రామాయణ చిత్రకూటం

2 Apr, 2017 01:17 IST|Sakshi
రామాయణ చిత్రకూటం

పచ్చటి కొండలు, ఆ కొండల మీద ఏపుగా పెరిగిన చెట్లు, గుబురుగా పెరిగిన పొదలు, దారుల వెంట  పారే వాగులు, మధ్యమధ్యలో కంటికి కనిపించకుండా చెవులకు వినిపించే గుప్త గోదారి, కొండల న డుమ సప్తస్వరాలతో కచేరీ చేస్తున్నట్లు పారే మందాకినీ నది... ప్రకృతి సౌందర్యానికి దర్పణం పట్టినట్టున్న అద్భుతమైన, అరుదైన చిత్రాలు... ఇదంతా ఎక్కడో అనుకుంటున్నారా... కాదు... మన దేశంలోనే..! సీతారామలక్ష్మణుల అడుగుజాడలను, వారి పరమ పావనమైన పాదధూళిని తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ పవిత్రమయిన, సుందరమైన ప్రదేశమే చిత్రకూటం.

పద్నాలుగేళ్ల వనవాసం చేయాలన్న పితృవాక్యపాలనలో భాగంగా రాముడు తన సోదరుడైన లక్ష్మణుడు, ప్రియసతి అయిన సీతాసాధ్వితో కలసి తొలుత చిత్రకూటాన్నే చేరి, అక్కడే కొద్దికాలం నివసించాడని వాల్మీకి రామాయణం చెబుతోంది. కేవలం సీతారామలక్ష్మణులు సంచరించినందువల్లే కాదు, చిత్రకూటానికి ఈ ప్రాముఖ్యత... అంతకు మునుపే చిత్రకూటం ఎంతో పుణ్యస్థలిగా, ఎన్నో తీర్థాలను ఇముడ్చుకున్న పుణ్యతీర్థంగా పేరు పొందింది.

అందుకే వాల్మీకి, భరద్వాజుడు చిత్రకూటం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాజిల్లాలో గల చిత్రకూటం ప్రకృతి సౌందర్యానికే కాదు... ఎందరో రుషుల తపోదీక్షకు ఆనవాళ్లు. అత్రి, అనసూయ, మార్కండేయుడు వంటి మునిపుంగవులు, గురువులకే గురువు దత్తాత్రేయుడు వంటి వారు తపస్సు ఆచరించేందుకు ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోయి, పర్ణశాలలు నిర్మించుకుని, ఇక్కడి మందాకినీ నదిలో స్నానమాచరించి, నది ఒడ్డునే తపస్సు చేసుకున్నట్లు స్థలపురాణ ం చెబుతోంది.

మధ్యప్రదేశ్‌ అడవులలో ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులలో ఉన్న ఈ పవిత్రస్థలిలో ప్రతి కొండా, గుట్టా, రాయీ రప్పా, చెట్టూ పుట్టా, వాగూ వంకా, తీర్థమూ జలపాతమూ... ఇలా ప్రతి ఒక్కటీ కూడా సీతారామ లక్ష్మణులు, వారి దాసుడైన హనుమంతుడి పేర్లతోనే ముడిపడి ఉంటాయి. కేవలం జీవంలేని ప్రదేశాలే కాదు.. ఇక్కడ జీవం పోసుకున్న ప్రతి వారి పేర్లలో సీతా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమంతుడూ ఉంటారు. వారి పిలుపులు కూడా రామ్‌ రామ్‌ అనే ఉంటాయి. తమకు తారసపడిన ప్రతి వారినీ రామ్‌ అనే పిలవడం వీరి ఆచారం.

