తొండనూరులో వెల్లివిరిసిన వైష్ణవం

29 Apr, 2018 00:41 IST|Sakshi

సహస్రాబ్ది ధారావాహిక – 27

రామానుజ మార్గం 

బ్రహ్మరాక్షసిని పారద్రోలి రాజును ఆకర్షించి అందరి మతం మార్చాడని జైనులకు రామానుజుని మీద విపరీతమైన కోపం వచ్చింది. జైన గురువులు రామానుజుడు నరసింహాలయంలో ఉన్నారని తెలిసి అక్కడికి దండెత్తి వెళ్లారు. ఒకేసారి పన్నెండు వేలమంది రామానుజుడిని శాస్త్ర చర్చకు రమ్మన్నారు. ముందు తమను జయించాలని, ఆ తరువాతే రాజుతో మాట్లాడాలని సవాలు చేశారు. ఓడిపోతే తమ మార్గాన్ని, మతాన్ని అనుసరించాలన్నారు. రామానుజులు వారి సవాల్‌ను స్వీకరించారు. ‘మేమంతా ఒకేసారి ప్రశ్నిస్తాం. అన్నింటికీ సమాధానాలు చెప్పాల’ని వారు నిబంధన విధించారు. వచ్చిన జైనులలో దిగంబరులూ ఉన్నారు. శ్వేతాంబరులూ ఉన్నారు. రామానుజ యతీంద్రుడికి ఒక కట్టుబాటు ఉంది. దిగంబరులను చూడరు, మాట్లాడరు. కనుక ‘‘నా చుట్టూ తెర కట్టండి, మీరు చుట్టూ చేరి ప్రశ్నలు అడగండి. నా నుంచి సమాధానాలు వినిపిస్తాయి వినండి. నా తెరలోకి తొంగి చూస్తే మీకే నష్టం జాగ్రత్త’’ అన్నారు. 

రామానుజులు కనిపించకుండా తెర కట్టారు. చర్చ మొదలైంది. వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. వేలాది గొంతులు వినిపిస్తున్నాయి. ఒక్కో జైనుడికి ఒక్కో గొంతుక వినిపిస్తున్నది. సూటిగా ఒక్కో ప్రశ్న వేసిన వ్యక్తికే వినిపించే సమాధానం దూసుకుని వస్తున్నది. జైన మునులు ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతున్నదో తెలియడం లేదు. ప్రశ్నించడమో ప్రతిపాదించడమో జరిగిందో లేదో, సమాధానాలు శరాల్లా వస్తున్నాయి. శరవేగంగా ప్రతివాదాలు, ఖండన మండనలు వెలువడుతున్నాయి. శాస్త్ర, పురాణ ప్రమాణాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల వాక్యాలు, ఈటెల్లా వస్తున్నాయి. రాను రాను జైనుల ప్రశ్నాస్త్రాలు వడిసిపోతున్నాయి. నిరస్త్రమై నిస్తేజమై పడిపోతున్నాయి. అడగడానికేమీలేక జైనుల నోళ్లు మూతబడుతున్నాయి.  కొందరికి అనుమానం వచ్చింది. తెరలోపల ఏం జరుగుతున్నది? ఒక్కవ్యక్తి ఇన్ని గొంతులతో ఏవిధంగా మాట్లాడుతున్నారు? ఇది వాస్తవమా లేక కనికట్టా? అని తెరతీసి చూశారు. చూసిన వారు వెంటనే మతిభ్రమించినట్టు పడిపోయారు. పిచ్చిబట్టినట్టు పరుగెత్తిపోయారు. 

‘‘ఏమైంది.. ఏం కనిపించింది..’’ అని వారిని అడిగితే ‘‘అక్కడ రామానుజ వీర వైష్ణవ తేజం ప్రజ్వరిల్లుతున్నది. వేలాది పడగల ఆదిశేషుడై రామానుజుడు విజృంభించి వాదనా కదన రంగంలో వీరవిహారం చేస్తున్నాడు. ఆ భయానక దృశ్యం చూడగానే మాకు మతిపోయింది. నాతోపాటు చూసిన వారు, తెరతీయడానికి భయపడేవారు, తెరతీసి భయపడి పారిపోయినారు. వేలాది ప్రశ్నల వేగాన్ని బట్టి సమాధాన సహస్రాలు మహాగ్ని జ్వాలలై వచ్చాయి’’ అని చెప్పుకున్నారట. న్యాయనిర్ణేతగా ఉన్న రాజు వాద ప్రతివాదాలు వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రశ్నలూ ప్రతిపాదనలూ ముగియగానే తెరవెనుక ఆదిశేషుని అవతారమైన యతిరాజు ప్రత్యక్షమైనాడు. తెరతొలగగానే దివిలో జ్ఞాన సూర్య సహస్ర కాంతులతో రామానుజుడు దుర్నిరీక్షుడై కనిపించాడు. కాసేపటి తరువాత జైన శాస్త్రవేత్తలు, పండితులు, తర్కశాస్త్రజ్ఞులు మౌనం పాటించారు. ఆ మౌనం పరాజయానికి ప్రతీక కనుక జైనులు పరాజితులని రాజు ప్రకటించారు. తొండనూరులో జైనుల ఆధిక్యం సమసిపోయి వైష్ణవం వెల్లివిరిసింది.  

జలాశయ నిర్మాణ నిపుణ రామానుజ
ఆ ప్రాంతంలో అనావృష్టిని నివారించడానికి యోగ్యమైన స్థలంలో కరకట్ట నిర్మించి జలాశయాన్ని ఏర్పాటు చేయాలని రామానుజులు సంకల్పించారు. సహజమైన పరిసరాల్లో తటాకానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేశారు. అటూ ఇటూ సహజంగా ఉన్న కొండలు కొన్ని బండరాళ్లు పేర్చితే ఆనకట్ట సులువుగా తయారవుతుందని, అందుకు సాంకేతికంగా ఏం చేయాలో కూడా రామానుజుడు వివరించారు. రాజు విష్ణువర్ధనుడు ఆశ్చర్యపోయారు. యతిరాజులు గొప్ప సాంకేతిజ్ఞులు కూడా అని అర్థమైంది. రామానుజుడు ఆ తటాకానికి తిరుమల రాయ సాగరం అని నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో ఈ చెరువు ద్వారా ఏ మేరకు పంట పొలాలకు నీరు చేరుతుందో రామానుజులు అంచనాను వివరించారు. ఆనకట్ట నిర్మాణమై జలాశయంలో నీరు నిండిన తరువాత ఆశయం నెరవేరి ఆ ప్రాంతమంతా సుభిక్షమైంది.  

తిరునారాయణుని పునఃప్రతిష్ఠ
ఓరోజు ఉదయాన్నే రామానుజులు అనుష్టానం కోసం ఊర్థ్వ పుండ్రాలను దిద్దుకోవడానికి తిరుమణి పెట్టె తెరిస్తే తిరు (శ్రీ)మణి (మన్ను) నిండుకుంది. ఎలా అని చింతిస్తున్న రామానుజులకు తిరునారాయణుడి మాట వినిపించింది.... ‘‘నేను ఓ పదిమైళ్ల దూరంలో ఉన్నాను. నా సన్నిధి మూతబడిపోయి ఉంది. నన్ను బయటకు తీసి నిలబెట్టవయ్యా యతిరాజా’’ అని. వెంటనే బయలుదేరి ఆ కీకారణ్యంలో చెట్లను కొట్టిస్తూ దారి చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలోనే అటూ ఇటూ కొమ్మలు గీరుకుపోయి శరీరమంతా నెత్తుటి గాయాల రేఖలు ఏర్పడ్డాయి. (ఈనాటికీ శ్రీరామానుజుని ఉత్సవ విగ్రహానికి చారలు గీతల మచ్చలు, అభిషేక తిరుమంజనాల సమయంలో కనిపిస్తాయంటారు.) స్వామికోసం వెతుకుతూనే ఉన్నారు. ఎంతకూ కనిపించడం లేదు. ‘‘ఇక్కడే ఓ పుట్టలోపల సరిగా చూడు అక్కడ ఉన్నాను’’ అని మళ్లీ అశరీర వాణి వినిపించింది. సంపెంగ చెట్టు, దానికి ఉత్తరాన కొన్ని అడుగులదూరంలో బదరీ వృక్షము (రేగు చెట్టు) దానికి పడమరలో పుట్ట కనిపించింది. పుట్టను గునపాలతో కొడితే పాములకు దెబ్బ తగులుతుందన్న భయంతో పాలు పెరుగు తెప్పించి పుట్టపై పోయించారాయన. మన్ను కరిగి తిరునారాయణుడి దివ్యమంగళ విగ్రహం బయటపడింది. ఆ ప్రాంతంలో ‘మేలుకోట’ (ఈనాటి మేల్కోటే, కర్ణాటక) అనదగిన స్థలంలో భవ్యమైన ఆలయాన్ని రామానుజుని ఆలోచనలకు అనుగుణంగా శాస్త్రబద్ధంగా రాజు నిర్మింపజేశాడు. తిరునారాయణమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. రాజుగారు తన కోశాగారంలో ఉన్న ఒక ప్రాచీన వజ్రకిరీటం ఆ మూర్తికి అలంకరించాలనుకున్నారు. కాని శ్రీవారి శిరస్సుకు సరిపోలేదు. 

అయితే ఆ కిరీటానికి తగిన విగ్రహం ఒకటి ఉండి ఉండాల్సిందే అని రామానుజులు అన్నారు. ప్రాచీనాలయాలు విధ్వంసం చేసి శత్రువులు కొందరు విగ్రహాల్ని ఎత్తుకుపోయి ఉంటారని కాలక్రమంలో చేతులు మారి ఆ విగ్రహం ఉత్తరాన దెహలీ (దిల్లీ) సుల్తానుల చేతికి చిక్కిందని జనం చెప్పుకుంటున్న విషయం రామానుజులకు తెలిసింది. విగ్రహ రహస్యం ఛేదించడానికి రామానుజులు ప్రార్థన చేశారు. ఏకాగ్ర చిత్తంతో సాగిన ధ్యానంలో ఆయన చతుర్భుజుడై శంఖ చక్రధారియైన శ్రీరామపిళ్లై మూర్తి అనీ రామానుజులకు స్ఫురించింది. శ్రీరామపిళ్లైని తిరిగి రప్పించడానికి రామానుజులు కొందరు శిష్యులతో దిల్లీ నగరానికి బయలుదేరారు. పాదుషాను కలిశారు. తాము నిత్యమూ ఆరాధించే భగవంతుని మూర్తి సుల్తాన్‌ కోశాగారంలో ఉందని, దానికి తమకు తిరిగి ఇప్పించాలని కోరారు. ‘మా దగ్గరే ఉన్నట్టు మీకే విధంగా తెలిసింది?’ అని అడిగారు. తిరునారాయణ మూలమూర్తి పుట్టలోంచి ఆవిష్కారమైన విషయం, తనకు ధ్యానంలో శ్రీరామపిళ్లై కనిపించిన సంగతి వివరంగా సుల్తాన్‌కు చెప్పారు ఆచార్యులు. రామానుజుని తేజస్సుకు సుల్తాను అబ్బురపడ్డారు. విగ్రహం కోసం తన భాండాగారాన్ని రామానుజులకు చూపమన్నారు. కాని అందులో ఈ విగ్రహం కనిపించలేదు. రామానుజాచార్యులు మరోసారి మహాధ్యానంలోకి వెళ్లిపోయారు. స్వామీ ఎక్కడున్నారు అని పరితపించారు. మనసులో సాక్షాత్కరించారు. పాదుషా కూతురితో ఆడుకుంటున్నానని చెప్పారు స్వామి. మరునాడు ఆ విషయం పాదుషాకు తెలిపారు. 
‘‘ఇక్కడే మీ దేవుడు ఉన్నట్టు మీకు ఏవిధంగా తెలిసింది?’’ అని అడిగారు. 

