సల్లూభాయ్‌ పెళ్లి!

9 Dec, 2017 23:52 IST|Sakshi

 ∙లాఫింగ్‌ గ్యాస్‌

సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీంఖాన్‌ టీవీ చూస్తూ ఏడుస్తున్నాడు. టీవిలో వస్తున్నదేమో... కామెడీ షో! సలీంఖాన్‌ వైపు ఆశ్చర్యంగా చూసిన  పనిమనిషి ‘‘కామెడీ షో చూస్తూ  నవ్వుతారుగానీ... మీరేంటి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు?’’ ఆశ్చర్యంగా అడిగింది. ‘‘మనసు బాగ లేనప్పుడు కామెడి షో చూసినా కన్నీళ్లు వస్తాయి మంగతాయారు’’ అంటూ కర్చీఫ్‌తో కన్నీళ్లు తుడుచుకున్నాడు ఖాన్‌. ఈలోపు ఆ ఇంట్లోకి ఖాన్‌ చిరకాల మిత్రుడు జావెద్‌ అక్తర్‌ వచ్చాడు.  ‘‘ఏం భాయ్‌... చాలా డల్‌గా కనిపిస్తున్నావ్‌?’’  అని ఆరాతీశాడు జావేద్‌. ‘‘నీకు తెలియనిదేముంది? మా సల్మాన్‌ఖాన్‌ గురించే అప్పటి నుండి ఆలోచిస్తున్నా... పెళ్లి అనేమాట వినబడగానే గోడ దూకి పారిపోతున్నాడు. నాకేమో వయసు మీద పడుతుంది. సల్లూ ఏమో పెళ్లంటేనే జడుసుకుంటున్నాడు. నువ్వూ నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాం. వీడేమో సింగిల్‌ పెళ్లికే గింజుకుంటున్నాడు. పెళ్లి  ఊసెత్తగానే.... ‘షాదీ కే పీచే క్యా హై...ఓన్లీ సోదీ హై’ అని పాడుతున్నాడు’’ బాధగా నిట్టూర్చాడు సలీంఖాన్‌.‘‘అరే భాయ్‌... నీకో ముఖ్యమైన విషయం చెప్పడం మరిచాను...’’ అన్నాడు జావెద్‌.

‘‘ఏమిటి అది?’’ ఆశగా, ఆసక్తిగా అడిగాడు సలీంఖాన్‌.‘‘కేరళలో మన్మథ్‌ కుట్టీ అయ్యంగార్‌ అనే మ్యారేజిస్ట్‌ ఉన్నాడట. మ్యారేజ్‌ అంటే పారిపోయేవాళ్లను... మ్యారేజ్‌ కోసం పరుగులు తీయిస్తాడట. ఆయన సలహా ఇస్తే తిరుగుండదట. ఒక్కసారి ట్రై చేసి చూడు’’ అన్నాడు జావెద్‌.మరుసటి రోజు మన్మథ్‌కుట్టీ అయ్యంగార్‌ కలుసుకోవడానికి తిరువనంతపురం వెళ్లాడు సలీంఖాన్‌.‘‘నా కొడుకు పేరు సల్మాన్‌ఖాన్‌. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌. నేను ఎందుకు వచ్చానో మీకు అర్థమై ఉంటుంది. మీరేదో సలహా ఇస్తారని... దానికి తిరుగు ఉండదని విన్నాను. నాకు కూడా ఇచ్చి పుణ్యం కట్టుకోండి’’రిక్వెస్ట్‌గా మన్మథ్‌ను అడిగాడు ఖాన్‌.‘‘చాలా సింపుల్‌ సార్‌. సాంగోథెరపీ చేయండి చాలు. సల్మాన్‌ విషయంలో మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్‌ పాట వినిపించడమే’’ అన్నాడు మన్మథ్‌.‘‘కొత్తగా వినడమేమిటి? సల్లూ రోజూ సాంగ్స్‌ వింటాడు’’ బుర్ర గోక్కుంటూ చెప్పాడు సలీంఖాన్‌.‘‘ ఏ పాట అంటే ఆ పాట కాదు. ఓన్లీ మ్యారేజ్‌ సాంగ్‌. అది కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఆ పాటను రోజూ సల్మాన్‌కు వినిపించాలి’’ అని సలహా చెప్పాడు మన్మథ్‌.‘‘అలాగే చేస్తాను’’ అని ముంబైకి పయనమయ్యాడు  సలీంఖాన్‌.మరుసటి రోజు కవి గుల్జార్‌కి ఫోన్‌ చేసి ‘‘మాంచి మ్యారేజ్‌ సాంగ్‌ ఉంటే చెప్పండి గుల్జార్‌జీ’’ అని అడిగాడు. ‘‘మొన్న హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు ‘శ్రీరస్తూ శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం’ అనే పాటను విన్నాను. ఆరుద్ర రాశారు. బ్రహ్మాండమైన మ్యారేజ్‌ పాట’’ అంటూ  ఆ పాటను హిందీలోకి ట్రాన్స్‌లేట్‌ చేసి చెప్పాడు. ఆ పాట సలీంఖాన్‌కు బాగా నచ్చింది. ఆ తరువాత...‘‘సల్లూ... నాదో చిన్న కోరిక తీర్చాలోయ్‌. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదుగానీ...నా కోసం ఒక తెలుగు పాట వినాలి’’ అని సల్మాన్‌ఖాన్‌ని అడిగాడు సలీంఖాన్‌. ‘‘దానిదేముంది డాడ్‌! అలాగే’’ అని మాట ఇచ్చిన సల్మాన్‌... రోజూ జిమ్‌లో ‘శ్రీరస్తూ శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం’ పాటను వినడం మొదలు పెట్టాడు.  రెండు వారాల తరువాత తండ్రి దగ్గరకు వచ్చిన సల్మాన్‌ ‘‘నాన్నా... నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది’’ అని తలవంచుకొని సిగ్గుపడ్డాడు. ‘‘అలాగే నాన్నా... నెల తిరిగేలోపు నీకో అందమైన అమ్మాయిని తీసుకొచ్చి  పెళ్లి చేస్తాను’’ అని సంబరపడిపోయాడు సలీంఖాన్‌.

