పంచామృతం: సర్వర్లు, వెయిటర్లు, క్లీనర్లు!

18 May, 2014 02:25 IST|Sakshi
పంచామృతం: సర్వర్లు, వెయిటర్లు, క్లీనర్లు!

‘‘పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం మాత్రం నీ చేతగానితనమే...’’ అంటాడు వారన్ బఫెట్. ఆ అపర కుబేరుడు ఇలా అన్నట్లు తెలియకపోయినా, ఈ అక్షర సత్యాన్ని అర్థం చేసుకొని తమ జీవితాలను మలుపు తిప్పుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. శ్రమతో, ప్రతిభతో తమరాతను తిరగరాసుకున్న వాళ్లున్నారు. వాళ్లలో మనకు బాగా పరిచయం ఉన్న వాళ్లూ ఉన్నారు. అంటే సిల్వర్ స్క్రీన్‌మీద హీరోలుగా, ఆఫ్ స్క్రీన్‌లో సెలబ్రిటీలుగా వెలుగుతున్న వాళ్లు. విశేషం ఏమిటంటే హోటళ్లలో సర్వర్లుగా,  వెయిటర్లుగా జీవితాన్ని మొదలు పెట్టిన వాళ్లు వీళ్లంతా. తర్వాత స్టార్‌ల హోదాకు చేరారు.
 
 
 
 స్మృతి ఇరానీ
 రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర నటిగా గుర్తింపు ఉన్న వ్యక్తి స్మృతీ ఇరానీ. ఈ పార్శీ నటి ముంబైలోని మెక్‌డొనాల్డ్స్‌లో మెట్లు తుడిచేవారట! ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్‌లో పాల్గొన్నా అదృష్టం కలిసి రాలేదు. కానీ స్టార్‌ప్లస్ సీరియల్స్‌తో స్మృతి దశ తిరిగింది.
 
 అక్షయ్ కుమార్
 బ్యాంకాక్‌లోని ఒక సాధారణ హోటల్‌లో వెయిటర్‌గా, గిన్నెలు కడిగేవాడిగా పనిచేశాడు ఈ కిలాడీ హీరో. కొన్ని సంవత్సరాల పాటు అదే వృత్తిలో కొనసాగిన అక్షయ్ అదే సమయాన్ని మరో విధంగానూ ఉపయోగించుకొన్నాడు. మార్షల్ ఆర్ట్స్‌కు కూడా ఫేమస్ అయిన బ్యాంకాక్‌లో వాటిని అవపోసన పట్టాడు. తర్వాత ఇండియా వచ్చేసి మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్న ప్రవేశాన్నే అర్హతగా చేసుకొని సినిమా అవకాశాలను సంపాదించాడు. ఆ తర్వాత అక్షయ్ దశ తిరిగింది.

 
 బొమన్ ఇరానీ
 ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ లో డాక్టర్‌పాత్రతో ఈ పార్శీ నటుడి పేరు మార్మోగింది. అంతకు ముందు చిన్నాచితకా పాత్రలు చేసినా, సినిమా ఇండస్ట్రీకి రాకముందు చాలా కష్టాలే పడ్డాడు బొమన్. ముంబాయిలోని తాజ్‌మహల్ హోటల్‌లో రూమ్ సర్వీస్ బాయ్‌గా, వెయిటర్‌గా చాలా సంవత్సరాల పాటు పనిచేశాడు. నాడు ఎంగిలి ప్లేట్లు కడిగిన అతడే ఇప్పుడు జనం మెచ్చిన నటుడయ్యాడు.

జిమ్ క్యారీ
 ఈ కెనడియన్ యాక్టర్ ‘బ్రూస్ ఆల్‌మైటీ’ సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సంపాదించాడు. తర్వాత అనేక సినిమాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘బ్రూస్ ఆల్‌మైటీ’ కథలాగే, ఈ హీరో వ్యక్తిగత కథ కూడా స్ఫూర్తిమంతమైనదే. ఒక రెస్టారెంట్‌లో క్లీనింగ్ బాయ్‌గా, సెక్యూరిటీగా పనిచేశాడట జిమ్. ఆ సమయంలో తాను పాడై, నిలిపి ఉంచిన వ్యాన్‌లో తలదాచుకొనే వాడినని క్యారీ చెబుతాడు.
 
 

లియనార్డో డికాప్రియో
 ‘టైటానిక్’ హీరో డికాప్రియో ఒకప్పుడు ఒక చీకటి ప్రపంచంలో జీవించేవాడు. చుట్టూ డ్రగ్ డీలర్స్, ప్రాస్టిట్యూట్స్... ఇలాంటి వారందరికీ సహాయకుడిగా, వాళ్లలో ఒకడిగా కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చాక డికాప్రియోకి వెల్కమ్ చెప్పింది ఒక హోటల్. అక్కడ సర్వర్‌గా పనిచేయడంతో అతడి కొత్త జీవితం మొదలైంది. అలా అలా... హాలీవుడ్‌లో వికసించింది.

మరిన్ని వార్తలు