తమిళ సరస్వతి ఒడిలో... తెలుగు సారస్వతం

12 Jan, 2014 02:26 IST|Sakshi
తమిళ సరస్వతి ఒడిలో... తెలుగు సారస్వతం

పురస్కారం

 ‘తెలుగుజాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది’ అంటూ భాషను భూదిగంతాలకు వెలుగెత్తి చాటుకుంటున్న మనకు కనీసం మన భాష మూల గ్రంథాలు ఎక్కడున్నాయో తెలుసా? తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య రచించిన 32 వేల కీర్తనల్లో, త్యాగబ్రహ్మ త్యాగరాజస్వామి రచించిన 24 వేల కీర్తనల్లో మనకు అందుబాటులో ఉన్నవి ఎన్నో తెలుసా? మన ఆదికవుల కలాల నుండి జాలువారిన వేలాది గ్రంథాల ఆచూకీ ఎక్కడో తెలుసా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉండి లాభం లేదు. తమిళ గడ్డపై కొలువుదీరిన తంజావూరు సరస్వతీ మహల్‌కు వెళ్లాల్సిందే.
 
 వేలాది మూల గ్రంథాల నిలయంగా విరాజిల్లుతున్న ఈ లైబ్రరీ ప్రపంచంలోనే అతి పురాతన మ్యూజియంలలో ఒకటి. అందులో ఉన్న రమారమి నలభై తొమ్మిది వేల తెలుగు మూల గ్రంథాలలో పావు వంతు మాత్రమే ముద్రణ కాగా, మిగతా విలువైన తెలుగు సంపద తెలుగు పాలకులకు పట్టని వైనానికి సరస్వతీ మహల్‌లోని భాండాగారం బట్టబయలు చేస్తోంది.
 
 తంజావూరులోని సరస్వతీ మహల్ లైబ్రరీని తెలుగు రాజులైన నాయకర్లు కట్టించారు. అనంతరం వచ్చిన మరాఠా రాజు సర్ఫోజీ ఈ మహల్‌ను కాపాడుతూ వచ్చారు. దేశంలో ఎక్కడా లేనన్ని తాళపత్రాలు ఇందులో భద్రంగా ఉన్నాయి.  చరిత్ర, భాష, సాహిత్యం, ఆధ్యాత్మికం, వైద్యం, చిత్రకళ, నాట్యం వంటి అంశాలపై వేలాదిగా ప్రాచీన కాలంనాటి తాళపత్ర గ్రంథాలున్నాయి. ఇక్కడ మొత్తం 49 వేల మూల గ్రంథాలైన తాళపత్రాలు ఉండగా, ఇందులో 1,100 మాత్రమే తమిళానివి.  మిగిలిన గ్రంథాలన్నీ తెలుగు, సంస్కృతం తదితర భాషలవే. ప్రధానంగా తెలుగుజాతి అతి మూల గ్రంథాలైన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద, నన్నయ్య చోళుడి కుమార సంభవం, తిమ్మన పారిజాతాపహరణం, తొలి తెలుగు కావ్యం ఆంధ్ర మహాభారతం తదితర వేలాది గ్రంథాలు ఇక్కడ కొలువుదీరాయి. మరాఠీ రాజులు అతి భద్రంగా వీటిని రేపటి తరాల కోసం శ్రమించి భద్రపరిచారు. అనంతరం ఆంగ్లేయుల పాలనలో మరాఠీ రాజులు భద్రపరిచిన వేలాది అమూల్య తాళపత్రాలు ఆయా దేశాలకు తరలివెళ్లగా, అదృష్టవశాత్తూ మన ఆదిమూలాలు ఇక్కడే ఉన్నాయి. విశేషం ఏమిటంటే... వందలాది సంవత్సరాల నుండి మనం పట్టించుకోని మన గ్రంథాలను తమిళులు మాత్రం అపురూపంగా జాగ్రత్తపరచడం.
 
 16వ శతాబ్దం నాటిది!
 సరస్వతీ మహల్ లైబ్రరీ చరిత్ర ఇప్పటిది కాదు. 1535 - 1675 మధ్య కాలంలో తంజావూరును పాలించిన తెలుగు నాయకర్లు దీనిని ప్రారంభించి తాళపత్రాలను భద్రపరిచారు. 1675 తర్వాతి కాలంలో మరాఠీ రాజు సర్ఫోజీ మొదట దీనిని రాయల్ ప్యాలెస్ లైబ్రరీగా కొనసాగించినా, అనంతరం సరస్వతీ మహల్‌గా రూపుదిద్దుకుంది. 1918లో భారత ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకోగా, 1998లో ఇందులో మూల గ్రంథాల డిజిటలైజేషన్, కంప్యూటరీకరణ పనులకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి.
 