‘‘మాకు ధ్యానంలో స్ఫురించింది’’ అన్నారు. ‘‘ధ్యానంలో దైవం స్ఫురించిన మాట నిజమే అయితే మీరే పిలుచుకోండి. మేం అంతఃపురానికి వెళ్లం, మిమ్మల్ని వెళ్లనివ్వం. మీ దేవుడు కదా వస్తాడేమో చూద్దాం’’ అని నవ్వాడు సుల్తాన్‌. ‘‘వస్తే మాతో పంపిస్తారు కదా’’ అని రామానుజులు అడిగారు. నడిచి రావడం జరగనే జరగదనే నమ్మకంతో నిశ్చింతగా సుల్తాన్‌ ‘‘తప్పకుండా’’ అని హామీ ఇచ్చారు. సుల్తాన్‌ దర్బారులో పద్మాసనం వేసుకుని రామానుజుడు తదేక ధ్యానం చేశారు. శ్రీరామపిళ్లైని ప్రార్థించారు. ‘శ్రీరామపిళ్లై రా నాయనా’ అని మనసారా పిలిచారు. శ్రీకృష్ణుని యశోద ఆప్యాయత నిండిన స్వరంతో ‘‘వరుగ వరుగ విజ్ఞేవామననమ్బీ వరుగ విజ్ఞే’’ అని రామానుజుడు భక్తితో పిలిచినాడు. అంతఃపురంలో ఉన్న ఆ రమణీయ విగ్రహం తనంత తానే ఛెంగు ఛెంగున వచ్చి రామానుజుని ఒడిలో చేరింది. సుల్తాన్‌ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రామానుజుల కన్నులు ఆర్ద్రతతో జలమయమైపోయాయి. సరిగ్గా అదే సమయానికి అంతఃపురంలో విగ్రహం మాయం కావడం కలకలం రేపింది. యువరాణి ఆడుకునే ప్రియమైన విగ్రహం అదృశ్యమైందని ఫిర్యాదు అందింది. ఆయనకు అర్థమైపోయింది– రామానుజులు ఒడిచేరిన అత్యంత సుందరమైన ఆ విగ్రహం తన కూతురు మనసు హరించిందని ఇన్నాళ్లూ ఆడుకున్నదని. రాణికి ఆ విషయం చెప్పి, ఒక యతికి ఇచ్చిన విగ్రహం మళ్లీ వాపస్‌ తీసుకోవడం జరగదని, మాట తప్పలేనని కనుక దాని గురించి మరిచిపొమ్మని ఆదేశించాడు సుల్తాన్‌. 

సుల్తాన్‌ యంత్రాంగం చేసిన సాయంవల్ల శ్రీరామపిళ్లైతో రామానుజ పరివారం మళ్లీ దక్షిణానికి తిరుగు ప్రయాణం ప్రారంభించింది. మేల్కోట చేరుకున్నారు. సంపత్‌ కుమారుడని, శెల్వపిళ్లై (గారాబు తనయుడు) అని నామకరణం చేశారు. దివ్యసుందర చెలువ నారాయణ (తిరునారాయణ) ఆలయంలో ఒక ప్రత్యేక సన్నిధానాన్ని సంపత్‌ కుమారుడి కోసం నిర్మింపజేశారు రామానుజులు. తన ధ్యానంలో రామానుజాచార్యుల వారికి సజ్జెహట్టి బావిలో శ్రీదేవి భూదేవి (ఉభయ నాచ్చియార్లు) విగ్రహాలు, సంపెంగ చెట్టుకింద యదుగిరి అమ్మవారు కనిపించారు, వారిని రప్పించారు. నరసింహుని కొండలో పాండవ గుహలో విష్ణువర్ధనునికి దొరికిన పురాతనమైన వజ్రకిరీటం (వైరముడి) తెప్పించారు. ఆ కిరీటం శ్రీరామపిళ్లైకి సరిగ్గా సరిపోయింది. (ఆ విధంగా వజ్రకిరీటధారణ చేసిన ఆ రోజున ఇప్పడికీ వైరముడి ఉత్సవం ఏటేటా చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు.) సుదర్శనచక్రాన్ని పదిమంది ఆళ్వార్లను, తిరుక్కచ్చినంబి (కాంచీ పూర్ణులు), శ్రీమన్నాథమునులు, శ్రీ ఆళవందార్‌ (యామునాచార్యుల) విగ్రహాలను ప్రతిష్టించి తిరునారాయణపురం ఆలయాన్ని అత్యంత ప్రామాణికమైన నారాయణ క్షేత్రంగా నిలబెట్టారు రామానుజులు. మూలవరులు తిరునారాయణుడని, ఉత్సవమూర్తి శెల్వనారాయణుడని, తిరుమంజన బేరం (మూర్తి) నకువణ్‌ పుగళ్‌ నారాయణన్‌ అని, బలిబేరానికి వాళ్‌ పుగళ్‌ నారాయణన్‌ అనీ, శయనబేరానికి ననేఱళిల్‌ నారాయణన్‌ అని నమ్మాళ్వార్ల పాశురాల్లో ఉన్న నామాలను నిర్ధారించారు.  తను చిన్నతనం నుంచి చాలా ఇష్టపడిన శెల్వపిళ్లైని విడిచి తానుండలేనని చెప్పింది యువరాణి. భోజనం చేయక మంచినీళ్లు తాగక నిరశన వ్రతం పట్టింది. ఓ విగ్రహం మీద ఇంత ప్రేమ ఏమిటని పాదుషా ఎంత చెప్పినా వినలేదు. యతిరాజును ప్రార్థించి ఆ విగ్రహం తిరిగి తెచ్చుకుంటానని యువరాణి పట్టుబట్టింది. ఏమీ చేయలేక పాదుషా పల్లకీలో అమ్మాయిని భద్రతాదళంతో పంపించాడు. తిరునారాయణ పురం చేరేనాటికి శెల్వపిళ్లై ప్రతిష్ఠ, వారికి వజ్రకిరీట ధారణ జరగడం, అత్యంత వైభవంగా దైనందిన తిరువారాధనలతో మంగళ తూర్యరావాలతో, తిరువాయిమొళి తదితర ప్రబంధ పాశురాల అనుసంధానంతో శెల్వప్పిళ్లై అలరారుతున్న విషయం గమనించింది. శాస్త్రప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేసి నిత్యసేవలు అందుకున్న స్వామిని దరిచేరడం తీసుకుపోవడం సాధ్యం కాదని యువరాణికి అర్థమైంది. ఆ స్వామి విరహాన్ని తట్టుకోలేక ఆమె అక్కడే అసువులు బాసింది.  

రామానుజులు ఆమెలో విగ్రహం పట్ల ఉన్న అపరిమితమైన ఆర్తిని, ప్రగాఢ ప్రేమను గమనించి, ఆమె సామాన్యురాలు కాదని, గోదాదేవి అంతటి భక్తురాలని నిర్ధారించి, ఆమెకు లక్ష్మీదేవితో సమాన స్థానం కల్పించి బీబీ నాంచియార్‌ అనీ తులుక్కనాచ్చియార్‌ అని నామకరణం చేసి మేల్కోటే నిత్యపూజలలో ఆమె ప్రతిరూపాన్ని నిలబెట్టారు. ఆమెకు రొట్టెల నైవేద్యంతో ఆరాధనా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినారు రామానుజులు. అక్కడే తిరునారాయణుడి నిత్యారాధనోత్సవాలలో పాల్గొంటూ రామానుజులు నిత్యారాధనలో పాల్గొంటూ, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, రుతోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, కళ్యాణోత్సవ, అభిషేకోత్సవ, పఞ్చపర్వతోత్సవ, బ్రహ్మోత్సవ, పవిత్రోత్సవ, తిరునక్షత్రోత్సవాలను జరిపిస్తూ 12 సంవత్సరాలు గడిపారు. 

- ఆచార్య మాడభూషి శ్రీధర్‌

మరిన్ని వార్తలు