నడిచేది జీవుడు నడిపేది దేవుడు

21 May, 2017 00:11 IST|Sakshi
నడిచేది జీవుడు నడిపేది దేవుడు

శ్రీకృష్ణార్జున విజయం చిత్రంలో... ద్రోణాచార్యుడి మీద ప్రతీకారాగ్నితో రగిలిపోతున్న ద్రుపదుడు, నది దాటడానికి వచ్చి, అక్కడ ఉన్న బాలుడిని నది దాటించమని అడుగుతాడు. నది ప్రమాదస్థాయిలో ఉందని, సుడిగుండాలు ఉన్నాయని, ఆ వేళలో నది దాటడం మంచిదికాదని ఆ బాలుడు చెప్పినా వినకుండా, తానే తెప్పలో నది దాటుతానని చెప్పి, తెప్ప నడపడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు బాలుడి వేషంలో వచ్చి వేదాంతబోధ చేస్తూ పాడే పాట ‘నడిచేది జీవుడు నడిపేది దేవుడు’.గూఢార్థం ఉండే పాటలకు నేను అంతకుముందు ఎన్నడూ ట్యూన్‌ చేయలేదు. ఈ పాటతో నా కోరిక నెరవేరడమే కాదు, ఈ చిత్రానికి నాకు నంది అవార్డు కూడా అందింది.

ఈ పాట విన్నప్పుడు నేను ఎక్కడో చదివిన ఒక చిన్న జీవిత సత్యం గుర్తుకు వస్తుంది. మనిషి ఒంటరిగా ఉంటే ‘సున్న’తో సమానం, దేవుడు ‘ఒకటి’తో సమానం. ఆ దేవుడి పక్కన మానవుడు చేరితే అది ‘పది’ అవుతుంది. అది జీవితం. ప్రతి పనినీ భగవంతుడే వెంట ఉండి నడిపిస్తాడు. ‘మనిషి నడుస్తాడు, భగవంతుడు నడిపిస్తాడు...’ అనే విషయాన్నే ఈ పాటలో వెన్నెలకంటిగారు అద్భుతంగా చెప్పారు.

అంధుడికి సూర్యుడు కనిపించడు కనుక, సూర్యుడు లేడంటే కుదరదు, భగవంతుడు కంటికి కనిపించలేదు కదా అని దేవుడు లేడంటే ఎలా కుదురుతుంది?  గువ్వపిల్లలు నీటిలో ఈదలేవు, చేపపిల్లలు నింగిలో ఎగరలేవు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అది మీరటం ఎవరి తరమూ కాదు. ఏ జీవికీ మిడిసిపాటు పనికిరాదు. కర్తవ్యం నెరవేర్చాలి, భారం భగవంతుడి మీద వేయాలి, అప్పుడే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు... అనే వేదాంతాన్ని వెన్నెలకంటి ఎంతో హృద్యంగా వివరించారు. ఆయన పాట రాసి ఇచ్చిన తరువాతే ట్యూన్‌ చేశాను. దర్శకులు సింగీతంగారి అనేక సినిమాలకు సంగీతం సమకూర్చాను. పౌరాణిక చిత్రం ఆయనతో కలిసి చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది.

మరిన్ని వార్తలు