సాంగోథెరపీ పుణ్యమా అని సల్మాన్‌ఖాన్‌ పెళ్లిచేసుకోబోతున్నాడనే వార్త మీడియాలో పెద్ద ఎత్తున హల్‌చల్‌ చేస్తుంది. ఢిల్లీలోని సోనియాజీ నుంచి మన్మథ్‌ కుట్టీ అయ్యంగార్‌ ఫోన్‌ కాల్‌ వచ్చింది. రామ్‌గోపాల్‌వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను పక్కన పెట్టి,   ముంబాయికి వచ్చి ‘సల్మాన్స్‌ వెడ్డింగ్‌’ అనే సినిమా మొదలు పెట్టాడు. ఒక నెల తరువాత...టీవీలో ఒక ట్రాజెడీ సినిమా చూస్తూ... తెగ నవ్వుతున్నాడు సలీంఖాన్‌. ‘‘అదేంటి అయ్యగారు... ఈ సినిమా పేరు వింటేనే కళ్లలో నుంచి నీళ్లు బొటాబొటా  కారుతాయి. అలాంటిది సినిమా చూస్తూ కూడా... మీరు పగలబడి ఎలా నవ్వగలుగుతున్నారు?’’ ఆశ్చర్యంగా అడిగింది పనిమనిషి.‘‘మనసు బాగాలేకపోతే ట్రాజెడీ సినిమా చూసినా పొట్టచెక్కలయ్యేంత నవ్వొస్తుంది  మంగతాయారు’’ అన్నాడు ఖాన్‌. సరిగ్గా  ఆ సమయానికి ఇంట్లోకి వచ్చిన జావెద్‌ అక్తర్‌ ‘‘మళ్లీ మనసు బాగలేదా?మళ్లీ ఏమైంది?’’ అని అడిగాడు.కుడిచేతి చూపుడు వేలితో ఆకాశంలో సర్కిల్స్‌ గీస్తున్నాడు సలీంఖాన్‌.‘‘యూ మీన్‌ ఫ్లాష్‌బ్యాక్‌’’ అడిగాడు జావెద్‌.‘‘యా’’ అన్నాడు ఖాన్‌.ఈ క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ను మీరు కూడా చూడండి...

‘‘ఎంత గొప్ప పాటా... ఎంత గొప్ప పాటా!’’ అని తన్మయంగా అంటున్నాడు సల్మాన్‌. అప్పుడు సలీంఖాన్‌ అందుకున్నాడు... ‘‘చాలా గొప్పపాట. నాకైతే పాటలోని చరణాలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. ‘సన్నికల్లు తొక్కినా... సప్తపదులు మెట్టినా... మనసు మనసు కలవడమే... మంత్రం పరమార్థం... అడుగడుగునా తొలి పలుకులు గుర్తు చేసుకో... తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో’ ఎంత గొప్ప భావం. హ్యాట్సాఫ్‌ టు ఆరుద్ర’’‘‘డాడీ... నేను చెప్పింది ఈ పాట గురించి కాదు. రామ్‌గోపాల్‌వర్మ ఒక తెలుగు పాట లింక్‌ పంపాడు. వారం రోజుల నుంచి అదే పాట వింటున్నాను. ఎంత బాగా నచ్చిందో’’ అన్నాడు సల్మాన్‌.‘‘ఏ పాట అది?’’ భయం భయంగా అడిగాడు సలీంఖాన్‌.‘‘భద్రం భీ కేర్‌ఫుల్‌ బ్రదరు... భర్తగా మారకు బ్యాచిలరు...షాదీ మాటే వద్దు గురూ... సోలో బ్రతుకే సో బెటర్‌...కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్లాచారం... జంటలు కట్టే జంతువులు ఎరగవు వెడ్డింగ్‌ విడ్డూరం... ఎందుకు మనకీ గ్రహచారం... అందుకే...’’ అని పాడుకుంటూపోతున్నాడు సల్మాన్‌. తట్టుకోలేక తల పట్టుకున్నాడు సలీంఖాన్‌.
 – యాకుబ్‌ పాషా

మరిన్ని వార్తలు