 ఒక గ్రంథాలయానికి అమూల్యమైనదన్న హోదా రావడానికి ప్రధానంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వాటిలో 17, 18, 19 శతాబ్దపు గ్రంధాలు; దేవనాగరి, నందినాగరి, తెలుగు, తమిళ తదితర భాషల రచనలు ఉండాలి. అంతేకాదు, ఇందులో చరిత్ర, వైద్యం, సంగీతం, నాట్యం అనే పలు అంశాలు ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కనుకే సరస్వతీ లైబ్రరీ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది.  ఇక్కడ 17 శతాబ్ద కాలం నాటి శిక్షల అమలు తీరును వివరించే చిత్రకళ, 24 వేల పద్యాల రామాయణ గ్రంథలిపి మూలాలు కూడా ఉన్నాయి. గ్రంధ లిపిలో శాంకరికీ - భామతికి భాష్యానికి వ్యాఖ్యానం, సావిత్రి కళ్యాణానికి సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒకటిన్నర అడుగుల తాళపత్ర మూలగ్రంథం, అతి చిన్నదైన కంభ రామాయణం మూలాలు సైతం ఉన్నాయి. దేవనాగరి లిపిలో విజయ రాఘవ నాయకర్ రచించిన పంచపక్ష శాస్త్రం కూడా ఇక్కడే కనిపిస్తుంది.
 
 ముద్రణకు నోచుకుంది పావువంతే!
 మన ఆదికవులు, కవిత్రయాల కలాల నుండి జాలువారిన వేలాది గ్రంధాలలో మనకు అందుబాటులో ఉన్నవి పావు వంతు కూడా లేవు. తాళపత్రాలుగా ఉన్న మూల గంధాలను ముద్రణలోకి తీసుకురావడంలో ఇప్పటికీ ప్రభుత్వాలకు ఆచరణ సాధ్యం కావటం లేదు. వందల ఏళ్లుగా మన సంపదను ఇక్కడికి తీసుకురావటంలోనూ మనం నిర్లక్ష్యం వహిస్తున్నాం. అలా నిర్లక్ష్యానికి గురైన వాటిల్లో ప్రధానంగా ఆంధ్ర ధీరోపకోశము, అన్నపూర్ణ పరిణయము, నృత్య రత్నావళి, భామా కలాపము వంటి వేలాది మూల గ్రంథాలు, విలువైన ఇతర రచనలు ఉన్నాయి.
 
 మరోవైపు అమూల్య గ్రంథాలను ముద్రించటానికి తాము సిద్ధంగానే ఉన్నామని తంజావూరు లైబ్రరీలోని పండితులు చెబుతున్నా, వాటిని అనువదించటానికి సరైన అనుభవం కలిగిన తెలుగు పండితుల కొరత ఉందంటున్నారు. ఈ లైబ్రరీని సందర్శించిన తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు వాటిని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చే విషయంపై ఆశాభావం వ్యక్తం చేసినా ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందన్నది అంతుచిక్కకుండా ఉంది.   
  సంజయ్ రావ్.గుండ్ల,
 ప్రత్యేక ప్రతినిధి, సాక్షి టీవీ, చెన్నై
 
 తెచ్చేందుకు ప్రయత్నాలు
         - మండలి బుద్ధప్రసాద్
 
 తెలుగుజాతి చరిత్ర, తెలుగు ప్రజల మూలాలపై దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పరిశోధనలు చేస్తున్న అధికార భాషాసంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ తన బృందంతో ఇటీవల తమిళనాడులో పర్యటించారు.  ప్రధానంగా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగుసంతతికి చెందిన ఆదిద్రావిడులు అధికంగా తమిళనాడులోనే స్థిరపడడంతో ఇక్కడి పలు ప్రాంతాలను ఆయన తరచు సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే తంజావూర్‌లోని ప్రఖ్యాత సరస్వతీమహల్ లైబ్రరీ,  విజయనగరరాజుల సామంతులైన నాయకర్ల పాలనలోని కుంభకోణం, మధురై, రామనాథపురం తదితర జిల్లాల్లో తెలుగు మూలాలను తరచి చూశారు. ఈ సందర్భంగా నాయకర్ల కాలంలో అచ్యుతప్పనాయకర్  మాన్యంగా ఇచ్చిన మేలట్టూర్ భాగవత గ్రంధాల తాళపత్రాలను సైతం పరిశీలించారు.  అదే విధంగా తంజావూర్‌లోని బృహదీశ్వరాలయం, మధురైలోని మీనాక్షీ ఆలయం, శ్రీవిల్లిపుత్తూర్ ఆలయాలను సైతం సందర్శించి ఆయా ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు సంతతికి చెందిన ప్రజలతో సమావేశమై భాషాపరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు.
 
  ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక మన తెలుగు గ్రంధాలు, తొలి తెలుగుశాసనాలను తిరిగి మన రాష్ట్రానికి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగానే చెన్నై ఏగ్మూర్‌మ్యూజియం, తంజావూర్ మ్యూజియంల నుండి తెలుగు ఆదిగ్రంధాలను, శాసనాలను మనరాష్ట్రానికి తీసుకొచ్చే విషయంపై ఆయా ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పర్యటనల్లో మండలిబుద్ధప్రసాద్‌తో పాటు తెలుగు భాషా పరిశోధకురాలు సగిలిసుధారాణి పలువురు అధికారులబృందం తమిళనాడులో పర్యటించింది.
 

మరిన్ని వార్తలు