నక్కజిత్తుల నాగన్న

21 Oct, 2018 01:23 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

రాజస్థాన్‌ ఎడారుల్లో, సట్లెజ్‌ నదీ తీరంలో, సిమ్లా మంచుకొండల్లో చిత్రించిన తొలి తెలుగు కౌబాయ్‌ చిత్రంలోని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

తమలో తామే ఏదో గొణుక్కుంటున్నాయి నదిలో  నీళ్లు. నది ఒడ్డున రాళ్లు ఎప్పటిలాగే గంభీరంగా ఉన్నాయి. ఉన్నట్టుండి పెద్దగా కేకలు. ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని కట్టేసి తీసుకువస్తున్నారు.‘నడు’ ‘నడు’ అంటూ మెడపట్టి గెంటుతున్నారు.‘‘పొడుస్తారెందుకయ్యా...నడుస్తున్నాగా. పొడిస్తేగానీ నడవకపోవడానికి నేనేమన్నా దున్నపోతునా?’’    ఉక్రోషంగా అంటున్నాడు నల్లచారల పంట్లాం వ్యక్తి.‘‘నీకంటే అదే నయం’’ అన్నాడు  ఆ ముగ్గురిలో ఒకడు.మరొకడేమో...‘‘నీలాంటి పచ్చినెత్తురు తాగే బందిపోటుకు ఒకటే శిక్ష’’ అన్నాడు.‘‘ఏమిటీ మాటి మాటికి డొక్కలో పొడవడమా’’ వ్యంగ్యాలు పోయాడు నల్లచారల పంట్లాం.‘‘కాదు. ఉరి తీయడం’’ అని తేల్చి చెప్పాడు ఆ ముగ్గురిలో ఒకడు.‘‘తల్లి ముండమొయ్య...ఎంత సులభంగా చెప్పావయ్యా! నేనేమన్నా కావాలని దొంగతనం చేస్తున్నానా? ఈలోకంలో డబ్బు  ఉంటేగానీ జరగదు. అందుకని దారి వెంట పోతున్న డబ్బుగల ముసాఫీర్లను ఆపుతాను. మీ దగ్గర ఉన్న డబ్బంతా ఇస్తారా? లేకపోతే చంపమంటారా? అంటాను. వాళ్లు ఉన్నదంతా ఎప్పుడు ఇచ్చింది లేదు.నేను అన్నమాట తప్పింది లేదు’’   తన తోడేలు ముఖం మీద మేకతోలు కప్పుకుంటూ అన్నాడు నల్లచారల పంట్లాం. ‘‘అన్నమాట మేమూ తప్పం. మా బాబాయ్‌ని చంపిన వాడి చర్మం వొలిపిస్తామని మేమూ అనుకున్నాం. మా ఊళ్లో నట్టనడివీధిలో అనుకున్నంత పని చేస్తాం’’ పండ్లు పటపటమని కొరికాడు ఆ ముగ్గురిలో ఒకడు.

ఇంతలో అటువైపు నుంచి పిడుగులాంటి మాట...‘‘అతడిని వదిలేయండి’ అతను కౌబాయ్‌లా ఉన్నాడు.‘‘ఈ నక్క జిత్తుల నాగన్న గురించి నీకు తెల్వదు పోవయ్యా’’ అని విసుక్కున్నాడు ఆ ముగ్గురిలో ఒకడు.‘‘వీడి సంగతి మీ కంటే నాకే ఎక్కువ తెలుసు’’ అన్నాడు ఆ కౌబాయ్‌.‘‘ఏందబ్బాయా...నా సంగతి నీకు కూడా తెలుసా ఏమిటి!’’ అని గర్వంగా ఫీలైపోయాడు నక్కజిత్తుల నాగన్న.‘‘వదిలేయండి’’ మరోసారి అడిగాడు కౌబాయ్‌.‘‘పట్టుకుంది వదిలేయడానికి కాదు. వీడి ప్రాణం తియ్యనిదే వదిలిపెట్టం. నువ్వు వీడి చుట్టమైతే చెప్పు నీ సంగతి కూడా తేల్చుతాం’’ అని బెదిరించబోయారు ఆ ముగ్గురు. అంతే...ఎముకల్లో సున్నం లేకుండా బాది వాళ్లను పరుగెత్తించాడు కౌబాయ్‌.నక్కజిత్తుల నాగన్న ఆనందనానికి అవధులు లేవు. పట్టరాని ఆనందంతో అన్నాడు...‘‘తస్సదియ్య. భలే మొనగాడివిలే. నీ పేరేమిటి అబ్బాయా? దీపం పెట్టి తలుచుకుంటాను’’‘‘దీపాలు ఆర్పడమేకానీ పెట్టడం నీకు చాతకాదని నాకు తెలుసులే’’ అని నాగన్న పరువును నది ఒడ్డుకు ఈడ్చాడు కౌబాయ్‌.‘‘అబ్బా! తల్లిముండమొయ్య. నా జాతకం నీకు బాగా తెలుసన్నమాట’’ నీళ్లు నమిలాడు నాగన్న.నాగన్న గురించి కౌబాయ్‌కి ఎంతగా తెలుసంటే. అతని మాటలోన్లే వినండి...‘‘నిన్ను సజీవంగా పట్టిస్తే వెయ్యి వరహాలిస్తామని నూజివీడు సంస్థానంలో ప్రకటించిన విషయం తెలుసు. రెండు వేలిస్తామని గుంటూరు సర్కారులో చాటింపు వేయించిన విషయం తెలుసు. మూడువేలిస్తామని కర్నూల్‌ సుభాలో దండోరావేయించిన విషయం తెలుసు’’  ఇది విని ఆందోళనపడాల్సిందిపోయి, తెగ ఆనందపడుతూ తబ్బిబ్బైపోతూ అన్నాడు నాగన్న... ‘‘అబాయా! చూసావా మన ధర ఎట్టా పెరిగిపోతుందో. ఏనుగు బతికినా వెయ్యివరహాలే చచ్చినా వెయ్యివరహాలే’’ ఇంతలోనే అతనికి చేతికున్న కట్లు గుర్తుకొచ్చాయి.

‘‘అదిసరేగానీ చాకు ఉంటే కాస్త కట్లు కోసేయ్‌ అబాయా. మా చెడ్డ బాధగా ఉంది’’ అని బతిమిలాడుకున్నాడు.విప్పడం మాట దేవుడెరుగు...ఆ చేతులకు కొత్త కట్లు కట్టాడు కౌబాయ్‌.డంగైపోయాడు నాగన్న!‘‘ఉన్న కట్లు విప్పడం మానేసి...కొత్త కట్టు కడుతున్నవేమిటి అబాయా...ఇది నీకు మంచిది కాదు అబాయా’’ అన్నాడు ఆవేదనగా.‘‘నువ్వు నోర్ముయ్‌ అబ్బాయా’’ అన్నాడు కౌబాయ్‌.ప్రమాదాన్ని శంకించిన నాగన్న షేకైపోతూ...‘‘అబాయా...నన్ను పట్టుకెళ్లి  ఠాణాలో అప్పగించి ఉరితీయాలనుకుంటున్నావా? నీకు పుణ్యం ఉంటుంది అబాయా...నన్ను వదిలిపెట్టు అబాయా’’ అని బతిమిలాడుకున్నాడు.కౌబాయ్‌ వింటేగా!అనుకున్నంతా జరిగింది.‘‘ఇదిగో మీకు కావలసిన గజదొంగ నాగన్న’’ అని నాగన్నను ఠాణాలో హాజరు పరిచాడు కౌబాయ్‌.నాగన్న తలను పైకెత్తి చూసి, నిర్ధారించుకొని...‘‘అద్భుతం. ఇంతవరకు ఎవరు పట్టుకోలేని వాడిని పట్టుకున్నావు’’ అని కౌబాయ్‌కు కితాబు ఇచ్చి–‘‘నీ పేరు ఏమిటి?’’అడిగాడు పోలీసు అధికారి.‘‘అదనవసరం. మీరిస్తానన్న వెయ్యివరహాలిస్తే నా దారిన నేను పోతాను’’ సూటిగా పాయింట్‌లోకి వచ్చాడు కౌబాయ్‌.‘మంచిది’ అంటూనే పోలీసు అధికారి చప్పట్లు కొట్టాడు. వరహాల మూట వచ్చింది, దాన్ని కౌబాయ్‌కి ఇచ్చాడు పోలీసు అధికారి. కోపం పట్టలేక తిట్లు, శాపనార్థాలు అందుకున్నాడు నాగన్న...‘‘నమ్మించి పుట్టిముంచుతావా కొడుకో. నువ్వు పురుగులబడి ఛస్తావురా కొడుకో. నీ కాష్టం వానొచ్చి ఆరిపోతుందిరా కొడుకో. నిన్ను నక్కలు పీక్కుతింటాయిరా కొడుకో’’‘‘నాగన్న అనే ఈ ముద్దాయి ఎన్నో దారిదోపిడీలు దొంగతనాలు చేశాడు. రాజ్యాన్ని, ప్రజల్ని భయకంపితుల్ని చేశాడు. బంధించడానికి వచ్చిన సిపాయిల్ని మోసం చేసి తప్పించుకు పారిపోయాడు. ఇట్లాంటి ద్రోహులు సజీవంగా ఉంటే సమాజశ్రేయస్సుకు హాని కలుగుతుందని నిర్ణయించి ఈ ముద్దాయిని ఉరి తీయవలెనని శాసించడమైనది’’ అని ప్రకటించాడు న్యాయమూర్తి.ఉరికంబం మీద నక్కజిత్తుల నాగన్న.కానీ, న్యాయమూర్తి ఒకటి తలిస్తే...కౌబాయ్‌ మరొకటి తలిచాడు. అప్పగించిన చేతులతోనే నాగన్నను విడిపించుకొని పారిపోయాడు. నాగన్న ప్రాణాలను రక్షించాడు.
 

మరిన్ని వార్తలు