ఇంకేం కావాలి?

21 Oct, 2018 01:22 IST|Sakshi

‘‘నేను హీరోగా చేస్తున్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బాగా ఎంజాయ్‌ చేస్తున్నా. ఇప్పుడు చూస్తున్నంత సక్సెస్‌ని అప్పుడు చూడలేదు. ఇన్ని భాషల్లోనూ, ఇంత మంది ఆర్టిస్టులతో, దర్శకులతో అప్పుడు చేయలేదు. ఇంకేం కావాలి’’ అన్నారు జగపతిబాబు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్‌.రాధాకృష్ణ నిర్మాత. ఇందులో జగపతిబాబు విలన్‌గా కనిపించారు. తాను చేసిన బసిరెడ్డి పాత్రకు మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.  ఈ సందర్భంగా జగపతిబాబు చెప్పిన విశేషాలు.

ఈ సినిమాలో నా పాత్ర సృష్టించింది త్రివిక్రమ్‌ అయితే నన్ను ప్రోత్సహించింది ఎన్టీఆరే. సినిమాలో నా పాత్ర బావుంటుంది అని అనుకున్నాను కానీ ఇంత బావుంటుంది అనుకోలేదు. ఒక టాప్‌ హీరో అయ్యుండి నన్నే పొగుడుతూ ఉన్నారు ఎన్టీఆర్‌. చాలా బాగా చేశారు.. ఇంకా బాగా చేయాలి అని ఎంకరేజింగ్‌గా మాట్లాడేవారు.
ఈ సినిమాలో నటన  కంటే డబ్బింగ్‌కే ఎక్కువ కష్టపడ్డాను. కొన్నిసార్లు డబ్బింగ్‌ చెబుతూ పడిపోయే పరిస్థితులు వచ్చాయి. డబ్బింగ్‌ క్రెడిట్‌ పెంచల్‌ దాస్‌గారు, అసోసియేట్‌ దర్శకుడు ఆనంద్, ఇంజనీర్‌ పప్పుకి ఇవ్వాలి.
ఈ సినిమా కథ వినలేదు. ఒక డైరెక్టర్‌ని నమ్మానంటే అంతే. సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్‌ ఓ నలభై మందిని కొడుతుంటే, ఎప్పుడూ ఇవేనా ఇంక మారరా? అనుకున్నాను. త్రివిక్రమ్‌ అయినా కొత్తగా చేయొచ్చుగా అనుకున్నాను. మధ్యాహ్నానికి  ఫైట్‌ వద్దు.. ఇంకోలా చేద్దాం అనడంతో ఆశ్చర్యపోయా. అది ఈ సినిమా బ్యూటీ.
‘గూఢచారి’లో టెర్రరిస్ట్‌గా, ‘రంగస్థలం’లో ప్రెసిడెంట్‌గా, ‘అరవింద సమేత..’లో ఫ్యాక్షనిస్ట్‌గా మూడు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలు చేశాను. మూడు రకాల పాత్రలకు కారణం దర్శకులే. తర్వాత సినిమాకు ఏం చేయాలి అని ప్రతి సినిమాకు అనుకుంటూనే ఉంటాను.
పాత సినిమాల్లో యస్వీ రంగారావు, నాగభూషణం పాత్రలు తమ పాత్రలను డామినేట్‌ చేసినా కూడా ఇష్టంగా పెట్టుకునేవారు హీరోలు. అందుకే అవి అంత పెద్ద సినిమాలు అయ్యాయి. ‘శుభలగ్నం’ సినిమాని ఆమని సినిమా అని దర్శకుడు అన్నారు. నేను కూడా క్రెడిట్‌ ఆమనికి వెళ్లాలని అన్నాను. ఈ సినిమాకు కూడా తారక్‌ ఇలానే చెప్పారు. ‘మన కంటే సినిమా పెద్దది. సినిమా పెద్దది అయితేనే హీరో ఇంకా పెద్దవాడు అవుతాడు అని అన్నాడు.
సాఫ్ట్‌ క్యారెక్టర్స్‌ చేయాలని ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉన్నది అయినా, సాఫ్ట్‌ హస్బెండ్‌ పాత్రలు చేయాలని ఉంది. క్లాస్‌ పాత్రలను ఇష్టపడతాను. ‘గాడ్‌ పాధర్‌’ లాంటి సినిమా చేయాలనుంది.

మరిన్ని వార్తలు