నివృత్తం: రామాయణమంతా విని, రాముడికి సీతేమౌతుందన్నట్టు...

7 Jun, 2014 23:12 IST|Sakshi
నివృత్తం: రామాయణమంతా విని, రాముడికి సీతేమౌతుందన్నట్టు...

ఒక ఊళ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు రాత్రీపగలూ కష్టపడి పని చేస్తుండేవాడు. ఓసారి ఆ ఊళ్లో రామాయణ కథాశ్రవణం ఏర్పాటు చేశారు. దానికి ఇతగాడు కూడా వెళ్లాడు. అయితే బాగా అలసిపోయి ఉండటంతో ఏమీ వినకుండా నిద్రపోయాడు. వారం రోజుల పాటు అలా వెళ్తూనే ఉన్నాడు, నిద్రపోతూనే ఉన్నాడు. చివరి రోజున శ్రవణం ముగిశాక ఓ ఆసామి... ‘‘అసలు నువ్వు ఒక్కరోజైనా రామాయణం విన్నావా, నిద్రపోతూనే ఉన్నావ్’’ అని అన్నాడు. దానికి ఇతడు... ‘‘ఎందుకు వినలేదూ... బాగా విన్నాను. చక్కగా అర్థం చేసుకున్నాను. కానీ ఒక్కటే సందేహం. రాముడికి సీతేమవుతుంది?’’ అన్నాడు. దాంతో అందరూ ఘొల్లుమన్నారు. అప్పట్నుంచీ ఈ మాట వాడుకలోకి వచ్చింది. చెప్పినదంతా విని కూడా ఎవరైనా అర్థం లేని ప్రశ్నలు అడిగినప్పుడు ఈ సామెత వాడుతుంటారు.  
 
 సీమంతం ఎందుకు చేస్తారు?
 కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. ఆమెను అలా ఉంచేందుకుగాను భర్త రెండు నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిలో ఒకటి దోహదం. అంటే గర్భిణి అయిన భార్య కోరికలను తెలుసుకుని తీర్చడం. రెండోది సీమంతం. అంటే తల్లి కాబోతున్న భార్యను అపురూపంగా చూసుకోవడం. గర్భిణిగా ఉన్నకాలంలో ఐదు లేక ఏడో నెలలో సీమంతాన్ని జరుపుతారు.  సీమంతం రోజున గర్భవతికి చేతినిండా గాజులు వేస్తారు. ఎందుకంటే... గర్భం ధరించిన స్త్రీ గర్భకోశంలోని జీవనాడుల మీద తగినంత ఒత్తిడి పడాలి. దానివల్ల సుఖప్రసవం అవుతుంది. చేతుల్లోని నరాలకి, గర్భకోశానికి సంబంధం ఉండటం వల్ల గాజులు తొడగడం ద్వారా తగినంత ఒత్తిడి కలిగించవచ్చని ఓ నమ్మకం.

మరిన్ని వార్తలు