కొండగుహలన్నీ రామనామ జపంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద బండరాళ్లమీద సీతమ్మ చీరలు ఆరవేసుకున్నట్లుగా... రామయ్య శయనించినట్లుగా... లక్ష్మణుడు సేదదీరినట్లుగా... హనుమంతుడు గంతులు వేసినట్లుగా ఆనవాళ్లుంటాయి. తండ్రి మృతివార్త విన్న రాముడు ఇక్కడే ఆయనకు పితృశ్రాద్ధం నిర్వహించాడట. పితృకార్యం నిర్వహిస్తున్నది సాక్షాత్తూ కోదండరాముడే కావడంతో ఆయన ను సేవించుకునేందుకు అనేకానేకమంది దేవతలు వివిధ రూపాలలో ఇక్కడకు వచ్చి, ఆ కార్యక్రమాన్ని జరిపించి, స్వయంగా తర్పణలు స్వీకరించారని స్థలపురాణం చెబుతోంది.

 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ అవతారాలు ధరించినట్లుగా కథనాలు వినిపిస్తాయి. మంధర పర్వతంతో పోటీపడి ఆకాశానికి అంటుతున్నట్లుగా పెరుగుతూ పోతున్న వింధ్యపర్వతాన్ని నేను వచ్చేవరకు నువ్వు ఇంక పెరగకుండా ఇలాగే ఉండు అని ఒకే ఒక్కమాటతో అగస్త్యుడు అడ్డుకట్ట వేసింది ఇక్కడేనంటారు.సీతారామలక్ష్మణులు నడయాడిన ఈ పవిత్రస్థలిలో తమ జీవితాలను కూడా పావనం చేసుకోవాలన్న తపనతో దేశం నలుమూలల నుంచి ఎందరో సాధుసజ్జనులు ఇక్కడకు వచ్చి ఏ చెట్టునీడనో, కొండగుహలోనో తపోదీక్షలో లీనమై యాత్రికులకు దర్శనమిస్తుంటారు.

అంతర్వాహినిగా గుప్తగోదావరి: మందాకినీ నదితోపాటూ యమునా నది కూడా ఇక్కడికి దాపులలోనే ఉంది. ‘మీరే కాదు, నేనూ ఇక్కడే ఉన్నాను’ అన్నట్లుగా ఇక్కడ అడుగుపెట్టిన పాదచారులకు తన చల్లని స్పర్శతో, గలగల శబ్దాలతో అంతర్వాహినిగా ప్రయాణిస్తూ ఓ గోదావరీ పాయ గుప్తగోదావరిగా పేరు తెచ్చుకుంది.

రామ్‌ఘాట్‌: మందాకినీ నది ఒడ్డున గల ఈ స్నానఘట్టంలోనే రాముడు రోజూ స్నానం చేసేవాడట. రామలక్ష్మణులు స్నానం చేసి వస్తున్నట్లుగా తులసీదాసు తన మనోనేత్రాలతో దర్శించాడట. అందుకే   దీనిని తన రామచరిత్‌ మానస్‌లో రామ్‌ఘాట్‌ అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు.

కామద్గిరి: మందాకినీ నది పరిక్రమ చేసే భక్తులు ఇక్కడ గల రామాలయాన్ని సందర్శించి, మొక్కులు మొక్కుకుంటారు. ఎందుకంటే కామదనాథుడనే పేరుగల రాముడు కోరిన కోరికలు తీర్చే వేల్పుగా ప్రసిద్ధిపొందాడు.  ఇక్కడే అనేక ఆలయాలున్నాయి.

భరత్‌ మిలాప్‌: తన అన్నగారు ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్న భరతుడు వేలాదిమంది సైనికులను, పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చి, రాముణ్ణి కలిసిన ప్రదేశమిది. వనవాసం చేయమని చెప్పిన తండ్రిగారు మరణించారు కాబట్టి, ఇక ఆ ఆజ్ఞను పాలించవలసిన అవసరం లేదని, వచ్చి, అయోధ్యను ఏలుకొనమని భరతుడు బతిమాలుతాడు రాముణ్ణి. రాముడు అందుకు అంగీకరించకపోయేసరికి ఆయన పాదుకలను తీసుకుని, నెత్తిన పెట్టుకుని వెళ్లి, ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి, రాజ్యపాలన చేశాడు. రాముణ్ణి భరతుడు కలిసిన ప్రదేశం కాబట్టి, భరత్‌ మిలాప్‌ అనే పేరొచ్చింది. ఇక్కడ భరతుడికి చిన్న మందిరం ఉంది.

జానకి కుండ్‌: రాముడు స్నానం చేసిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే సీతాదేవి స్నానం చేసేదట. అందుకే ఈ ఘట్టానికి జానకి కుండ్‌ అనే పేరొచ్చింది.

సతీ అనసూయ ఆశ్రమం:  సీతారాములు వనవాసానికి  వచ్చినప్పుడు అనసూయాశ్రమాన్ని సందర్శించారట. అప్పుడు అనసూయ సీతకు పాతివ్రత్య ధర్మాలను బోధించడంతోపాటు, రకరకాల లేపనాలను, రుచిగల పండ్లను, చీరలను కానుకగా ఇచ్చిందట.

హనుమాన్‌ ధార: చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 3000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రదేశానికి చేరాలంటే కనీసం రెండువేల మెట్లను ఎక్కవలసిందే! ఎంతో ప్రయాసకు ఓర్చి ఇక్కడ వరకు వచ్చిన వారి అలసట, మార్గాయాసం అంతా తీరిపోయేలా పురాతన హనుమద్విగ్రహం దర్శనమిస్తుంది. ఎక్కడినుంచి పడుతోందో తెలియని విధంగా నిత్యం జలధార పడుతూ, విగ్రహాన్ని అభిషేకిస్తుంటుంది. హనుమను అభిషేకించిన జలాన్ని తీర్థంలా సేవిస్తారు యాత్రికులు. హనుమాన్‌ ధారలో హనుమంతుని విగ్రహంతోపాటు ఇంకా అనేక గుడులుంటాయి.

భరత్‌ కూప్‌: రాముడిని ఆహ్వానించడానికి విచ్చేసిన భరతుడు ఆయనను అక్కడే చక్రవర్తిగా అభిషేకించాలన్న సంకల్పంతో ఐదునదుల నీటిని తీసుకు వచ్చి, ఒక బావిలా తవ్వి, ఆ నీటితో నింపాడట. అదే భరతుడి కూపంగా పేరు పొందింది.

రామశయ్య: సీతారామలక్ష్మణులు తాము శయనించేందుకు వీలుగా ఒక పెద్ద చెట్టునీడన గల రాతిప్రదేశాన్ని శయ్యలా చెక్కారట. ఈ రాతిపరుపు పైనే సీతారాములు శయనించేవారట.

 అదే రామశయ్యస్ఫటిక శిల: సీతారాములు కూర్చున్న ఒక రాతితిన్నెకే స్ఫటిక శిల అని పేరు. సీతారాముల పాదముద్రలు ఈ శిలపై మెరుస్తూ కనిపిస్తాయి.

ఉత్సవాలు... పర్వదినాలు: చిత్రకూటంలో ప్రతి అమావాస్యకూ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఇంకా దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీ, ఉగాది వంటి అన్ని హిందూ సంప్రదాయ పండుగలప్పుడూ ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రత్యేకించి దీపావళి సమయంలో జరిగే దీపదానోత్సవానికి భక్తులు వేలాదిగా హాజరవుతారు.

ఇతర సందర్శనీయ స్థలాలు: చిత్రకూటాన్ని సందర్శించవచ్చే భక్తులు అలహాబాద్, వారణాసి, ఖజురహో, బాంధవ్‌ గర్, పన్నా నేషనల్‌ పార్క్‌ తదితరాలను కూడా సందర్శిస్తారు. భోజన, వసతి సదుపాయాలు: చిత్రకూటాన్ని సందర్శించే యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ పర్యాటక మంత్రిత్వ శాఖలవారు విడివిడిగా అందుబాటు ధరలలో భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇవిగాక ప్రైవేటుగా బడ్జెట్‌ హోటళ్లు కూడా ఉన్నాయి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు