షోలేభరణం

21 Jan, 2018 00:07 IST|Sakshi

 లాఫింగ్‌ గ్యాస్‌

క్లాస్‌ సినిమాలు ఉంటాయి. మాస్‌ సినిమాలు ఉంటాయి. ఈ రెండిటినీ కలిపి నాటకం తయారుచేస్తే? తయారుచేయడమేమిటి? ఆల్రెడి తయారైపోయింది. ‘అదుర్స్‌’ అనే నాటకసంస్థ క్లాస్‌ సినిమా శంకరాభరణం,  మాస్‌ సినిమా షోలేలను కలిపి ‘షోలేభరణం’ అనే నాటకాన్ని తయారుచేసి ప్రతి ఊళ్లో ప్రదర్శిస్తుంది. ఈ  నాటకాన్ని మీరు కూడా చూడండి... ‘‘రేయ్‌...గబ్బర్‌ ఎక్కడ దాగావురా? రారా బయటికి’’  అరుస్తున్నాడు ఠాకూర్‌. గబ్బర్‌ రావడం ఏమిటోగానీ... ఈ అరుపులకు భయపడిన బసంతి ఇంటి నుంచి పరుగెత్తుకు వచ్చింది. ‘‘మీరు గబ్బర్‌...గబ్బర్‌ అని అరవడం వల్ల...మీకు బీపి వస్తుందే  తప్ప గబ్బర్‌ రాడు. వాడు గుర్తుకు వచ్చినప్పుడల్లా ... ఎవడి పాపాన వాడే పోతాడు అనుకోండి చాలు....ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి’’ అని సలహాతో పాటు గ్లాసులో నీళ్లు కూడా ఇచ్చింది బసంతి.

‘నిజమే’ అనిపించింది ఠాకూర్‌కు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని రోజులు ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్లాలి అనిపించింది. ఆంధ్రాలో ఉన్న తన ఫ్రెండ్‌ అప్పారావు గుర్తుకు వచ్చాడు. వెంటనే పనిమనిషిని పిలిచి...  ‘‘నేను మనశ్శాంతి కోసం రేపు ఆంధ్రా వెళుతున్నాను. ఇల్లు జాగ్రత్త’’ అని చెప్పాడు. ‘‘మనశ్శాంతి ఎవరండీ...మన విజయశాంతికి  ఏమవుతారు?’’ ఆరా తీశాడు పనివాడు. తల పట్టుకున్నాడు ఠాకూర్‌. రెండు రోజుల తరువాత...ఆంధ్రాలో ఉన్న స్నేహితుడి ఇంటికి చేరుకున్నాడు ఠాకూర్‌. ‘‘ఠాకూర్‌జీ...మీకో విషయం తెలుసా? ఈ ఊళ్లో శంకరాభరణం శంకరశాస్త్రి అనే గొప్ప గాయకుడు ఉన్నాడు. ఆయన నోటి నుంచి శంకరాభరణం రాగం వింటే జన్మ ధన్యమైపోయినట్లే’’ అన్నాడు ఠాకూర్‌ స్నేహితుడు అప్పారావు.

ఇద్దరు కలిసి శంకరశాస్త్రి  ఇంటికి వెళ్లారు. ఆయనతో చాలాసేపు మాట్లాడిన తరువాత ఠాకూర్‌ మైండ్‌లో ఒక ఐడియా ఫ్లాష్‌లా మెరిసింది. ‘‘అయిపోయావురా...గబ్బర్‌ ’’ కసిగా అనుకున్నాడు ఠాకూర్‌. రెండురోజుల తరువాత రామ్‌ఘడ్‌లోని ఠాకూర్‌ ఇంటికి గెస్ట్‌గా వచ్చాడు శంకరశాస్త్రి. ఈలోపు ఒక పుకారు చాలా స్పీడ్‌గా చుట్టుపక్కల  ఊళ్లలో షికారు చేసింది. ‘‘గబ్బర్‌సింగ్‌ను మట్టుబెట్టడానికి ఆంధ్రా నుంచి శంకరశాస్త్రి అనే షూటర్‌ వచ్చాడు’’ అనేదే ఆ పుకారు.  ఈ పుకారు గబ్బర్‌ వరకు చేరింది. ‘‘అరేవో సాంబ... ఆ శంకరశాస్త్రిని కిడ్నాప్‌ చేసుకొని రండి’’ అని ఆర్డర్‌ వేశాడు గబ్బర్‌సింగ్‌. గబ్బర్‌గ్యాంగ్‌ అలాగే చేసింది. ఇప్పుడు శంకరశాస్త్రి గబ్బర్‌ ముందు ఉన్నాడు. ‘‘ ఏమయ్యా పెద్దమనిషీ...నన్ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి వచ్చావట కదా! ఎన్ని హృదయకాలేయాలు నీకు!’’ నలుదిక్కులు అదిరేలా  గర్జించాడు గబ్బర్‌. ‘‘మీరు చాలా పొరబడుతున్నారు. నాకు సంగీతం గురించి తప్ప ఎన్‌కౌంటర్ల గురించి ఏమీ తెలియదు’’  కంచుకంఠంతో అన్నాడు శంకరశాస్త్రి.‘‘నువ్వు గాయకుడివి అంటే నాకెందుకో డౌటుగా ఉంది. ఏదీ... ఒకరాగం పాడు చూద్దాం’’ గద్దించాడు గబ్బర్‌.

