రాషోమోన్ చలనచిత్రం

20 Oct, 2013 03:55 IST|Sakshi
రాషోమోన్ చలనచిత్రం

సృజనం
 
 (1950లో జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా తీసిన ‘రాషోమోన్’ చలనచిత్ర చరిత్రలో ఒక అద్భుతం. ఒకే సంఘటనను వివిధ పాత్రల దృష్టి కోణాల నుండి చిత్రించటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ర్యూనోసుకె అకుటగవ రాసిన కథ ‘ఇన్ ఎ గ్రోవ్ (1922)’ రాషోమోన్‌కు ఆధారం. నేపథ్యం కోసం మరోకథ - రాషోమోన్ - కలిపాడు దర్శకుడు. రాషోమోన్: జపాన్ ప్రాచీన రాజధాని క్యోటో నగర సింగహద్వారం.)
 ‘ఇన్ ఎ గ్రోవ్’ కథ
 కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్లినవాడు పోలీస్ కమిషనర్ ముందు ఇచ్చిన
 
 వాంగ్మూలం:
 అవును మహాప్రభూ, శవం కనిపించింది. రోజూ వెళ్లినట్టే ఈ రోజూ కట్టెల కోసం వెళ్లాను. దట్టమైన అడవిలో కనిపించింది శవం. ఎక్కడో కచ్చితంగా చెప్పమంటారా? యమామిషా దగ్గిర. రహదారి నుండి 150 మీటర్ల లోపలికి.
 
 నీలిసిల్కు కిమోనోలో వెల్లకిలా పడుంది. క్యోటో స్టైల్లో తలకు కట్టుకున్న గుడ్డ నలిగిపోయింది. ఒకే ఒక్క దెబ్బతో ఖడ్గం గుండెలోకి దిగింది. పువ్వులు, వెదురు ఆకులు నెత్తుటితో తడిసి ఉన్నాయి.
 
 ఖడ్గం గాని మరేదైనా ఆయుధం గాని కనిపించలేదు.
 
 సీడర్ చెట్ల మొదట్లో, ఒక తాడు మాత్రం కనిపించింది. ఆ, జ్ఞాపకమొచ్చింది. ఒక దువ్వెన కూడా చూశాను. అంతే! హత్యకు ముందు అతడు చాలా ప్రతిఘటించి ఉంటాడు. అక్కడి ఆకులన్నీ నలిగిపోయి ఉన్నాయి.
 
 గుర్రమా? ఆ తోపులోకి మనిషి ప్రవేశించటమే కష్టం.  గుర్రం కూడానా!
 
 సంచార బౌద్ధ భిక్షువు వాంగ్మూలం:
 నిన్న మధ్యాహ్నం ఆ దురదృష్టవంతుణ్ని చూశాను - సెకియామా నుండి యమాశినాకు వెళ్లే దారిలో. అతడు సెకియామా దిశగా నడుస్తున్నాడు. అతడి వెంట గుర్రం మీద ఒక మహిళ ప్రయాణిస్తున్నది. ఆమె అతడి భార్య అని తరువాత తెలిసింది. ఆమె తలమీది స్కార్ఫుతో ముఖం కనిపించలేదు. లిలాక్ రంగు దుస్తులు ధరించింది. గుర్రం ఠీవిగా ఉంది. ఆమె ఎంత ఎత్తు అంటారా! సుమారు నాలుగడుగుల అయిదంగుళాలు. నేను బౌద్ధ భిక్షువును గనక, ఆమెను అంతకన్నా ఎక్కువ పరిశీలించి చూడలేదు. ఆ వ్యక్తి దగ్గిర ఖడ్గమూ, విల్లంబులూ ఉన్నాయి. ఆ అమ్ములపొదిలో సుమారు ఇరవై బాణాలుండొచ్చు.
 
 అతడి జీవితం అలా ముగుస్తుందని ఊహించలేదు. మానవ జీవితం నశ్వరము కదా! ఉదయం పరచుకున్న మంచులాగా, ఆకాశంలో మెరిసిన మెరుపులాగా క్షణకాలం కనిపించి మాయమైపోతుంది.
 
 పోలీస్ బంట్రోతు ఇచ్చిన వాంగ్మూలం:
 నేను ఒక వ్యక్తిని అరెస్టు చేశాను. అతడు పేరుమోసిన దోపిడీదొంగ. తాజోమారు. అప్పటికి గుర్రం పైనుండి జారి కిందపడ్డాడు. ‘అవటగుచి’ వంతెన మీద బాధతో మూలుగుతున్నాడు. గతరాత్రి, తెల్లవారుజామున అతడు నాకంటపడ్డాడు. అంతకు ముందురోజు రాత్రి కూడా అతణ్ని అరెస్టు చేయటానికి ప్రయత్నించాను గాని నా కళ్లుగప్పి పారిపోయాడు. ఆ సమయంలో అతని ఒంటిమీద నీలి సిల్కు కిమోనో, ఖడ్గం ఉన్నాయి. ఈ విల్లంబులు మృతుడివే అనుకుంటే, తాజోమారే హంతకుడై ఉండాలి. తోలుపట్టాతో కట్టిన అల్లెతాడు, లక్కతో చేసిన అమ్ములపొది, డేగ రెక్కల బాణాలు పదిహేడు - ఇవీ మృతుడి వద్ద లభించినవి. అతడెక్కినది మంచి, మేలుజాతి గుర్రమే. అతడు ప్రమాదవశాత్తూ గుర్రం పైనుండి జారిపడ్డాడంటే - విధి వక్రించిందన్నమాటే మరి.
 
 క్యోటో నగరంలో సంచరిస్తున్న దోపిడీ దొంగలందరిలోకీ, మహిళల్ని ఎక్కువగా ఇబ్బందులకు గురిచేసినవాడు తాజోమారు. గత సంవత్సరం, శిశిరంలో, పర్వతం వెనక భాగాన ఉన్న టోరిబె దేవాలయానికి వచ్చిన ఓ మహిళను ఎవరో హత్య చేశారు. ఇది తాజోమారు పనేనని అనుమానం. ఇతణ్ని హత్య చేసింది ఈ దుర్మార్గుడే అయితే, ఆయన భార్యను ఏం చేసి ఉంటాడో ఊహించవచ్చు. ఈ కేసును మీరు ఈ కోణం నుండి కూడా పరిశోధించాలని మనవి చేసుకుంటున్నాను.
 
 కమిషనర్ ముందు ఒక వృద్ధురాలి వాంగ్మూలం:
 మృతుడు నా అల్లుడు. అతడు క్యోటో నివాసి కాదు. వకాసా ప్రాంతంలోని కొకుప్ఫు గ్రామ సమురాయ్ (యోధ) అతడు. పేరు ‘కనజవ నో తకెహికొ’. వయస్సు ఇరవై ఆరు. సౌమ్యుడు. ఎవరితోనూ కలహించడు. నిన్న కూడా తనకై తాను పోట్లాటకు దిగి ఉండడు.
 
 నా కూతురి పేరు మసాగో. వయసు పంతొమ్మిది. వుషారైన పిల్ల. కాని దానికి తకెహికొ తప్ప మరొక పురుషుడితో సంబంధముందనుకోను. నిన్న తకెహికొ నా కూతుర్ని తీసుకుని బయల్దేరాడు. దురదృష్టం కాకపోతే, వాళ్లకే ఇలా జరగాలా? ఇంతకూ నా కూతురేమైంది? దానికోసం వెతకమని మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఆ దుర్మార్గుడు తాజోమారు నా బతుకులో నిప్పులు పోశాడు. అల్లుడు, కూతురు నాకు కాకుండా పోయారు.... (కన్నీరు మున్నీరుగా విలపించింది).
 
 తాజోమారు నేరాంగీకారం (కన్‌ఫెషన్):
 అతణ్ని చంపాను. ఆమెకేమైంది మరి? ఒక్క నిమిషమాగండి. మీరెన్ని చిత్రహింసలు పెట్టినా తెలియంది చెప్పలేను. ఇంత జరిగింతర్వాత, ఇంక మీనుంచి ఏమీ దాచదలచలేదు.
 
 నిన్న మధ్యాహ్నం దంపతులు నాకంట పడ్డారు. అప్పుడే చిరుగాలి వీచింది. స్కార్ఫు తొలగింది. ఆమె మొహం తళుక్కున మెరిసింది. ఆమె బోధిసత్వునిలా కనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను. అవసరమైతే, ఆమె కోసం, అతణ్ని చంపటానికైనా సందేహించకూడదని!
 
 మీరనుకుంటున్నట్టుగా, చంపటం నాకో విషయం కాదు. స్త్రీని బంధించినప్పుడు, ఆమె పురుషుణ్ని ఎట్లాగూ చంపక తప్పదు. ఈ పనికి, నా ఖడ్గాన్ని ఉపయోగిస్తాను. అయినా, ఈ లోకంలో హత్యలు చేసేవాణ్ని నేనొక్కణ్నేనా ఏమిటి? మనుషుల్ని చంపటానికి మీకు ఖడ్గాలు అవసరం లేదు. అధికారంతో, ధన బలంతో చంపుతారు మీరు. కొన్నిసార్లు వాళ్లకోసమే అనే సాకుతో కూడా చంపుతారు. మీరు హత్యలు చేసిన ప్రతిసారీ రక్తం ప్రవహించదు. మనిద్దరిలో ఎవరెక్కువ పాపం చేస్తున్నారు? మీరా, నేనా? (వ్యంగ్యంగా నవ్వుతాడు).
 
 అతణ్ని చంపకుండా ఆమెను బంధించగలిగితే, బాగానే ఉండేది. అతడికి అపకారం తలపెట్టకుండా ఆమెను స్వాధీనం చేసుకోవటానికి చాలా ప్రయత్నించాను. కాని, జన సంచారం ఉన్న ఈ రహదారి మీద నా ప్రయత్నం సఫలం కాదు. అందుకోసం, వాళ్లను చెట్ల మాటుకు రమ్మన్నాను. చెట్ల వెనకాల ఒక గోతిలో కొన్ని అద్దాలూ, ఖడ్గాలూ దాచిపెట్టాననీ, వాళ్లకు చవకగా అమ్ముతాననీ ఆశపెట్టాను. దురాశ మంచిది కాదని మీరూ అంగీకరిస్తారు గదా. మొదట సందేహించినా, అరగంటలో అతడు నన్ననుసరించాడు.
 
 దురాశ అతడి విజ్ఞతను కబళించింది. ఆమె మాత్రం గుర్రం దిగకుండా అక్కడే నిరీక్షిస్తానన్నది. అది స్త్రీ సహజమైన బెరుకు. దట్టమైన చెట్లను చూసి ఆమెకు సందేహం కలిగి ఉంటుంది. మొత్తం మీద నా పాచిక పారింది. అతడిని తీసుకుని తోపులోకి వెళ్లాను - ఆమెను ఒంటరిగా వదిలి.
 
 అవన్నీ వెదురుచెట్లు. ఓ యాభై గజాల దూరంలో సీడర్ చెట్లున్నాయి. నా పనికి అది అనువైన చోటు. అతడు ఆశగా ముందుకు నడిచాడు. అదను చూసి, వెనక నుండి బంధించటానికి యత్నించాను. అతడు ఖడ్గ విద్య నేర్చిన యోధ. బలిష్ఠుడు. కాని, ఆ క్షణాన నాదే పైచేయి. అతడెంత ప్రయత్నించినా, విడిపించుకోలేకపోయాడు. ఒడుపుగా పట్టుకుని, సీడర్ చెట్టుకు కట్టేశాను. తాడెక్కడ దొరికిందంటారా? దొంగలు ఎప్పుడూ తాడు వెంట తీసికెడతారు. ఏ క్షణానైనా గోడలెక్కవలసి రావచ్చు. అరవటానికి ప్రయత్నించాడు. వెదురు ఆకులు నోట్లో కుక్కి శబ్దంరాకుండా జాగ్రత్తపడ్డాను.
 అలా, అతణ్ని కదలకుండా చేసి, ఆమె వద్దకెళ్లి, అతడికి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైంది, వచ్చి చూడమన్నాను.
 
  ఆతృతగా గుర్రం దిగి నా వెంట నడిచిందామె - (చేతులో చేయి వేసి ఆమెను తోపుదాకా తీసుకెళ్లాను). భర్తను చూడగానే, దాచుకున్న చురకత్తి తీసింది. స్త్రీలకంత కోపం రాగలదని నాకప్పటిదాకా తెలియదు. నేను ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఆ చురకత్తి నాలో దిగేదే. ఆమె సాధారణ అబల. నేను తాజోమారు! నా ఖడ్గానికి పనిచెప్పకుండానే ఆమెను నిరాయుధురాలిని చెయ్యగలిగాను. చేతిలో చురకత్తి కూడా లేని మహిళ నా పట్ల ఎంత ద్వేషమున్నా ఏం చెయ్యగలదు? కనీసం ఆమె భర్తను చంపకుండా నా కోరిక తీర్చుకోగలిగాను. అవును. అతడి ప్రాణం తీసుకోలేదు నేను. ఆమె రోదిస్తూ కుప్పకూలింది. ఇక నేను వెళ్లిపోదామనుకుని ముందుకు కదిలినప్పుడు, ఆమె నా చేయి పట్టుకుని, ఆ భర్తో, నేనో - ఇద్దర్లో ఎవరో ఒకరం హతులం కాక తప్పదంది. తనకు జరిగిన అవమానం ఇద్దరు పురుషులు తెలియటం తను భరించలేనంది.
 మా ఇద్దరిలో ఎవరు బతికితే వాళ్లకు భార్యగా ఉండటం తనకు సమ్మతమేనంది. అలా, ఆ క్షణాన, అతణ్ని చంపాలనే కోరిక నాలో పెరిగింది. (ఉద్రేకంతో మొహం ఎరుపెక్కింది).
 
 ఇలా మాట్లాడుతున్నందుకు నేను మీకు చాలా క్రూరుడిగా కనిపిస్తున్నాననుకుంటాను. కాని, అప్పుడు ఆమె నావైపు ఎలా చూసిందో మీకు తెలియదు. నిప్పుల్లా మెరిసిన ఆమె చూపులు నన్ను దహించివేశాయి. తరువాత ఏమైనా సరే, మరొక్కరోజు బతకలేకపోయినా సరే, ఆమెను నా భార్యగా చేసుకోవటం తప్ప మరో కోరిక కలగలేదు నాలో. అది తప్ప నా జీవితానికి మరే లక్ష్యమూ లేదు. నేను బతికున్నదే ఆమెను నా దాన్ని చేసుకోవటానికనిపించింది. అది కేవలం కామం కాదు. అదే నిజమైతే, ‘అనుకున్నది చేశాను’ గనక, తనమానాన తనను వదిలి వెళ్లిపోవచ్చు. నా ఖడ్గం రక్తస్నానం చెయ్యనవసరం లేదు. ఆమె కళ్లు నన్ను దీనంగా అర్ధించినప్పుడు అతణ్ని చంపకుండా అక్కడ నుండి కదలకూడదనుకున్నాను.
 
 చంపటంలో కూడా ధర్మముండాలి. కట్లు విప్పి, కత్తి యుద్ధం చేద్దామన్నాను. కోపంతో ఊగిపోతూ అతడు ఖడ్గం ఝుళిపించాడు. మా యుద్ధం ఎలా జరిగిందో ఇప్పుడు వివరించవలసిన అవసరం లేదు. ఇరవై మూడవ ప్రహారంలో... అతడు మంచి యోధ. అతని సామర్థ్యానికి నా జోహారు.
 
 అతడు నేల కూలగానే, ఆమె వైపు చూశాను! కాని ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది. ఎక్కడికి పోయి ఉంటుంది! సీడర్ చెట్లలో గాలించాను. అంతిమశ్వాస పీలుస్తున్న నా ప్రత్యర్థి మరణ వేదన తప్ప మరేమీ వినిపించలేదు.
 
 మేం యుద్ధానికి సిద్ధపడగానే, ఆమె సహాయం కోసం రహదారి వైపు వెళ్లి ఉంటుంది. అంటే, నాకు జీవన్మరణ సమస్య సృష్టించబోతున్నది. వెంటనే అతడి ఖడ్గం, విల్లంబులు తీసుకుని పర్వతమార్గం వైపు పరిగెత్తాను. అక్కడ, పచ్చగడ్డి మేస్తున్న ఆమె గుర్రం కనిపించింది. గ్రామంలోకి ప్రవేశించేముందు నా ఆయుధాలను వదిలించుకున్నాను. ఇదీ నా నేరాంగీకారం. నన్నెట్లాగూ ఉరి తీస్తారని తెలుసు. అంతకన్నా పెద్ద శిక్ష ఉండదు గద. (ధిక్కారంగా నవ్వుతాడు)
 
 మహిళ నేరాంగీకారం:
 ఆ వ్యక్తి, నన్ను లోబరుచుకుని కట్లలో ఉన్న నా భర్తవైపు అవమానకరంగా చూశాడు. నా భర్త ఎంత గాయపడి ఉంటాడు! నేను నిస్సహాయను. ఆ క్షణాన నాకు, నా భర్త కళ్లలో కొత్త వెలుగు కనిపించింది. దాని అర్థమేమిటో చెప్పలేను. మాట్లాడలేని నా భర్త మనసులోని మాట నాకు తెలిసింది. నా భర్త కళ్లలో కనిపించింది కోపమూ కాదు. విచారమూ కాదు. ఒక అసహ్యం, జుగుప్స. ఇతడు నా మీద చెయ్యి చేసుకున్నాడు. కాని ఈ దెబ్బ కన్నా నా భర్త చూపు నన్ను ఎక్కువగా అవమానపరిచింది.
 
 ఎంతసేపలా పడున్నానో తెలియదు గాని, కళ్లుతెరిచి చూసేసరికి నీలిసిల్కు గుడ్డలేసుకున్న వ్యక్తి కనిపించలేదు. బందీగా ఉన్న నా భర్త అచేతనంగా నావైపు దీనంగా చూశాడు. చూపులను తట్టుకోవటం నా వల్ల కాలేదు. నన్ను నిలువునా దహించివేశాయవి. దగ్గరగా వెళ్లి, ‘‘తకెహికో, ఇంత జరిగింతర్వాత ఇక నేను నీతో కాపురం చెయ్యలేను.  మరణమే నాకు శరణ్యం. నాకు జరిగిన అవమానాన్ని నువ్వు కళ్లారా చూశావు. అందువల్ల నువ్వు కూడా ఇక బతికుండకూడదు. నిన్ను నేను బతకనివ్వను’’ అని చెప్పాను.
 
 అదృష్టవశాత్తూ చురకత్తి ఇంకా నా దగ్గరే ఉంది. మాటలు విని పెదవులు కదిపాడు నా భర్త. నోటి నిండా ఆకులున్నాయి గనక మాట్లాడలేకపోతున్నాడు. కాని, ఆ చూపులు చాలవా, మాటలెందుకు. ‘‘చంపు. త్వరగా చంపు’’ అంటున్నాయి కళ్లు. లిలాక్ రంగు కిమోనోలోనికి దిగింది నా బాకు.
 
 మళ్లీ మూర్ఛపోయి ఉంటాను. స్పృహ వచ్చేసరికే, నా భర్త మరణించాడు. కట్లు అలాగే ఉన్నాయి. ఏడుస్తూ మృతదేహానికున్న కట్లు విప్పాను. శరీరంలో సత్తువ లేదు. ఆత్మహత్య చేసుకోవటానికి కూడా శక్తి లేదు. బాకుతో గొంతు మీద పొడుచుకుని పర్వత పాదాల చెంత ఉన్న తటాకంలోకి దూకాను. కాని బాకుకు కూడా నా మీద కరుణ లేదు. ఇదిగో, ఇంకా బతికే ఉన్నాను. శీల భంగానికి గురైన అభాగ్యురాలిని. భర్తను హత్యచేశాను. దుర్మార్గుడి చేతిలో పరువుపోయింది. ఏం చెయ్యను? ఏం చెయ్యను?... (రోదిస్తోంది).
 
 మృతుడు, మరో బతికున్న వ్యక్తి (మీడియం) ద్వారా తన కథ వినిపిస్తాడు:
 నా భార్యను లోబర్చుకుని, ఆమెను సముదాయించటం ప్రారంభించాడు దోపిడీ దొంగ. నోట్లో ఆకులు కుక్కాడు గనక, మాట్లాడలేను. అయినా, నేనామెకు అనేకసార్లు కళ్లతో సైగలు చేశాను. ఆమె, వాడు చెబుతున్న కబుర్లు వింటోంది. అసూయతో రగిలిపోయాను. చివరికి, ధైర్యం చేసి, ‘‘నేను నీ శీలాన్ని దోచుకున్నాను గనక, నువ్వు నీ భర్తతో కలిసి బతకలేవు. ఇక, నన్నే నీ భర్తగా ఎందుకు అంగీకరించకూడదు’’
 
 అన్నాడు వాడామెతో.
 వాడి మాయలో పడిపోయినట్టుగా ఆమె ఆ మాటల్ని ఆసక్తిగా వింది. ఆ క్షణాన, ఆమె ఎంత అందంగా కనిపించిందో! ఆమె వాడికేం బదులిచ్చిందనుకుంటున్నారా? నేను కదలలేను. మెదలలేను. కాని ఆ మాటలు విని కాలిపోయాను. ‘‘నీ వెంటే తీసికెళ్లు ఇక’’ అవీ ఆమె మాటలు.
 ఆమె చేసిన పాపం ఇది మాత్రమే అయితే, నేనంతగా బాధపడేవాణ్ని కాదేమో. మంత్రముగ్ధురాలైనట్టుగా, వాడి చేతిలో చేయి వేసి తోపులోనుండి వెళ్లిపోతూ, నావైపు తిరిగి చూసి, ‘‘అతణ్ని చంపెయ్. అతడు బతికున్నంతవరకూ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను’’ అంది వాడితో. ఆ మాటలు విని పాతాళంలోకి కుంగిపోయాను. మానవ చరిత్రలో, ఏ భార్య అయినా భర్త పట్ల అంత అసహ్యత పెంచుకుందా ఇదివరలో! ఆమె మాటలు విని, దోపిడీ దొంగ కూడా నిర్విణ్ణుడయ్యాడు. ఇలా చెయ్యవలసి వస్తుందని ఊహించి ఉండడు.
 
 నా దగ్గిరకు వచ్చి, ‘‘ఇలాంటిదాన్ని నువ్వేం చేస్తావు? చంపుతావా? వదిలేస్తావా? తలాడించు చాలు. చంపమంటావా?’’ అని అడిగాడు. ఈ మాటలన్నందుకైనా, అతడి నేరాన్ని క్షమించవచ్చు.
 
 నేను సందేహించాను. ఆమె అరుస్తూ పరిగెత్తింది. ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నించాడతడు. కాని అతడి చేతుల్లోంచి జారింది ఆమె. ఆమె పారిపోయిన తర్వాత, నా ఖడ్గం, విల్లంబులు తీసుకున్నాడు. నా కట్లు తెంచేశాడు. లోపల ఏదో గొణుక్కుంటున్నాడతడు. ‘‘ఇక నా వంతు’’ అనుకుంటున్నాడు కాబోలు. అతడూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అంతటా నిశ్శబ్దం! సమీపంలో ఏడుపు వినిపించింది. జాగ్రత్తగా విన్నాను.
 
  అది నా ఏడుపే.
 పాదాల చెంత నా భార్య వదిలివెళ్లిన బాకు కనిపించింది. బలంగా గుండెలో పొడుచుకున్నాను. గొంతుకేదో అడ్డం పడింది. కాని బాధ తెలియలేదు. శరీరం క్రమంగా చల్లబడింది. మృత్యు నిశ్శబ్దం ఆవరించింది. సూర్యుడు కుంగిపోయాడు. చీకటి ఆవరించింది. నలువైపుల నుండీ నిశ్శబ్దం నన్ను కప్పేసింది. ఎవరో నావైపు కదిలి వచ్చారు. అంధకారంలో ఏమీ కనిపించలేదు. నా గుండెల్లో నుండి బాకును నెమ్మదిగా లాగింది అదృశ్య హస్తం. అంతే ఆ తర్వాత అగమ్య లోకాలకు నా ప్రయాణం ప్రారంభమైంది.
 (కథ సంక్షిప్త రూపం)
 
 అప్పుడే నిర్ణయించుకున్నాను. అవసరమైతే, ఆమె కోసం, అతణ్ని చంపటానికైనా
 సందేహించకూడదని!
 
 ఆ క్షణాన నాకు, నా భర్త కళ్లలో కొత్త వెలుగు కనిపించింది. దాని అర్థమేమిటో చెప్పలేను. మాట్లాడలేని నా భర్త మనసులోని మాట నాకు తెలిసింది. నా భర్త కళ్లలో కనిపించింది కోపమూ కాదు. విచారమూ కాదు. ఒక అసహ్యం, జుగుప్స.

 

 జపనీస్ మూలం: ర్యూనోసుకె అకుటగవ
 తెలుగు: ముక్తవరం పార్థసారథి
 

>
మరిన్ని వార్తలు