెప్పుడూ బ్యాగ్‌లోనే ఉండాలి.
ఇవన్నీ వేస్తే బ్యాగ్ ఓ చిన్న సైజు దుకాణంలా తయారవుతుంది అనుకోవచ్చు. వీటిని మోయాలంటే కచ్చితంగా పెద్ద బ్యాగే వాడాలి అని కూడా అనుకోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆ మాత్రం జాగ్ర త్తలు తీసుకోక తప్పదు మరి!

మరిన్ని వార్తలు