ఠాకూర్‌ ఇచ్చిన ఐడియా గుర్తుకు వచ్చింది శంకరశాస్త్రికి. ‘‘జస్ట్‌ రెండు రోజుల క్రితమే...‘మంకినీ’ అనే కొత్తరాగాన్ని సృష్టించాను. అది మీకు వినిపిస్తాను’’ అని ఆ రాగాన్ని వేడివేడిగా వినిపించాడు శంకరశాస్త్రి.
ఆ రాగం విన్నాడో లేదో గబ్బర్‌ గుర్రం దిగి కోతిలా గంతులు వేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత...కనిపించిన చెట్టును, గుట్టను ఎక్కడం మొదలుపెట్టాడు...అటువైపుగా కోతుల గుంపు ఒకటి వస్తే  అందులో   కలిసిపోయి ‘కోతిలో కోతినై’ అని పాడుకుంటూ  అడ్రస్‌ లేకుండా పోయాడు. రామ్‌ఘడ్‌కు గబ్బర్‌సింగ్‌ పీడ విరగడైంది. ఠాకూర్‌ కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.      నాటకం పూర్తయింది.  స్టేజీపై  టమాటాలు, గుడ్లు వరదలా  వచ్చిపడ్డాయి. స్టేజీపై గుడ్లు, టమాటాలు ఎందుకు పడ్డాయి? అనే కదా మీ డౌటు! విషయం ఏమిటంటే... ఈ నాటకం ఒకవైపు ‘శంకరాభరణం’ వీరాభిమానులకు, మరోవైపు ‘షోలే’ వీరాభిమానులకు విపరీతంగా కోపం తెప్పించింది. వాళ్లు చాలా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ  నాటకం చూడ్డానికి వచ్చారు. అది వారి అంచనాలకు దూరంగా ఎక్కడో ఉంది.  దాని ఫలితమే... ఈ టమాటాలు, కోడిగుడ్లు! ‘‘స్టేజీ మీద గుడ్లు, టమాటాలు పడ్డాయంటే ప్రేక్షకులకు కోపం వచ్చినట్లే అని అర్థం. ఈ నిజం తెలిసి కూడా ఈ నాటకం కంపెనీ వాళ్లు ఊరూరా ఎందుకు  తిరుగుతున్నట్లు. ఇది పిచ్చిపనా? లేకుంటే దీనివెనకాల  ఏదైనా పరమార్థం దాగి ఉందంటావా? కరెక్ట్‌ ఆన్సర్‌ ఇస్తే...నిన్ను ప్రతి రోజూ మెట్రో రైలు ఎక్కిస్తా’’ అంది విక్రమార్కుడి భుజాల మీద ఉన్న శవం. ‘‘నీ ప్రపోజల్‌ బాగుంది. నేను ఈమధ్య షోల్డర్‌ పెయిన్‌తో బాధ పడుతున్నాను. నిన్ను మోయలేక ఛస్తున్నాను. ఇక నుంచి ఎక్కడికి వెళ్లినా మెట్రోరైళ్లోనే వెళదాం. నువ్వు నా  పక్క సీట్లోనే కూర్చోవాలి’’ అన్నాడు విక్రమార్కుడు.

‘‘అదిసరేగానీ...నేను అడిగిన సందేహానికి జవాబు చెప్పు’’ అడిగింది భుజం మీది శవం.‘‘స్టేజీ మీద టమాటాలు, కోడిగుడ్లు పడుతున్నాయని తెలిసీకూడా ఆ డ్రామా కంపెనీవాళ్లు ఊరూరా తిరగడానికి కారణం టమాటాలు,కోడిగుడ్లే’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు’’ అయోమయంగా అంది శవం.‘‘అయితే విను’’ అంటూ ఇలా వివరంగా చెప్పాడు విక్రమార్కుడు...‘‘ చరిత్రలో ఎన్నడూ లేనట్లు ఆ  సంవత్సరం  ప్రొడక్షన్‌ ఎక్కువై టమాట, కోడి గుడ్ల ధరలు ఘోరంగా పడిపోయాయి. కృత్రిమంగానైనా సరే వీటి ధరలను అమాంతంగా  పెంచడం ఎలా? అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ‘షోలేభరణం’ అనే నాటకం. ఈ నాటకం పుణ్యమా అని టమాటాలు, గుడ్ల డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నాటకం ఆడిన ప్రతి ఊళ్లోనూ ప్రజలు టమాట, గుడ్లను బ్లాక్‌లో కొనడానికి కూడా వెనకాడలేదు. నాటకం వల్ల ప్రేక్షకులను రంజింప చేయడమే కాదు...టమాట, కోడిగుడ్ల డిమాండ్‌ కూడా పెంచవచ్చునని ప్రయోగాత్మకంగా నిరూపనైంది. అదీ విషయం!’’
 – యాకుబ్‌ పాషా 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా