జాతీయాలు

13 Feb, 2016 22:32 IST|Sakshi

ఇప్పటిదా అప్పటిదా...
ఇక్ష్వాకుళ కాలం నాటిది!
చాలా పాత విషయం, చాలా పాత వస్తువు, వయసు పైబడిన వ్యక్తులు... ఇలాంటి విషయాలలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం చూస్తుంటాం.
 ‘ఇది నిన్న మొన్నటి వస్తువు కాదు... ఇక్ష్వాకుల కాలం నాటిది’... ‘అదేదో నిన్నగాక మొన్న జరిగిన విషయం అన్నట్లు చెబుతావేం? ఇక్ష్వాకుల కాలం నాటిది’ ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. అసలా మాట ఎలా వచ్చింది?
 
వైవశ్వతుడు-శ్రద్ధాదేవి దంపతులకు కలిగిన తొమ్మిది మంది సంతానంలో ఇక్ష్వాకుడు పెద్దవాడు. శ్రీరాముడి వంశానికి ఇతడే మూల పురుషుడు. ఇక్ష్వాక రాజు ఎప్పటి వ్యక్తో కాబట్టి... ‘చాలా పాత’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
 
 మర్కట ముష్టి!
 ఈ జాతీయాన్ని రక రకాలుగా ఉపయోగిస్తారు.
 ‘చాలా మొండి మనిషి. పట్టిందే పట్టు. మర్కట ముష్టి!’
 ‘నువ్వు  ఆయనకు దానధర్మాల గొప్పదనం గురించి ఎంతసేపు చెప్పినా ఆయన మనసు మారదు. అది మర్కట ముష్టి. ఒక్క గింజ కూడా రాలి పడదు!’

 ఒక విషయం మీద చాలా పట్టుదలగా, మొండిగా వ్యవహరించే వారి విషయంలోనే కాదు... ‘నేను సంపాదించిన దాంట్లో ఒక్క చిల్లిగవ్వను కూడా ఇతరులకు ఇవ్వను’ అనుకునే పరమ పిసినారుల విషయంలో కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
 మర్కటం అంటే కోతి. ముష్టి అంటే పిడికిలి. కోతి తన పిడికిట్లో ఏదైనా పట్టుకుంటే పొరపాటున కూడా వదలదు. దాన్ని ఎంత బతిమిలాడితే అంతగా పట్టు  బిగిస్తుంది. బెదిరిస్తే తిరిగి మనల్నే బెదిరిస్తుంది.
 స్థూలంగా చెప్పాలంటే... కోతి పిడికిలి బిగించిందంటే, ఆ పిడికిలిని తెరిపించడం చాలా కష్టమైన పని. అందుకే పట్టుదలకు, పీనాసితనానికి ఆ మాట స్థిరమై ఉండిపోయింది.
 
 ఏమైంది... నలభై అయింది!
‘ఇంతకీ విషయం ఏమైంది?’
 ‘ఏమవుతుంది? సరిగ్గా నలభై అయింది!’
 ‘ఏ పని చేసినా విజయం సాధించాలి... నలభై సాధించడం కాదు’...  ఇలాంటి మాటలు మన వాడుకలో ఉన్నాయి.
 ఇక్కడ ‘నలభై’ అనేది కేవలం సంఖ్య కాదు... పరాజయం, పరాభవానికి ప్రతీక.
 అలా ఎలా అవుతుంది? అసలు నలభైకీ  పరాజయానికీ ఉన్న లింక్ ఏమిటి?
 ఏమిటంటే, మనకున్న తెలుగు సంవత్సరాల పేర్లలో నలభయ్యవది... పరాభవ. అందుకే అపజయం, పరాభవం, అవమానం వంటి విషయాలకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
 
  ఇదిగో గుర్రం అదిగో మైదానం!
 ఒక వస్తువు నాణ్యత, శక్తి  గురించి అప్పటికప్పుడు తేల్చుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఈ మాటను వాడుతారు.
 ‘‘నాణ్యత గురించి ఎలాంటి సందేహం అక్కర్లేదు... ఇదిగో గుర్రం అదిగో మైదానంలా ఎలాంటీ పరీక్ష అయినా చేసుకోవచ్చు.’’
 ‘‘ఈ గుర్రంలో చేవ ఉందా?’’ అనే ప్రశ్నకు- ‘‘చాలా ఉంది. భేషుగ్గా ఉంది’’ లాంటి మాటలు సృంతృప్తిని ఇవ్వవచ్చును గానీ... ఎక్కడో ఒక మూల చిన్న సందేహమేదో కదలాడుతూనే ఉంటుంది, ‘అతను చెప్పింది నిజమేనా?’ అని.
 మాటలు కాదు... చేతలు ముఖ్యమను కున్నప్పుడు... పరీక్ష మాత్రమే సంపూర్ణ సంతృప్తిని ఇస్తుంది. గుర్రంలో ఉన్న చేవను తెలుసుకోవడానికి మైదానంలో ఒక్కసారి సవారీ చేస్తే సరిపోతుంది కదా!

మరిన్ని వార్తలు